శాంతి మిథ్య... యుద్ధం సత్యం?

3 Feb, 2014 23:55 IST|Sakshi
శాంతి మిథ్య... యుద్ధం సత్యం?

జెనీవాలో జరిగిన సిరియా శాంతి చర్చలు విఫలమయ్యాయి. తిరిగి మరో దఫా చర్చలు జరపడానికి కుదిరిన అంగీకారమే సాధించిన పురోగతి. ప్రధాన తిరుగుబాటుదార్లు బహిష్కరిస్తున్న చర్చలవల్ల శాంతి ఒప్పందం కుదిరినా ఇప్పట్లో శాంతి నెలకొనే అవకాశం కనబడదు.
 
 విఫలం కావాలని ‘రాసి పెట్టి’ ఉన్న సిరియా ‘శాంతి’ చర్చలు గత శుక్రవారం మరోసారి విఫలమయ్యాయి. పశువుల్లాగా గడ్డి పరకలను, కలుపు మొక్కలను తిని చావక తప్పని సిరియన్లు అన్ని బాధల నుంచి ‘విముక్తి’కి చేరువవుతున్నారు. ప్రభుత్వ సేనల ముట్టడిలోని పురాతన నగరం హోమ్స్‌లో 40 వేల మందికి ఆకలి చావులను తప్పించగల ప్రపంచ ఆహార సంస్థ ట్రక్కులు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. ముట్టడిలో ఉన్న తిరుగుబాటుదార్ల లొంగుబాటు కోసం సైన్యం ఎదురుచూస్తోంది. ఆహారం తిరుగుబాటుదార్లకు చేరితే ప్రమా దం. పౌరుల మాటంటారా? ఎంత మంది చావడం లేదు? పది రోజుల క్రితం జెనీవాలో మొదలైన సిరియా శాంతి చర్చలు ముగిసేలోగానే, వారంలోనే కనీసం 1,500 మంది పౌరులు మరణించారు. మూడేళ్ల క్రితం అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి కనీసం 1,30,000 మంది చనిపోయారు. గాలి బుడగ జీవితానికి విలువేముంది? గెలుపు ముఖ్యం. హోమ్స్ ఒక్కటే కాదు, యార్మూక్, అలెప్పీ తదితర ప్రాంతాల్లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సైన్యం ముట్టడిలో చిక్కుకుపోయినవారు 2.5 లక్షలైతే. తిరుగుబాటుదార్ల ముట్టడిలో ఉన్న వారు 50 వేలు. అసద్ ‘పైచేయి’ స్పష్టమే.
 
 అధికార మార్పిడి సంగతి ముందు తేల్చాలని జెనీవా చర్చల్లో ప్రతిపక్ష ప్రతినిధులు పట్టుబట్టారు. సిరియా ప్రతిపక్ష ప్రతినిధులంటున్న ‘నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ’ సభ్యుల్లో మూడో వంతు చర్చలకు వ్యతిరేకం. తిరుగుబాటుదార్లలో అత్యంత ప్రధాన శక్తులైన జబాత్ అల్ నస్రా, ఐఎస్‌ఐఎల్‌లు చర్చలను బహిష్కరించడమే కాదు, పాల్గొన్న వారిని ద్రోహులుగా ప్రకటించాయి. చర్చలకు ముందే తిరుగుబాటుదార్లకు తక్షణం ఆయుధాలను అందించాలంటూ పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు... శాంతికి ఏకైక మార్గం యుద్ధమేననే పాత ‘సత్యాన్ని’ పునరుద్ఘాటించారు.
 
 తిరుగుబాటుదార్లు, వారి సూత్రధారులైన సౌదీ, కతార్‌లు వారిపైనే దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నాయి. ఆ కాంగ్రెస్ సభ్యులే ఇరాన్‌పై అంక్షలు విధిం చాలని పట్టుబడుతున్నారు. భావి అధ్యక్షురాలిగా భావిస్తున్న మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ గతంలో ఇరాన్‌పై కఠోరమైన ఆంక్షలతో దృఢవైఖరిని అనుసరించిన వారే. హిల్లరీకి బదులుగా ఒబామాను అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకుని డెమోక్రాట్లు చారిత్రక తప్పిదం చేశారని పెంటగాన్ (రక్షణశాఖ) నిన్న మొన్నటి వరకూ నిట్టూర్పులు విడుస్తుండేది. ఆమె సైతం ఇరాన్‌పై ఆంక్షలు మధ్యప్రాచ్య శాంతికి భంగం కలిగిస్తాయని హెచ్చరించారు! అంటే సిరియాపై కూడా పునరాలోచన లేదన్న మాటే. అసద్ ప్రభుత్వం ‘మొండి వైఖరి’ని ఘాటుగా విమర్శించిన ఒబామా సుతిమెత్తగా రెండో దఫా చర్చల్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెనీవా చర్చలు ‘పురోగతి’ సాధించి ఉంటే ఏమై ఉండేది? ఆకలితో అలమటిస్తున్న సిరియన్లకు రొట్టె ముక్క అందేదా?
 
 అమెరికా, సౌదీ, కతార్‌ల నేతృత్వంలో ‘సిరియా మిత్రులు’ అందించిన అపార ఆర్థిక, ఆయుధ సంపత్తిగల అల్‌కాయిదా సిరియా విభాగం జబాత్... అమెరికా, రష్యా, చైనా, సౌదీ, కతార్ తదితరులు ఎవరి మాటనూ లెక్క చేసే బాపతు కాదు. తూర్పున జబాత్‌తో పోరాడుతున్న కుర్దు గెరిల్లాలకు కావలసింది కుర్దిస్థాన్ తప్ప మరే ప్రభుత్వమూ కాదు. అగ్రరాజ్యాలు, ప్రాంతీయ అధిపత్యశక్తులు కలిసి వేసిన సిరియా చిక్కుముడి తేలిగ్గా విప్పగలిగేది కాదు. సిరియన్లకు కావాల్సిన శాంతి, జెనీవా చర్చల్లో పాల్గొంటున్న వారికి కావలసిన ‘శాంతి’ ఒక్కటి కావు. ఉగ్రవాదం నిప్పుతో చెలగాటమాడి ఎన్నిసార్లు తలబొప్పి కట్టినా అమెరికా గుణపాఠం నేర్చుకోలేదు. సౌదీ కూడా ఆ బాటలోనే ఉంది.
 
 అల్‌కాయిదా అధినేత అయమాన్ అల్ జవాహరి ఆదివారం ఒక ప్రకటనలో ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్’ (ఐఎస్‌ఐఎల్) తిరుగుబాటుదార్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని, సిరియాలో జబాత్ మాత్రమే తమ అనుబంధ సంస్థని ప్రకటించాడు. తిరుగుబాటుదార్ల చేతుల్లోని ఏకైక నగరం రఫా వారి చేతుల్లోనే ఉంది. చిన్నదే అయినా ఐఎస్‌ఐఎల్ అత్యంత శక్తిమంతమైనది. ఇరాక్, లెబనాన్‌లలో మారణహోమాన్ని సృష్టిస్తోంది. దానికి ఇతర గ్రూపులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో జనవరిలోనే దాదాపు 2,000 మంది చనిపోయారు. అటు అల్‌కాయిదా, ఇటు ఐఎస్‌ఐఎల్ రెంటినీ చెప్పు చేతల్లో పెట్టుకోగలనని సౌదీ భావిస్తే అది రెండు పులుల మీద స్వారీ చేయడమే అవుతుంది. ఇక ఆకలి, అనారోగ్యం, చావు అలవాటుగా మార్చుకున్న సిరి యన్లు తిండి, బట్ట, నీరు, విద్యుత్తు ఏమి కరువైనా బతగ్గలరు. ‘ఇదంతా దేవుడికి చెబుతాను’ అంటూ మూడేళ్ల మున్నా అబూసులేమాన్ తుది శ్వాస విడుస్తూ అందించిన సందేశాన్ని మన నం చేసుకుంటూనైనా వేచి చూడాలి. తప్పదు.
 

-పిళ్లా వెంకటేశ్వరరావు
 

మరిన్ని వార్తలు