రిజర్వేషన్లతోనే సామాజిక మార్పు

16 Sep, 2015 00:02 IST|Sakshi
రిజర్వేషన్లతోనే సామాజిక మార్పు

ఉన్నత విద్యావకాశాలను అందుకున్నవారు... ఆ చదువుల ద్వారా సంక్రమించిన కొత్త హోదాకు ‘మెరిట్’ పేరు పెట్టి, వాటిని తమకే స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిభ పేరుతో గతంలోని విశేష హక్కులను తిరిగి పొందాలని, వాటిని రాజ్యాంగబద్ధం చేయాలని, తద్వారా అన్ని అవకాశాలను పొందాలని భావిస్తున్నారు. రష్యా, చైనాల వంటి దేశాలకు భిన్నంగా మన దేశంలో రక్తపాతం లేకుండానే సామాజిక న్యాయం కొంత మేరకైనా జరిగిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే సామాజిక పరివర్తనను అడ్డుకోవడమే.
 
 నేటి గుజరాత్ పటేళ్ల ఉద్యమంగానీ, గత యాభై ఏళ్ళుగా రిజర్వేషన్లపై దేశం లో తలెత్తుతున్న ఆందోళనలేవైనా గానీ ఊహించనివి కావు. మన సమాజం లో ఇటువంటి ఉద్యమాలు ఉద్భవిస్తాయని రాజ్యాంగవేత్తలు అప్పట్లోనే  ఊహించారు. ప్రత్యేకించి అంబేడ్కర్ ఈ విషయంలో దార్శనికతను చూపా రు. 60 ఏళ్ళ తర్వాత ఎటువంటి ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందో ఊహిం చారు కనుకనే... ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి రాజకీయాధి కారాన్ని ప్రజలకు అందించారు. రాజకీయ సమానత్వాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వానికి దోహదం చేస్తుందని, అది సామాజిక సమానత్వానికి దారితీస్తుందని అంబేడ్కర్ భావించారు. కను కనే మన రాజ్యాంగవేత్తలు మొదట రాజకీయ సమానత్వంపై దృష్టి పెట్టారు. అది సత్ఫలితాలనిచ్చింది.
 
 ప్రపంచంలోని మిగిలిన దేశాలకు ఇది భిన్నమైనది. ఇతర దేశాల్లో ఆర్థిక సమానత్వం సిద్ధించిన తదుపరి రాజకీయ సమానత్వం కోసం పోరాడుతు న్నారు. కొన్ని దేశాల్లో సామాజిక సమానత్వం తర్వాత రాజకీయ సమానత్వం కోసం కృషి జరుగుతోంది. కొన్ని అభివృద్ధిచెందిన దేశాల్లో సైతం మహిళలకు ఓటు హక్కును గానీ, కాలేజీల్లో చదువుకునే అవకాశాన్నికానీ ఇవ్వడంలేదు. ఈ రోజుకీ ఆ అవకాశం కోసం పోరాడుతున్న ఉదాహరణలు కోకొల్లలు. కానీ మన దేశంలో ప్రపంచంలోనే లేని ఒక నూతన ప్రయత్నాన్ని అంబేడ్కర్ చేశా రు. రాజ్యాంగం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించిపెట్టారు. అందరికీ ఓటు హక్కు ద్వారా చైతన్యం సిద్ధిస్తుంది. రాజకీయ సమానత్వం ఆర్థిక అస మానతలను తొలగించి, సామాజిక సమానత్వానికి దారితీస్తుంది అని ఆయ న భావించారు. నేడు గుజరాత్‌లోని పటేళ్ల ఉద్యమం సహా దేశంలో జరుగు తున్న ఉద్యమాలన్నీ రాజకీయ సమానత్వం ఇచ్చిన చైతన్యంతోనే వచ్చాయి. రిజర్వేషన్లను ప్రతిఘటించే శక్తులు ఎప్పుడైనా ఉంటాయి. గతంలో వచ్చిన రిజర్వేషన్ వ్యతిరేకోద్యమాల  కోవలోకే పటేళ్ల ఉద్యమం కూడా వస్తుందే తప్ప మరేమీ కాదు.
 
 ఉన్నత విద్యావకాశాలతో ముడిపడ్డ సమస్య
 పటేళ్ల ఉద్యమానికి ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే కొన్ని కీలకమైన అంశాలు కనిపిస్తాయి. ఇది ఉన్నత చదువులకు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన అంశం. ఉద్యోగావకాశాలన్నీ ఉన్నత విద్యనభ్యసించిన వారికే వస్తున్నాయి. 20వ శతాబ్దంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అవి మనిషి జీవితంలోని ప్రతిభాగాన్ని స్పృశించాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిఫలాలు సామా న్యుడికి అందుబాటులోకి రావాలంటే సాంకేతికాభివృద్ధి ఎంతో అవసరం. 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక విప్లవం ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళకు ఉద్యోగార్హతను సాధించి పెట్టింది. ఉన్నత విద్య ఎవరికి అందు బాటులో ఉంటే వారికే అది ఉద్యోగావకాశాలను కల్పించింది. అందుకని ఉన్నత విద్యకు అవకాశాలను, రిజర్వేషన్లను రెండింటినీ కలిపి ఆలోచించా ల్సిన అవసరం ఉన్నది. అంటే ఉన్నత విద్యకు రిజర్వేషన్లను వర్తింపజేయాలి. ఈ రెండింటినీ సమన్వయిస్తేనే అట్టడుగున ఉన్న వాళ్ళకు సైతం శాస్త్ర, సాం కేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా సున్నితమైన సమస్య.
 
 అవకాశాలపై గుత్త హక్కుకు మరో పేరు ‘మెరిట్’
 ఇక్కడే మరొక ముఖ్య విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఈ రోజు మనుషులకు గానీ, కొన్ని సామాజిక వర్గాలకు గానీ సమాజంలో గుర్తింపు, గౌరవం, హోదా, లేక అంతస్థు... ఆయా వర్గాల, వ్యక్తుల, సామాజిక వర్గాల ఆస్తి ఆధారంగా వచ్చినవే. దీనికి సాంస్కృతికపరమైన సామంజస్యం లభిం చింది. అందుకు మతం తోడ్పడింది. ఈ సాంస్కృతికపరమైన సామంజస్యా నికి వెనుక ఆర్థిక, సామాజిక కారణాలున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చాక వాటి పునాదులు కదిలాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధిం చలేకపోయినా వెనుకబడిన వర్గాల్లో మాత్రం చైతన్యం తెచ్చాయి. ఆస్తితో ఏ విధమైన హోదా వచ్చిందో, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి కూడా అటువంటి హోదా లభించింది. అయితే అటువంటి ఉన్నత చదువులను అభ్యసించే అవకాశాలను అందుకున్నవారు... ఆ చదువుల ద్వారా సంక్ర మించిన ఈ కొత్త హోదాను తమకే స్థిరపరచుకోవడానికి, సమర్థించుకో వడానికి దానికి ‘మెరిట్’ లేదా ప్రతిభ అని పేరు పెడుతున్నారు. ప్రతిభ పేరుతో గతంలోని విశేష హక్కులను తిరిగి పొందాలని, వాటిని రాజ్యాంగ బద్ధం చేయాలని, తద్వారా అన్ని అవకాశాలను పొందాలని ప్రయత్ని స్తున్నారు. ఉన్నత విద్య-సామాజిక న్యాయం అనేది ప్రస్తుతం కీలకమైన అం శంగా మారిపోయింది. అవి రెండూ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తున్నాయి.  
 
 రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగారు, వివిధ దేశాలకు వెళ్ళారు. దీనివల్ల కేవలం ఆయా కుటుంబాలకే  మేలు జరిగిందనుకుంటే పొరపాటే. యావత్ సమాజానికి అది మేలు చేసింది. అట్టడుగు వర్గాల నుంచి ఎదిగివచ్చిన వ్యక్తుల పరిశోధనలు అణగారిన వర్గాల సమస్యలకు పరిష్కారాన్ని వెతి కాయి. వారి అభివృద్ధికి దోహదం చేశాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దరికీ అందుబాటులోకి తెచ్చాయి. సామాన్యుడి అవసరాలకు అనుగుణ్యమైన పరిశోధనలు జరిగాయి. గతంలో సంపన్న వర్గాలకు సంబంధించిన అంశా లకే పరిమితమైన పరిశోధన పరిధి విస్తృతమైంది. ఈ పరిశోధన కానీ, ఈ పరి జ్ఞానం కానీ ఏ కొందరికో సొంతం కాకూడదనే తపన మొదలైంది. రిజర్వేషన్ల ఫలితంగానే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, వాటిపై జరిగే పరిశోధనలు సామా న్య మానవుణ్ణి కేంద్రంగా చేసుకుంటున్నాయి.
 
 సామాజిక సమానతకు శాంతియుత మార్గం
 ఇతర దేశాల్లో సామాజిక హోదాలో మార్పు హింసాత్మక పోరాటాల ద్వారా వచ్చింది. సోవియెట్ యూనియన్, చైనాలాంటి దేశాల్లో విప్లవాలు, హింసా త్మక ఉద్యమాల ఫలితంగా ఇటువంటి మార్పు సాధ్యమైంది. కానీ మన దేశంలో ఎటువంటి రక్తపాతం లేకుండానే సామాజిక న్యాయం కొంత మేర కైనా జరగిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. ఎక్కడో అట్టడుగున ఉన్న వర్గాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అడుగుపెట్టగలిగారు. సాధారణ వ్యక్తు లకు సైతం ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రావడం వల్ల తన సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పరిశోధనలు సాగించగలి గారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన భారతీయులు ఎందరో ఇతర దేశాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించ గలిగారంటే కారణం రిజర్వేషన్లే. కుల వ్యవస్థ అమానుష ప్రభావాన్ని స్వయంగా చవిచూసిన వ్యక్తి తన విజ్ఞానాన్ని సరికొత్త మార్గంలోకి తీసుకెళ్ళాడు. ఆ పరిశోధనల ఫలితాలు నేడు ప్రపం చంలోని అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేశాయి. భారత రాజ్యాంగం చేసిన రిజర్వేషన్ల ప్రయోగ ఫలితాలు కేవలం భారతీయులకే  కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
 
 పరిశోధకుడి నేపథ్యం పరిశోధనల సంకుచిత సరిహద్దులను చెరిపే స్తోంది. పరిజ్ఞానం అనంత విశ్వానికి వ్యాప్తిసోంది. పేదలకు వచ్చే వ్యాధుల పైన, జీవన విధానంపైనా నేడు ప్రత్యేకంగా జరుగుతున్న పరిశోధనలు అటు వంటివే. ఉన్నత విద్యలో రిజర్వేషన్ల వల్ల పరిశోధనలు కొత్తపుంతలు తొక్కు తున్నాయి. రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే పరిశోధనకు కళ్లెం వేయడమే. విస్తృతమవుతున్న పరిజ్ఞానానికి పరిమితులు విధించడమే. అంబేడ్కర్ దూర దృష్టి భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయగలిగింది. సమాజ మనుగడకు దోహ దం చేసే పరిశోధనలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం... వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడం వల్లనే సాధ్యమనడానికి అంబే డ్కరే ఒక మంచి ఉదాహరణ. దానినే అతను ప్రయోగించాడు. ఉన్నత విద్యలో రిజర్వేషన్లను సుసాధ్యం చేశాడు.
 
వెలుగులోకి రాకుండా పేదరికంలోనే మగ్గుతున్న మట్టిలోని మాణి క్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని వెలికితీయాలి. సామాజిక అణచివేతకు గురవుతున్న వారికి నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలి. అది ప్రతిభకు ప్రతిబంధకం ఎంతమాత్రం కాదు. రిజర్వేషన్ల వలన కొద్ది మం ది సీట్లు కోల్పోవచ్చు. కానీ కొత్త జ్ఞానానికి మాత్రం తలుపులు తెరుచుకుం టాయని స్పష్టం అవుతోంది. చీకట్లో మగ్గుతున్న ఎందరికో ఆ పరిశోధనలు చేయూతనిస్తాయి. పేదల ఆరోగ్యం, వ్యాధులు, వారి సామాజిక పరిస్థితులు, జీవన వైవిధ్యం పైన కూడా అది ప్రభావం చూపుతుంది. ఇంత వరకు జరిగిన పరిశోధనల్లో అత్యధిక శాతం సంపన్నుల ప్రయోజనాలను కాపాడేందుకు జరిగినవే. అంతేగానీ సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని జరిగినవి కావు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు మాత్రం పేదల సమస్యల పరిష్కారానికి సంబంధించినవి కావడం గమనించాల్సిన అంశం. అందువల్ల రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే సామాజిక పరివర్తనను అడ్డుకోవడమే.
 (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)
 - చుక్కా రామయ్య

మరిన్ని వార్తలు