నేటి భారతంలో వర్గం కొత్త కులం

17 Oct, 2015 00:49 IST|Sakshi
నేటి భారతంలో వర్గం కొత్త కులం

జాతిహితం
సంపద పెరుగుతున్నా మనవాళ్ల దృక్పథాలు మాత్రం మారలేదు. సంపన్న వర్గాలు పని మనిషి సహాయం అవసరమయ్యేంత తీరుబడి లేకుండా లేదా సోమరులుగా మారుతున్నాయి. అట్టడుగు, అతి పేద స్థాయి పురుషులు, స్త్రీలు ఎక్కువగా వారి ఇళ్లల్లోకి, జీవితాల్లోకి ప్రవేశిస్తున్నారు. అది కూడా మన ఉన్నత, ఉన్నత మధ్యతరగతి అస్తిత్వపు సంప్రదాయక కొలబద్ధల పరిధిలోనే. నేటి భారతంలో వర్గం ఒక కొత్త కులం. అప్పుడప్పుడూ, అదీ కొద్దిసేపే, ఒక ఆదివాసి బాలిక గాయాలతో టీవీలోంచి సూటిగా మన కళ్లలోకి చూస్తుంటే చలించిపోతాం, అంతే.
 
గుర్గావ్‌లోని సంపన్నవంతులైన భార్యాభర్తలు 14 ఏళ్ల పని మనిషిని పదే పదే చావబాదిన కథనం గురువారం వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఆ ఆదివాసి పని మనిషి ఒక అల్మారా వెనుక నక్కి ఉండగా లేదా బలవంతంగా బంధించి ఉండగా కాపాడారు. ఆమె ఒంటిపై కమిలిన గాయాలు, తెగి చీరుకుపోయిన మచ్చలు ఉన్నాయి. ఎప్పటిలాగే వారామెను కొట్టి, గోడకు తోసేశారని, కత్తితో గాటు కూడా పెట్టారని ఆమె టీవీ చానళ్లకు చెప్పింది. తను ‘‘నచ్చ లేదు’’ కాబట్టే యజమానులు తనను కొట్టేవారని ఆ బాలిక చెప్పడం అన్నిట్లోకీ గగుర్పాటు కలిగించే విషయం.
 
 పని మనుషులపట్ల ప్రదర్శించే క్రూరత్వంలో ఇది ఒక అత్యంత తీవ్రమైన ఉదంతమే. కానీ ఇది అరుదైనదేమీ కాదు. ఇదే గుర్గావ్ ప్రాంతంలో ఒక సౌదీ దౌత్యవేత్త ఇంటి నుంచి నేపాలీ సంతతికి చెందిన ఒక పని మనిషిని ఇటీవలే కాపాడారు. ఆమెపై పదే పదే అత్యాచారానికి పాల్పడి, ఐఎస్‌ఐఎస్ శైలిలో అమానుషంగా హింసించారు. జార్ఖండ్ పనిమనిషికి సంబంధించిన తాజా ఘటనపై సమాజం నుంచి, పోలీసుల నుంచి తక్షణమే ప్రతిస్పందన వచ్చింది. అందుకు కారణం బహుశా సౌదీ దౌత్యవేత్త కథనం సృష్టించిన సంచలనమే కావచ్చు.
 
పరాధీనత సంపన్నుల హక్కు
యజమాని-సేవకుడు అనే ఈ సంబంధం మన దేశంలో సమస్యాత్మకంగా ఉంటోంది. సంపదలు పెరుగుతుండటంతో పాటూ, రెండు ఆదాయాల జంటలకూ, న్యూక్లియార్ (భార్యాభర్త, పిల్లలు)  కుటుంబాలకు ఇంటి పని మనుషుల అవసరమూ, దానితో పాటే వర్గ విభజన కూడా పెరిగాయి. మన భారతీయులం ప్రపంచంలోనే అతి ఎక్కువగా ‘‘నౌకర్ల’’పైన ఆధారపడే వారి కోవలోకి వస్తాం. మన గిన్నెలు కడగటం నుంచి మరుగుదొడ్లను శుభ్రం చేయడం వరకు, మన పిల్లలను తయారు చేయడం నుంచి కుక్కలను బయట తిప్పుకు రావడం వరకు, పని ప్రదేశానికి డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లడం నుంచి మన లంచ్ బాక్స్‌లను తెరచి పెట్టడం, మన బట్టలు ఇస్త్రీ చేసిపెట్టడం వరకు... మనకు ఇంటి పనిమనుషుల అవసరం పరిపూర్ణమైనదిగా మారింది. నిద్ర సమయాన్ని మినహాయిస్తే కనీసం వారంలో ఏడు రోజులూ, రోజుకు 16 గంటలు వారు పనిచేయాల్సిందే. ఈ శ్రామికులను ప్రధాన స్రవంతికి చెందిన ఇంగ్లిష్ పత్రికలు సైతం ‘‘డొమెస్టిక్స్’’ (ఇంటి పనిమనుషులు) అనే అంటాయి.
 
సంపన్నవంతులు ఎక్కువయ్యే కొద్దీ వారు పని మనిషి సహాయం అవసరమయ్యేంత తీరుబడి లేకుండా లేదా సోమరులుగా మారుతున్నారు. అట్టడుగు, అతి పేద స్థాయి పురుషులు, స్త్రీలు  ఎక్కువగా వారి ఇళ్లలోకి, జీవితాల్లోకి ప్రవేశిస్తున్నారు. వంటవాళ్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు (వాళ్లే అప్పుడప్పుడూ ద్వార పాలకులు కూడా), ఇంటిని శుభ్రం చేసేవాళ్లు, ఇంటి పనులన్నిటినీ చక్కబెట్టేవాళ్లు, వ్యక్తిగత సేవకులు, పిల్లలను చూసుకునే వారుగా వాళ్లు మన ఉన్నత/ఉన్నత మధ్యతరగతి అస్తిత్వపు సంప్రదాయక కొలబద్ధల పరిధిలోనే మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నారు. అర్థనిపుణ శ్రామికుల మార్కెట్లో కొనుక్కునేవాళ్ల ఇష్టారాజ్యమైన పనిమనుషుల మార్కెట్ ఎంత  ఏకపక్షమైనదో మీకు తెలుసుకోవాలనుందా? ‘టీమ్ లీజ్ ఇండియా’ అల్ప, మధ్యస్థ స్థాయి నిపుణ శ్రామికులకు ఉద్యోగాలిప్పించే మధ్యవర్తి సంస్థ. అలాంటి సంస్థల్లో అది దేశంలోనే మూడో అతి పెద్దది. ‘‘గత ఐదేళ్లుగా మా కంపెనీ ప్రతి ఐదు నిమిషాలకు ఒక కొత్త వ్యక్తిని పనిలో నియమిస్తోంది. అయినా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 5 శాతానికి మాత్రమే పని చూపగలిగాం’’ అంటూ ఆ సంస్థను నడిపే మనీష్ శబర్వాల్ బాగా ఆలోచించాల్సిన విషయాన్ని చెప్పారు.
 
కలవారి ఇంట్లో రెండు వర్గాలు
2008లో ఆనంద్ గిరిధరదాస్ ‘న్యూయార్క్ టైమ్స్’లో రాసిన ఒక వ్యాసంలో సరిగ్గా ఇదే విషయాన్ని ఒక ఐదు నక్షత్రాల హోటల్ టాయ్‌లెట్‌ను తీసుకుని వివరించారు. ఈ టాయ్‌లెట్లలో మనుషులు రెండు రకాలుగా విభజితమై ఉంటారు. సబ్బును ఉపయోగించుకునే వారు, డిస్పెన్సర్ నుంచి సబ్బును మీ చేతిలోకి పిండి, పంపు తిప్పి కట్టేసి, గ్లౌజులు తొడుక్కున్న చేతులతో మీకు టవల్ అందించి తిరిగి దాన్ని తీసుకుని, పంపును తుడిచి, టిప్పు ఇచ్చో ఇవ్వకుండానో మీరు బయటకుపోతుంటే ‘థ్యాంక్యూ’ అని గొణిగేవారు.
 
మనకున్న సువిశాలమైన చౌక శ్రమశక్తి రిజర్వాయరు ఇతర సృజనాత్మక ఉపయోగాలకు కూడా ఉపయోగపడుతోంది. అత్యంత సంపన్నవంతమైన మన పాత కంపెనీల కార్పొరేట్ ఆఫీసుల్లో ఒక బంట్రోతు మీ వెంటే వస్తాడు. గ్లౌజులు తొడుక్కున్న చేతులతో తలుపుకు తళతళ మెరుస్తున్న ఇత్తడి పిడిని పట్టుకుని తలుపు తెరుస్తాడు, లేదా మీరే దాన్ని తిప్పితే మెత్తటి గుడ్డతో దాన్ని తుడుస్తాడు. చాలా అత్యున్నత స్థాయి హోటళ్లు తమ వద్ద వ్యక్తిగత బట్లర్లు, సేవకులున్నారని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాయి.  
 
వృద్ధితో పాటూ పనిమనుషుల పెరుగుదల
ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం ఈ వైఖరులు మరింత అధ్వానం కావడానికే తోడ్పడింది. ముగ్గురు చిన్న పిల్లలున్న ఓ జంట ఇప్పుడు ముగ్గురు పని మనుషులను నియమించుకుంటోంది. వారిని తమతో పాటూ రెస్టారెంట్లకు, కిట్టీ పార్టీలకు, సెలవుల్లోని ప్రయాణాలకు విమానాల్లోకి లాక్కుపోతారు. ఈ పరాధీనత తీవ్రమైనదే. అయినా, ఎలాంటి ఫిర్యాదులూ చేయని ‘‘మెట్ల కింది’’ తరగతి అతి పెద్దదిగా ఉండ టానికి విస్తృత ఆమోదం ఉంది కాబట్టి ఆ సదుపాయం అందుబాటులోనే ఉంది. మన కొత్త అపార్ట్‌మెంట్ భవనాల్లో ‘‘నౌకర్ల క్వార్టర్స్’’గా పిలిచే శవపేటికంత పడక స్థలాలను ఓసారి చూడండి. చౌకగా నౌకర్లను నియమించుకునే హక్కు మనకుందనే ఈ స్పృహ దేవయాని కోబ్రగడే ఉదంతంలో అతి కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. దేవయాని విష యంలో అది ఆవశ్యకంగా దౌత్యపరమైన రక్షణేగానీ, ఏ భారతీయునికైనా అతి చౌకగా దొరికే పని మనిషిని పెట్టుకునే హక్కు ప్రాథమిక హక్కుగానే ఉంది.
 
పేదలకు అనుకూలమైనదిగా, మధ్యస్తవాదుల్లో వామపక్షంగా చెప్పుకునే యూపీఏ ప్రభుత్వం సైతం ఈ హక్కు విషయంలో తన అత్యంత ముఖ్య మిత్రునితో (అమెరికా) సంబంధాలను చెడగొట్టుకోడానికి సిద్ధపడింది. మీడియా అంతా ఆ దౌత్యవేత్త వెనుక నిలిచి, భారత దేశానికి అప్రతిష్ట తేవడానికి విదేశంతో కుమ్మక్కయిన వ్యక్తిగా, అంత గొప్ప పని ఇచ్చినందుకు కృతజ్ఞతలేని దానిగా ఆ పనిమనిషిని తీసిపారేసింది. కనీస వేతనాల సంగతి మనకు అనవసరం. 2013, డిసెంబర్ 21 నాటి జాతిహితం ‘మన ఫ్యూడల్ సర్వీస్’లో నేను ఈ అంశాలను లేవనెత్తిన వెంటనే విదేశీ వ్యవహారాల సర్వీసులకు చెందినవారు దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. ఆ కథ ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది.
 
‘బాధితులు’, ‘అనుమానితులు’
గిరిధర్‌దాస్ ఒక బాలీవుడ్ సినిమాను (‘బారా అణా’ 2009) తీసుకుని యజమానులు, డ్రైవర్ల జీవితాల ద్వారా ఈ విషయాన్నే చెప్పాడు. తాజాగా మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ‘తల్వార్’ను నేను అందుకు ఉదాహరణగా చూపగలను. ఆ సినిమాకు నా మిత్రుడు విశాల్ భరద్వాజ్ స్క్రిప్ట్ రాశారు. ఆరుషి-హేమరాజ్ కేసుపై నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. నేనిక్కడ చూపుతున్నది ఆ కథలోని రెండు రకాల లేదా వర్గాల మను షులను మాత్రమే. ఒక రకం సుతారంగా, నాగరికంగా, ప్రేమాస్పదంగా, కష్టపడి పనిచేసేవారై ఉంటారు. బాధితులని వారి మొహాల మీదే రాసి ఉంటుంది. మరో రకం అతి మొరటుగా వాగుతూ, తాగుతూ, కాముకులై, వెకిలిగా నవ్వుతూ ఉండేవారు. సాధారణంగా అలాంటి వారికి నిలువెల్లా ‘అనుమానాస్పదులు’ అని రాసుంటుంది.
 
నాలాంటి చాలా మంది ఆ సినిమా చూసి వస్తూ జరిగిన ‘‘అన్యా యానికి’’ చలించిపోయారు. మరుసటి రోజున ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ మన నౌకర్లకు కూడా ఆ సినిమా చూపించమని సలహా చెబితే మెచ్చుకున్నాం (ఆ సినిమా నిర్మాతే ఆ పత్రికకు కూడా యజమాని). అంటే, ఆ సినిమా చూసి వాళ్లు అపరాధ భావనకు లోనవుతారని మనం ముందస్తుగానే ఊహించాం. ఆ కేసు పరిశోధననూ, సుప్రీంకోర్టు ఆదేశాలు సహా 16 ఆదేశాల మేరకు సాగిన న్యాయ ప్రక్రియను చెడగొట్టేసి, తారుమారు చే సేయగలిగే శక్తి ముగ్గురు పేద నేపాలీ పని మనుషులకు ఉంటుందే తప్ప, ఉన్నత స్థానాల్లోని వారితో మంచి సంబంధాలున్న ఆ దంత వైద్యులకు ఆ శక్తి ఉండదా? అని అడగాలని మాత్రం ఎవరికీ అనిపించలేదు.
 
వర్గం నేటి కులం
ఆ సినిమాలో నార్కో టెస్టులు చేసిన ‘‘డాక్టర్’’ మెదడును ఒత్తిడికి గురిచేసే రసాయనాన్ని దంత వైద్యులైన భార్యాభర్తల కంటే మరింత ఎక్కువగా నౌకర్ల శరీరాల్లోకి ఎక్కించడానికి సిద్ధపడటాన్ని ఎవరూ గమనించలేదు. ఒక సీబీఐ అధికారి ఒక దిగువస్థాయి ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్‌ని ప్యాంటు విప్పి లాఠీతో నీ మొలల వ్యాధిని కాస్త సరిచేసుకోరాదా? అని అడిగితే మనం ఆనందించాం, కొంటెగా నవ్వుకున్నాం (మాయావతి పాలనలోని యూపీలోనే కాదు, మరే రాష్ట్రంలోనైనా నిజంగానే ఒక సీబీఐ అధికారి ఒక కానిస్టేబుల్‌ను అలా అడగటం చూడాలని ఉంది).
 
 ఆ మంచి సీబీఐ పోలీసు కూడా నేపాలీ నౌకర్‌ను చావబాదుతాడు. మనం అది బాగానే ఉందనుకుంటాం. అతని జూనియర్ సహోద్యోగి దాన్ని తన ఫోన్లో రికార్డ్ చేసినందుకు అతన్ని ద్రోహి అనుకుంటాం. అంతేగానీ ప్రజా ప్రయోజన కార్యకర్త అనుకోం. అదే ఆ దంత వైద్యులనే అలా కొట్టి ఉంటే తప్పకుండా అతన్ని అలా గొప్పగానే చూసేవాళ్లం. విశాల్ భరద్వాజ్ వంటి సున్నితమైన, జాగరూకతగలిగిన వ్యక్తి అలాంటి స్క్రిప్టును రాసినప్పుడు ఇక ఊపిరి సలపని సినిమా విమర్శకులను తప్పుపట్టడం ఎందుకు? పునరుజ్జీవితమవుతున్న నేటి భారతావనిలో వర్గం ఒక కొత్త కులం. అనివార్యంగానే ఒకటి మరోదానికి చక్కగా అతుకుతుంది. అప్పుడప్పుడూ, అదీ కొద్ది కాలమే, జార్ఖండ్‌కు చెందిన ఒక ఆదివాసి బాలిక గాయాలతో టీవీలోంచి సూటిగా మన కళ్లలోకి చూస్తుంటే మాత్రం చలించిపోతాం.

శేఖర్ గుప్తా
twitter@shekargupta

మరిన్ని వార్తలు