మోదీ ఎదపైనా ఎర్రగులాబీ!

28 May, 2016 00:25 IST|Sakshi
మోదీ ఎదపైనా ఎర్రగులాబీ!

జాతిహితం
 
నెహ్రూ మాదిరిగానే నరేంద్ర మోదీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. అలాగే అలీన విధానం పట్ల విశ్వాసం కలిగినవారు. మోదీ అనుకూలురు నిరసించినా, పాలన, వ్యక్తిగత శైలీ వ్యవహారాలు నెహ్రూ తరువాత కనిపిస్తున్న నెహ్రూవియన్ ప్రధాని మోదీయే అనిపించేటట్టు చేశాయి.
 
 
జవహర్‌లాల్ నెహ్రూ తరువాత మళ్లీ ఆయన విధానాలను అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనంటూ నేను ఈ వారం కాలమ్‌ను ఆరంభించాను కనుక, ప్రజలను ఆకర్షించడానికి ఏదో విన్యాసం చేస్తున్నానని కొత్త మీడియా అనవచ్చు. ఇలా చెబుతున్నాను కాబట్టి, ఆ విషయం మరోసారి ఆలోచించు కోమని నన్ను మీరంతా అడగడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తాయి.
 
 మరీ ముఖ్యంగా ఇప్పుడు- నెహ్రూ వారసత్వాన్ని నిర్మూలించడం, పాఠ్య పుస్తకాలలో ఆయన పేరును చెరిపివేయడం, నెహ్రూగారి పేరుతో ఏర్పాటైన వ్యవస్థలను కాషాయీకరించడంతో పాటు; గాంధీజీ హత్య మొదలు కశ్మీర్ సమస్య, టిబెట్ సరిహద్దు వివాదం, అనువంశిక పాలన వంటి  భారతదేశ సర్వ సమస్యలకు మూలం నెహ్రూ విధానాలేనన్న ఆరెస్సెస్ ఆలోచనకు ఊతం ఇవ్వాలన్న ఏకసూత్ర ప్రణాళికతో మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న కాలంలో నెహ్రూతో ఆయనను పోల్చడం గురించి ఆలోచించుకోమని చెప్పవచ్చు. అలాగే ఒక ఐఏఎస్ అధికారి నెహ్రూను శ్లాఘిస్తూ ఫేస్‌బుక్‌లో రాసిన నేరానికి ఆయనను ఒక రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన కాలంలో ప్రథమ ప్రధానికీ మోదీకీ పోలిక తేవడం గురించి ప్రశ్నించవచ్చు.
 
 మోదీ ప్రభుత్వ స్పందనలోని వాస్తవం ఎంతో ఒక్కసారి పరిశీ లిద్దాం. మనలాంటి అపండితులు కూడా నెహ్రూ విధానాలకు ముఖ్య మైన నాలుగు స్తంభాలు ఉన్నాయని చెప్పగలరు. అవి: సుదృఢమైన లౌకిక వాదం, సామాజిక ఉదారవాదం- సామ్య వాదం (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ), అలీన విధానం, అంతర్జాతీయవాదం. ఈ నాలుగు అంశా లలో దేనిపట్ల ప్రస్తుత మోదీ ప్రభు త్వం వివక్ష చూపగలదు? ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఈ నాలుగు స్తంభాలలో ప్రస్తుతం ఏది మిగిలి ఉంది?
 
 ఈ నాలుగు స్తంభాలలో రెండింటిని కాంగ్రెస్ ప్రధాన మంత్రులే ధ్వంసం చేశారు, లేదా బాగా బలహీనపరిచారు. దైవభావనకు, ఇంద్రి యాతీత శక్తులకు అతీతమైన  దృఢ లౌకికవాదాన్ని నరసింహారావు పునర్ నిర్వచించి, తేలిక పరిచారు. దానిని మెత్తని హిందూత్వగా కూడా పిలవవచ్చు. నిజానికి నరసింహారావు సాగించిన ఈ నిర్మాణం నెహ్రూ మనుమడు రాజీవ్‌గాంధీ వేసిన పునాది పైనే జరిగింది.
 
 రాజీవ్‌గాంధీ రామజన్మ భూమి తాళాలు తెరిపించి, అక్కడి నుంచే రామరాజ్య స్థాపన నినాదంతో 1989 ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సామ్యవాదాన్ని కూడా నరసింహారావే కూల్చివేశారు. ఆయన తన మంత్రిమండలిలో ఆర్థికమంత్రి, తరువాత ప్రధానమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ సాయంతో ఈ పని చేశారు. ఆఖరికి సోనియా, రాహుల్ గాంధీ కాలంలో కూడా మన్మోహన్‌సింగ్ ఈ కార్యక్రమం కొనసాగించారు. అయితే వీళ్లు ప్రారంభించిన కొత్త కార్యక్రమాలకు నెహ్రూ పేరు మాత్రం పెట్టలేదు. ఆఖరికి విదేశాంగ విధానం కొత్త మలుపు తీసుకున్నది కూడా నరసింహారావు హయాంలోనే. ఆయన మొదటి నుంచి తప్పటడుగులు వేశారు. సోవియెట్ రష్యా పతనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలకు మొగ్గారు. ఈ విధానం కాంగ్రెస్ పార్టీలో కూడా, మణిశంకర్ అయ్యర్ సహా ఆగ్రహావేశాలకు గురిచేసింది.
 
  వాజ్‌పేయి యువ పార్లమెంటేరియన్‌గా తరచూ నెహ్రూతో విభే దిస్తూ ఉన్నా, ఏనాడూ ఆయన గురించి కఠినంగా మాట్లాడలేదు. వాజ్ పేయి తన ఆరేళ్ల పాలనలో పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను, భారత పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన దాదాపు 30 హోటళ్లను ప్రైవేటు పరం చేయడం చూస్తే వింత అనిపిస్తుంది. కానీ ఆయన కంటే ముందు అధికారం చేపట్టిన పీవీ, మన్మోహన్‌సింగ్ నెహ్రూ ప్రతిపాదిత ఆర్థిక విధానాల నుంచి దూరంగా జరగడం వల్లనే వాజ్‌పేయికి ఇది సాధ్య పడింది.
 
 అయితే వీరంతా ఉల్లంఘించిన దృఢమైన ఆ సామ్యవాదం నెహ్రూ వారసత్వంగా వచ్చినదా, లేక ఇందిర వారసత్వమా అన్న విలువైన వాదనలు ఎప్పుడూ ఉంటాయి. కానీ దానిని నిర్ధారించడం ఇప్పుడు సాధ్యం కాదు. సామ్యవాదాన్ని నెహ్రూ జాతీయ ఆర్థిక సిద్ధాం తంగా మలిచారు. ఇందిర దానిని ప్రైవేటు రంగాన్ని ముఖ్యంగా విదేశీ సంస్థల అధీనంలోని ప్రైవేటు రంగాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగిం చుకున్నారు. అయితే తామే పెద్ద సామ్యవాదులమని చెప్పుకోవడానికి అందరూ పోటీ పడ్డారు.
 
 ఎమర్జెన్సీ తరువాత ఇందిరాగాంధీ ప్రభుత్వం స్థానంలో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ఆస్తిహక్కును తీసేసుకుంది. కానీ రాజ్యాంగ పీఠికలో చట్ట విరుద్ధంగా చేర్చిన రెండు మాటలు ‘సెక్యుల రిజమ్, సోషలిజమ్’ అన్నమాటలను ఉంచడానికి మాత్రం అంగీకరిం చింది (అవి చట్ట విరుద్ధం ఎందుకయ్యాయంటే, విపక్షం కారాగారంలో ఉండగా ఆరో లోక్‌సభ ఆమోదించిన చట్టాలు). కోక్‌ను, ఐబీఎంను గెంటేసింది. అలాగే తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరాన్ని గౌరవిస్తూ సర్కారీ కోలా ‘77’ను ప్రారంభించింది కూడా. మార్కెట్ అనుకూల ప్రధానిగా మొరార్జీదేశాయ్‌కి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఉన్నా, ఆయన మాత్రం తనను నెహ్రూ విధానాలకు కాకుండా గాంధేయవాద సిద్ధాంతాలకు అనుకూలునిగా ప్రపంచం చేత నమ్మించ డానికి ప్రయత్నించారు.
 
 ఇప్పుడు ఈ వారం కాలమ్‌లో చర్చి స్తున్న విషయం దగ్గరకు వద్దాం. ఇంకా వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రభుత్వ రంగ సంస్థల అవసరం గురించీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించీ భారత ప్రధాని ఒకరు మాట్లాడగా విని కొన్ని దశాబ్దాలు, కచ్చితంగా చెప్పాలంటే నాలుగు దశాబ్దాలయింది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలను అరుణ్‌శౌరీ సారథ్యంలో వాజ్‌పేయి ప్రభుత్వం విక్రయించిన సమయంలో, గుజరాత్ ఆ పంథాను అనుసరించలేదు. ఆ సంస్థలను మరింత పటిష్టపరిచారు మోదీ.
 
 కానీ వాజ్‌పేయి ఎయిర్ ఇండియా సహా, పలు చమురు సంస్థలను కూడా వదుల్చుకున్నారు. అలీన విధానానికి పునరంకితం కావలసిన అవసరం గురించి కూడా మోదీ అదే ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ అలా చెప్పి ఉండవచ్చునని ఎవరైనా వాదించవచ్చు. అయితే ఆ అవసరం ఇప్పుడేమిటి? మోదీ అన్ని ముస్లిం దేశాలను చుట్టి వస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ అధ్యక్షుడి భారత్ పర్యటనకు సౌత్‌బ్లాక్ నుంచి అనుమతి రావడం లేదు. దీనికి మణిశంకర్ కూడా హర్షం వ్యక్తం చేస్తారేమో! నెహ్రూ, మోదీ మధ్య ఇంకొన్ని పోలికలు కూడా గమనించవచ్చు. తరచూ బహిరంగ సభలలో ప్రసంగించడం, విదేశీ, వ్యూహాత్మక విధా నాల మీద పూర్తి అజమాయిషీ, ఆఖరికి ఆకర్షణీయమైన వస్త్రధారణలో కూడా పోలికలు కనిపిస్తాయి. ఇన్ని సంవత్సరాలుగా నెహ్రూ జాకెట్ ఒక ఆకర్షణీయ వస్త్రంగా రాణించినట్టే, ప్రస్తుతం మోదీ వేషధారణ కూడా అందరిని అనుకరించేటట్టు చేస్తోంది. నిజానికి నెహ్రూతో మోదీకి వ్యక్తిగత విభేదం ఏదీ లేదనీ, ఆయన ప్రాపంచిక దృక్పథమే నెహ్రూ ప్రాపంచిక దృక్పథంతో విభేదిస్తుందని మోదీ అనుయాయులు చెబు తారు. ఇదే నిజమైతే కనీసం ఆర్థిక, విదేశీ వ్యవహారాలలో అయినా ఇలాంటి విభేదం ఉందేమో మనం రుజువు కోసం అన్వేషించాలి.
 
 శేఖర్ గుప్తా
 twitter@shekargupta

మరిన్ని వార్తలు