రైతు శాస్త్రవేత్తలకు పెద్దపీట!

27 Apr, 2014 23:56 IST|Sakshi
రైతు శాస్త్రవేత్తలకు పెద్దపీట!

‘సాగుబడి’తో ముఖాముఖిలో ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్
 .
మెరుగైన సాగు పద్ధతులను, మెలకువలను రైతాంగం దరికి చేర్చే క్రమంలో రైతు శాస్త్రవేత్తలకు పెద్దపీట వేస్తున్నామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ వెల్లడించారు. శాస్త్ర విజ్ఞానాన్ని, సంప్రదాయ విజ్ఞానంతో మేళవించి సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న రైతు శాస్త్రవేత్తలతో ఐసీఏఆర్ ప్రాంతీయ సమవేశాల్లో ప్రత్యేక సెషన్‌ను కూడా నిర్వహిస్తున్నామన్నారు. రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఎండిన మట్టినే ఎరువుగా వాడుతూ నాణ్యమైన, అధిక పంట దిగుబడులు సాధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుందనపల్లిలోని వెంకటరెడ్డి ద్రాక్ష తోటను డా. అయ్యప్పన్ ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబుతో ముచ్చటించారు. ఇవీ ముఖ్యాంశాలు..
 
 రసాయనిక ఎరువులు వాడకుండా ఎండిన మట్టినే ఎరువుగా వాడే వెంకటరెడ్డి వినూత్న సాగు విధానంపై మీ అభిప్రాయం ఏమిటి?
  ఎండిన మట్టినే ఎరువుగా వేస్తూ ఏళ్ల తరబడి పండిస్తున్న ద్రాక్ష తోట గురించి గతంలో విన్నాను. ఇవ్వాళ స్వయంగా చూడడం ఆనందంగా ఉంది.. అద్భుతం. అనేక రాష్ట్రాల్లో ద్రాక్ష తోటలను చూశా. కానీ, ఈ తోట చాలా ప్రత్యేకమైనది. మట్టిని ఎరువుగా వేసి ఏళ్ల తరబడి నాణ్యమైన, అధిక దిగుబడులు సాధిస్తూ ఉండడం గొప్ప విషయం. ఈ పొలం వ్యవసాయ పరిశోధన సంస్థగా మారిపోయింది. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులను 3,4 నెలల పాటు ఈ క్షేత్రానికి డిజర్టేషన్‌కు పంపిస్తాం. ఈ తోట నాకు భూలోకంలో వైకుంఠంలా కనిపిస్తోంది..

 ఏ, సీ విటమిన్లతో కూడిన వరి, గోధుమలను కూడా వెంకటరెడ్డి గారు పండిస్తున్నారు. ‘గోల్డెన్ రైస్’ అవసరమే లేదని అంటున్నారు. ఈ సాగు పద్ధతిని రైతుల దగ్గరకు తీసుకెళ్లడానికి ఐసీఏఆర్ ఏమైనా చేయబోతోందా? శాస్త్ర విజ్ఞానం, సంప్రదాయ విజ్ఞానం మేళవింపుతో ఆవిష్కృతమైన ఈ టెక్నిక్ ఇక్కడి(రంగారెడ్డి జిల్లా) ఎర్ర నేలల్లో, ఈ వాతావరణంలో మంచి దిగుబడుల నిస్తున్నది. అయితే, ఇతర ప్రాంతాల్లో ఎలాంటి ఫలితాల నిస్తుందో తెలీదు. మా పరిశోధన కేంద్రాల్లో పరీక్షించి చూస్తాం. ఎక్కడెక్కడ మెరుగైన ఫలితాలు వస్తే.. అక్కడి రైతులకు ఈ ఇన్నోవేటివ్ నమూనాను ఆచరించమని సిఫారసు చేస్తాం. దేశవ్యాప్తంగా పలువురు రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వినూత్న సాగు పద్ధతులను, యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్నారు కదా..?

  నిజమే. గత నాలుగేళ్లుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థలన్నిటిలోనూ రైతు శాస్త్రవేత్తల దినోత్సవం నిర్వహిస్తున్నాం. వారి విజయాలను రికార్డు చేస్తున్నాం. ప్రాంతీయ సమావేశాల్లో వీరితో ప్రత్యేకంగా ఒక సెషన్ నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ప్రపంచ కుటుంబ వ్యవసాయ సంవత్సరం. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ శతజయంతి సంవత్సరం కూడా. ‘మీకు తెలిసిన దాన్ని రైతుల దగ్గరకు తీసుకెళ్లండి’ అనేది ఆయన చివరి కోరిక. ఈ లక్ష్య సాధన క్రమంలో రైతు శాస్త్రవేత్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వాతావరణ మార్పులపై తాజా నివేదికల నేపథ్యంలో వ్యవసాయ ఉద్గారాలను తగ్గించే చర్యలేమైనా తీసుకుంటున్నారా?
 
పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల వల్ల ఉద్గారాలు తగ్గుతున్న విషయం గురించి ఎవరూ గుర్తించడం లేదు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ దారులకు పర్యావరణ అనుకూల పద్ధతులు పాటిస్తున్న పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లుగానే ఆర్థిక ప్రయోజ నాలు చేకూర్చాలని మేం అడుగుతున్నాం..కరువుసీమ అనంతపురంలో జిగురు గోరుచిక్కుడు, కీన్‌వా తదితర పంటలను సాగు చేయిస్తున్నారు కదా.. ఫలితాలు ఎలా ఉన్నాయి? జిగురు గోరుచిక్కుడు సాగు చేసిన రైతులకు మంచి ధర వచ్చింది. కీన్‌వాను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అలాగే, టెఫ్ అనే పంటనూ ప్రయత్నించవచ్చు. అయితే, ఇక్కడున్న సమస్యేమిటంటే.. ఒక పంట బాగుంది అన్నామంటే.. రైతులందరూ అదే పంట వైపు వెళ్తుంటారు. అదే ఇబ్బంది.. ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే సమస్య ఉండదేమో? అవును..
 
 

>
మరిన్ని వార్తలు