కొంత జీవితం, కొన్ని అభిప్రాయాలు

29 Nov, 2015 00:21 IST|Sakshi
కొంత జీవితం, కొన్ని అభిప్రాయాలు

రైతు సోదరుల ఆత్మహత్యలతో తెలుగు గడ్డ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో- రైతాంగ సంస్కరణ ఎలా ఉండాలి? రాజకీయ నేతలు ఏ విధమైన అంశాలపై దృష్టి పెట్టాలి? అనే దృక్కోణాన్ని స్వాతంత్య్ర సిద్ధి లభించిన తొలినాళ్లలోనే విజయరాజ కుమార్  సమర్థవంతంగా చేసిన ప్రయత్నాలని అక్షరీకరించిన పుస్తకం ఇది.

 1939లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్‌‌డ బ్లాక్‌లో ఆంధ్ర ప్రాంతం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి, అటుపై ఆచార్య రంగా కృషికార్ లోక్ పార్టీకి రాష్ర్ట ఆర్గనైజర్‌గా పనిచేసిన నాయకుడు విజయరాజ కుమార్. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయగా ఆమెపై స్వతంత్ర అభ్యర్థిగా ప్రఖ్యాత గణిత శాస్త్త్రజ్ఞ్రురాలు శకుంతల నిలబడి విజయరాజ సహాయం కోరారు అన్న విషయం ఈ పుస్తకంలో తెలుస్తుంది. నలభై రెండేళ్ల క్రితమే ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భంగా ఇందిరాగాంధీకి ఆయన రాసిన బహిరంగ లేఖ నాటి ‘తెలంగాణా’ పత్రికలో సీరియల్‌గా ప్రచురించబడి సంచలనం సృష్టించింది. అందులో కొంత భాగం పుస్తకంలో అందించారు.

 కావటానికి ఇది విజయరాజ కుమార్ జీవిత చిత్రణే అయినప్పటికీ చదువుతుంటే ‘వర్తమానాన్ని’ తడుముతున్నట్టుగా అనిపిస్తుంది. విజయరాజ మొదటి రచనే సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్ర ‘విప్లవాధ్యక్షుడు’. దానికి సంబంధించిన ఉపోద్ఘాతం, ఇప్పటి బెంగాల్ ప్రభుత్వం బోస్ మరణంపై వివరాల్ని బయటపెట్టే కసరత్తును స్ఫురింపజేస్తుంది. పాల్ఖీవాలా ఆంగ్ల రచనని ‘కొలబద్దకు గురి చేయబడిన న్యాయ విధానం’ అని విజయరాజ  చేసిన అనువాద గ్రంథ పరిచయం- భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నాయవాదుల ఎంపిక (కొలీజియమ్ వ్యవస్థ)పై ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తుంది.

 ఇప్పటికైనా ఆయన అభిప్రాయాలను పుస్తకంగా వెలికి తీసుకొచ్చిన ఆయన తమ్ముడు నరిశెట్టి ఇన్నయ్యను తప్పక అభినందించాలి.
 (రైతు రాజకీయంలో విజయరాజ కుమార్ నరిశెట్టి; రచన: నరిశెట్టి ఇన్నయ్య; ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, ఫోన్: 9866115655; ఇన్నయ్య మెయిల్ : innaiah@gmail.com)
వర్చస్వి

మరిన్ని వార్తలు