ఈసారి ‘చూపు’ సభాపతుల వైపు

15 Jul, 2016 01:49 IST|Sakshi

స్పీకర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలన్నది జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్య. తెలుగునాట అది పూర్తిగా డొల్ల. ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీ మంత్రివర్గంలో ఉన్నారంటే, రాజ్యాంగం పదో షెడ్యూల్ అమల్లో ఉండగా.. సభ్యుడి రాజీనామా తీసుకోకుండా ఈ పరిస్థితిని స్పీకర్ ఎలా అనుమతించారనేది రాజ్యాంగ నిపుణుల ప్రశ్న. స్పీకర్‌తో ఈ విషయం ధ్రువీకరించుకోకుండా సదరు సభ్యుడితో మంత్రిగా గవర్నర్ ఏ విధంగా ప్రమాణస్వీకారం చేయించారన్న విమర్శకుల ప్రశ్నకు సమాధానమే లేదు.
 
 బ్రెగ్జిట్‌పై రిఫరెండమ్‌కు వెళతామని పౌరులకిచ్చిన ఎన్నికల హామీని బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సాహసించి నెరవేర్చింది. అదంత అనివార్యం కాకపోయినా.. నైతిక బాధ్యత వహించి ఫలితాలొచ్చిన కొన్ని గంటల్లోనే ప్రధాని డేవిడ్ కామె రూన్ పదవికి రాజీనామా చేశారు. యురోపియన్ యూనియన్‌లో ఉందా మని దేశవాసులకు ప్రధాని పిలుపునిస్తే, వద్దు వైదొలగాలని అదే పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ విస్తృత ప్రచారం చేసినా... ఏ క్రమశిక్షణా చర్యల్లే కుండా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అందుకాయన్ని అనుమతించింది. అదే స్ఫూర్తితో ప్రత్యర్థి లేబర్ పార్టీలో ఉండి కూడా జెర్మి కొర్బిన్, ప్రధాని పిలుపునకు అనుకూలంగా ఈయూలోనే కొనసాగుదామని ప్రచారం చేయగ లిగారు.
 
 బ్రెగ్జిట్‌కు అనుకూలంగా తనప్రచార లక్ష్యం నెరవేరినందున తాను ఇంకా బ్రిటన్ స్వతంత్ర పార్టీ (యూకేఐపీ) అధినేతగా కొనసాగాల్సిన అవ సరం లేదని నిగెల్ ఫరాజ్ ప్రకటించారు. స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొల గారాయన. ఇవీ... రాజకీయాల్లో విలువలకు మచ్చుతునకలు. ఇలాంటి విలు వల్ని ప్రస్తుతం మన దేశ రాజకీయాల్లో కనీసం ఊహించగలమా? ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కడం, పదవుల్ని పట్టుకు వేలాడ్డం, అధికారం కోసం ఏ గడ్డయినా కరవడం, ఒక పార్టీ తరఫున ప్రజలెన్నుకుంటే, ఆ ప్రజలే తిరస్కరించిన ప్రత్యర్థి పార్టీల్లోకి నిర్లజ్జగా మారడం, వారిని రాజ్యాంగ పరిరక్ష కులే కాపాడ్డం...  ఇదీ ఇప్పుడిక్కడ జరుగుతున్న తంతు.  విలువలు అంతటా నశిస్తున్నాయని మనం అంటుంటాం. కానీ, ఈ దేశంలో రాజకీయాల్లో విలు వలు పతనమైనంత వేగంగా మరే రంగంలోనూ అవటం లేదని అరుణాచల్ వ్యవహారంలో సుప్రీం కోర్టు తాజా తీర్పు మరోసారి రుజువు చేసింది. నిస్సి గ్గుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటుకే అనర్హులంటూ మొన్న ఉత్తరా ఖండ్ వ్యవహారంలో ఇచ్చిన సుప్రీం తీర్పు రాజకీయ పార్టీలకు చెంపపెట్టు. కేంద్రం చెప్పుచేతల్లో లక్ష్మణరేఖ దాటిన గవర్నర్ చర్యలన్నింటినీ బుట్టదా ఖలు చేస్తూ నిన్న ఇచ్చిన సుప్రీం తాజా తీర్పు, కీలుబొమ్మగా నడుచుకునే గవ ర్నర్ల వ్యవస్థకు ఇంకో చెంపదెబ్బ.
 
 ఈ వరుసలో ఇక.... పాలకపక్షాలకు తాబే దార్లుగా నడుచుకునే స్పీకర్ల వ్యవహార శైలిని ఎండగట్టే సుప్రీం తీర్పే తరు వాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా తాత్సారం చేస్తున్నారంటూ పెట్టిన కేసు సోమవారం సుప్రీంకోర్టు ముందు తదుపరి విచారణకు రానుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ ఈ తప్పిదం యథేచ్ఛగా సాగుతోంది.
 
‘అతి’తో పాటు స్పీకర్ల నిష్క్రియ కూడా తప్పిదమే!
అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీం ధర్మాసనం చాలా అంశాల్ని నొక్కి చెప్పింది. ఈ కేసులో ధర్మాసనం అంతిమ నిర్ణయానికి సానుకూలత వ్యక్తం చేస్తూనే విడిగా తీర్పు రాసిన జస్టిస్ దీపక్ మిశ్రా స్పీకర్ల బాధ్యతపై ఓ వ్యాఖ్య చేశారు. ‘స్పీకర్లు నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనిపించాల’నే ప్రజాస్వామ్య స్ఫూర్తిని పునరుద్ఘాటించారు. ఆస్ఫూర్తి రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల్లోనూ లోపిస్తోంది.
 
  ఈ ఫిరాయింపులన్నీ విపక్షాల నుంచి పాలక పక్షంలోకి సాగుతున్నవే! పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల్ని అనర్హులుగా ప్రక టించండి అని సదరు పార్టీలు చేసిన విజ్ఞప్తిపై స్పీకర్లు ఏ చర్యా తీసుకోవడం లేదు. రాజ్యాంగ ఉల్లంఘనల్ని, పాలకపక్ష అనుకూల వాతావరణాన్ని అను మతించినట్టవుతోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇటు వంటి ఉల్లంఘనల్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అధికారం స్పీకర్లకు మాత్రమే కట్టబెట్టారు. వారు చర్యలు తీసుకోనంత వరకు చట్టం అమలు జరు గనట్టే లెక్క. ఇది రాజ్యాంగం పదో షెడ్యూల్‌కు గుడ్డి ఉల్లంఘన. ఈ నిష్క్రి యాపరత్వం వారు తమ రాజ్యాంగ విహితమైన బాధ్యతల్ని విస్మరించడమే. దీంతో స్పీకర్లు నిష్పాక్షికంగా లేరని రూఢీ అవుతున్నట్టే! అరుణాచల్‌లో 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేలలో 14 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. హేతుబద్ధం కాకుండా, రాజ్యాంగ పరిధికి లోబడి లేని స్పీకర్ల ‘అతి’ చర్యలు ఎంత తప్పో, అవసరమైన చోట చర్యలే లేని నిష్క్రియాపరత్వం కూడా అంతే తప్పు. ప్రజాస్వామ్య వివిధ అంగాల మధ్య రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి వల్ల ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కొన్ని పరిమితులున్నాయి.
 
 ఫిరాయింపు ఫిర్యాదులపై చర్య తీసుకొమ్మని, ఫలానా సమయం లోపల చర్యలుండాలని స్పీకర్‌ను నిర్దేశించే పరిధి తమకు లేదని సుప్రీం చాలా సందర్భాల్లోనే స్పష్టం చేసింది. ‘కిహోటో హొలాహాన్ వర్సెస్ జచి లుహూ’ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఫిరాయింపు కేసుల్లో కోర్టుల పరిధిని వివరిం చినపుడు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకసారి స్పీకర్ నిర్ణయించిన తర్వాత సదరు నిర్ణయం రాజ్యాంగబద్ధతను సమీక్షించే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొనే... కోర్టులకు చిక్కకుండా స్పీకర్లు ఉద్దేశపూర్వక జాప్యాలకు పాల్పడి పాలకపక్షాలకు అను కూలంగా వ్యవహరిస్తున్నారనేది విశ్లేషకుల భావన.
 
 పరిష్కరించకుంటే పరిహాసమే!
 ఫలితమివ్వనప్పుడు అది రాజ్యాంగపు హక్కయినా నిరుపయోగమే. ఇప్పు డదే జరుగుతోంది. 1984లో రాజ్యాంగ సవరణ (52)ద్వారా ఈ బిల్లు తెచ్చిన పుడు గానీ, 2003లో తదుపరి సవరణ (91) జరిగినపుడు కానీ... చట్టం పక డ్బందీ అమలుకు తగు జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఎంత ఉదార ఆలో చనయినా, ఏకపక్షంగా స్పీకర్లకే నిర్ణయాధికారం కట్టబెట్టేనాటికే పలువురు స్పీకర్లు లక్ష్మణరేఖలు దాటి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన సందర్భాలు న్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ఒక పార్టీ తరపున ఎన్నికైన ప్రతినిధి, ప్రజాతీర్పును వంచించి మరో పార్టీలోకి మారినపుడు అనర్హుడవడం ఇందులో నిర్దేశించారు. కానీ, ఇలా ఒక పార్టీ నుంచి మూడో వంతు సభ్యులు పార్టీ ఫిరాయించడాన్ని చీలికగా గుర్తించడం, మూడింట రెండొంతుల సభ్యులు ఇతర పార్టీలో కలవడాన్ని విలీనంగా గుర్తించడం ద్వారా అనర్హత వర్తించకుండా మినహాయింపులు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఒకరు ఇద్దరు మారినా చర్యలు లేని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. 1990లో గోస్వామి కమిటీ నివేదిక, 1999లో లా కమిషన్ నివేదిక, 2002లో నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ నివేదిక ఈ ఫిరాయింపు నిరోధక నిబంధనల్లో ఉన్న లోపాల్ని, అమలు వైఫల్యాల్ని ఎత్తిచూపాయి.
 
 అందుకే, 2003లో జరిపిన 91వ సవరణ ద్వారా చీలికను పూర్తిగా ఎత్తివేసినా ‘విలీనం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. 20వ లా కమిషన్ ‘ఎన్నికల సంస్కరణలు’ పేరుతో ఇచ్చిన 255వ నివేదికలో ఓ ప్రతిపాదన చేసింది. ఫిరాయింపు పిటి షన్లపై స్పీకర్లు నిర్ణయం తీసుకోవడంలో అనుచిత-ఉద్దేశపూర్వక జాప్యాలు జరుగుతున్నందున సదరు నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సభ్యుల విష యంలో అయితే రాష్ట్రపతికి, శాసనసభ్యుల విషయంలో అయితే గవర్నర్‌కు అప్పగించాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
 
 పక్షపాతంగా వ్యవహరిస్తున్నం దున ఈ అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించాలని ఏపీలో విపక్షనేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి డిమాండ్ చేస్తు న్నారు. ఫిర్యాదు అందిన నాటినుంచి 90 రోజులు దాటకుండా పరిష్కరించా లనీ ప్రతిపాదించారు. ఎంపీల ప్రతినిధి బృందంతో స్వయంగా ఢిల్లీ వెళ్లి ఈ మేరకు వినతిపత్రాల్ని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఇదివరకే అందజేశారు. స్పీకర్ 90 రోజుల్లో పరిష్కరించేలా గడువు పెట్టాలని, లేదా అది ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ ముఖ్యులు లీగల్ కౌన్సిల్ ద్వారా సుప్రీంను కోరుతున్నారు.
 
 పచ్చి పచ్చిగా పచ్చ పచ్చగా....
 రాజ్యాంగ హోదాల్లో చట్టసభలకు నేతృత్వం వహించే వారి చేష్టల్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తారు. స్పీకర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలన్నది జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్య. తెలుగునాట అది పూర్తిగా డొల్ల. ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీ మంత్రివర్గంలో ఉన్నారంటే, రాజ్యాంగం పదో షెడ్యూల్ అమల్లో ఉండగా... సభ్యుడి రాజీనామా తీసుకో కుండా ఈ పరిస్థితిని స్పీకర్ ఎలా అనుమతించారనేది రాజ్యాంగ నిపుణుల ప్రశ్న. స్పీకర్‌తో ఈ విషయం ధ్రువీకరించుకోకుండా సదరు సభ్యుడితో మంత్రిగా రాష్ట్ర గవర్నర్ ఏ విధంగా ప్రమాణస్వీకారం చేయించారన్న విమ ర్శకుల ప్రశ్నకు సమాధానమే లేదు. ఇక ఏపీలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ స్పీకర్ నేరుగా టీడీపీ సభలు, సమావేశాల్లో పాల్గొనడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం వంటివి విమర్శలకు తావిచ్చాయి. ఈసారి ఎన్నికల్లో పదకొండున్నర కోట్లు ఖర్చయిందన్న ఆయన వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది, స్పందించిన ఎన్నికల సంఘం ఆధారాల సేకరణ వరకూ వెళ్లింది.
 
జగ్జీత్‌సింగ్ వర్సెస్ స్టేటాఫ్ హర్యానా కేసులో, స్పీకర్ పదవి హుందాతనాన్ని చెబుతూనే ఇటీవలి కాలంలో వారి నిష్పాక్షికత విషయంలో తలెత్తుతున్న సందేహాలు, ప్రశ్నల్ని సుప్రీం ఎత్తిచూపింది. ఈ పరిస్థితుల్లో తన ముందున్న కేసులో సుప్రీం ఏం తీర్పు ఇస్తుందోనని ప్రజానీకం నిరీక్షిస్తోంది. రాజ్యాం గాన్ని కాపాడే బాధ్యత సుప్రీంకోర్టుదే అయినా... పదే పదే ఉల్లంఘనలకు పాల్పడి సుప్రీంతో మొట్టికాయలు వేయించుకోవడం ఇతర ప్రజాస్వామ్య సంస్థలకు అంత మంచిది కాదన్నది జనాభిప్రాయం.
 - దిలీప్ రెడ్డి
 ఈమెయిల్: dileepreddy@sakshi.com

>
మరిన్ని వార్తలు