అసహనం, అన్యాయం...

20 Dec, 2015 00:41 IST|Sakshi

త్రికాలమ్:

‘నేను కాంగ్రెస్‌వాదిని అయినప్పటికీ సభాపతిగా సభలోని అందరితో, అన్ని వర్గాలతో న్యాయంగా, సమానంగా వ్యవహారం చేయడం నా విధి. ఆ దిశగానే మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. నిష్పక్షపాతంగా, పార్టీ ప్రయోజనాలకూ, పదవీ రాజకీయాలకూ అతీతంగా ఉండటం నా కర్తవ్యం’. ఇది లోక్‌సభ తొలి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ చెప్పుకున్న సంకల్పం. స్పీకర్ పదవీ బాధ్యతలను నిర్వచించడంలో భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటిష్ కామన్స్ సభాపతిని ఆదర్శంగా తీసుకున్నారు. నిష్పక్షపాతంగా ఉండటమే కాకుండా ఆ విధంగా ఉన్నట్టు సభ్యులందరికీ కనిపించాలి.

శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంభవించిన పరిణామాలూ, సభాపతి కోడెల శివప్రసాద్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహరించిన తీరు మావలాంకర్ సూత్రానికి పూర్తి విరుద్ధం. ఏడు విడతలు అసెంబ్లీ సభ్యుడుగా ఎన్నికైనాననీ, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగానూ, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడుగానూ పని చేశాననీ, తనకు ఎవ్వరూ విధివిధానాలు చెప్పవలసిన అవసరం లేదనీ చంద్రబాబునాయుడు చెప్పిన మాట నిజమే. ప్రజానాయకుడు ఎన్‌టి రామారావును గద్దె దింపి చంద్రబాబునాయుడికి పట్టం కట్టడంలో 1995 ఆగస్టు సంక్షోభంలో స్పీకర్‌గా చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడికి శాసనసభ నియమనిబంధనలూ, విధివిధానాలూ తెలియవని అనుకోవడం పొరపాటు. స్పీకర్‌గా ఏణ్ణర్ధంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివప్రసాద్‌కి చట్టసభలలో విశేషానుభవం ఉంది.

సలహాసంప్రదింపులు జరపడానికి అనుభవజ్ఞులైన అధికారులు అందుబాటులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో, శాసనసభా వ్యవహారాలలో, పరిపాలనలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఈ ముగ్గురు నాయకులూ నిబంధనలనూ, సంప్రదాయాలనూ తుంగలో తొక్కి , ప్రతిపక్షం నోరునొక్కడమే ప్రధానంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. ఏ వ్యవస్థ అయితే తమకు పదవులు ఇచ్చిందో ఆ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేట్టు చేస్తున్నారు. చెట్టు ఎక్కి మొదలు నరుక్కున్న చందం.

 వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యురాలు ఆర్. కె. రోజా శుక్రవారంనాడు సభలో వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా పరిగణించినప్పటికీ అధికారపక్షం ప్రతిపాదించినట్టు మోతాదుకు మించిన శిక్ష విధించడం ద్వారా శాసనసభాపతి నిష్పక్షపాతంగా వ్యవహరించలేదనే అభిప్రాయం కలిగించారు. ఎవరైనా సభ్యుడు నియమనిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి (గ్రాస్ డిజార్డర్లీ బిహేవియర్) అడ్డగోలుగా వ్యవహరించినప్పుడు సదరు సభ్యుడిని సస్పెండు చేసే అధికారం సభాపతికి 340వ నిబంధన ప్రసాదించింది. ఈ నిబంధనలోని రెండవ సెక్షన్ కింద రోజాను సంవత్సరం పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేసినట్టు సభాపతి ప్రకటించారు.

 సభ ప్రారంభమైన రోజు ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులను (శివప్రసాద్ రెడ్డి, రామలింగేశ్వరరావు అలియాస్ రాజా) కెమెరాకు అడ్డుగా నిలబడ్డారనే కారణంగా ఒక రోజు సస్పెండు చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి కోరితే రెండు రోజులు సస్పెండు చేసినప్పుడే స్పీకర్ తొందరపడినట్టు కనిపించారు. రెండో రోజు ఉదయం కాల్‌మనీ-సెక్స్ రాకెట్ ఉదంతంపైన చర్చ జరగాలంటూ ప్రతిపక్షం పట్టు పట్టడం, ఎజెండాలో లేని అంబేడ్కర్‌ను అడ్డుపెట్టి చర్చను దాటవేయడానికి అధికారపక్షం ప్రయత్నించడంతో సరిపోయింది. అంబేడ్కర్‌పైన చర్చ జరిగే వరకూ 54 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ అదే రోజున రోజాపై ఏకంగా ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా  సభకు (ప్రతిపక్షం లేని సభకా?) హక్కు ఉన్నదనీ, సభాపతికి సర్వాధికారాలూ ఉన్నాయనీ ముఖ్యమంత్రి, ఇతరులూ చేస్తున్న వాదన రాజ్యాంగ సమ్మతం కాదు.

సభను సజావుగా, ప్రజాస్వామ్యబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించవలసిన బాధ్యత స్పీకర్‌ది. రాజ్యాంగ స్ఫూర్తికి అతీతంగా వ్యవహరించే స్వేచ్ఛ సభాపతికి కానీ, మరెవ్వరికి కానీ లేదు. శాసనసభల విధివిధానాలూ, నిర్వహణకు సంబంధించిన నిబంధనలు సైతం రాజ్యాంగబద్ధమై ఉండాలంటూ రాజ్యాంగంలోని 208వ అధికరణ స్పష్టం చేస్తున్నది. నియమనిబంధనలలో పేర్కొనని పరిస్థితి ఏదైనా ఉత్పన్నం అయినప్పుడు తగిన నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం సభాపతికి ఉన్నదని శాసనసభను శాసించే 360, 361 నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అటువంటి నిర్ణయం కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి.

 కరణం ఉదంతం
 రోజా సస్పెన్షన్ ఉదంతంతో పోల్చదగినది గతంలో కరణం బలరామమూర్తి విషయంలో జరిగింది. 2008 ఏప్రిల్ నాలుగో తేదీన అద్దంకిలో తెలుగురైతు సదస్సు జరిగింది. అందులో స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కరణం బలరామమూర్తి మాట్లాడుతూ, అసెంబ్లీలో తమను మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతున్నారనీ, స్పీకర్ సురేశ్‌రెడ్డిని శిఖండిలాగా అడ్డం పెట్టుకొని తమను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అణచివేస్తున్నారనీ ఆరోపించారు. బయటికి రావలసిందిగా స్పీకర్‌కి సవాలు విసిరానని చెబుతూ, ‘ నేను బయటకు రమ్మన్నది అప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చున్న కుతూహలమ్మను కాదు, గదిలో దొంగలాగా దాక్కున్న స్పీకర్ సురేశ్‌రెడ్డిని’ అంటూ శ్రుతి మించారు.

కరణం వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెబుతూ అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్ కిరణ్ కుమార్ రెడ్డి, మరి అయిదుగురు కాంగ్రెస్ సభ్యులతో కలసి బలరామమూర్తిపైన సస్పెన్షన్ వేటు వేయవలసిందిగా స్పీకర్‌కు 2008 ఏప్రిల్ 5న వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటి స్పీకర్‌లాగా అప్పటి స్పీకర్ వెంటనే వేటు వేయలేదు. విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించవలసిందిగా హక్కుల సంఘాన్ని కోరారు. అప్పటి హక్కుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకటరెడ్డికి కరణంతో వైరం ఉన్నది. అయినప్పటికీ ఆయన నియమనిబంధనలను తు.చ. తప్పకుండా పాటించారు.

నాటి హక్కుల సంఘంలో బలరామమూర్తి కూడా సభ్యుడే. ఆయనపైనే ఆరోపణ వచ్చింది కనుక కమిటీ విచారణలో పాల్గొనవద్దనీ, తాను చెప్పదలచుకున్నది కమిటీ ఎదుట చెప్పవచ్చుననీ హక్కుల సంఘం నిర్ణయించింది. 14 మంది సభ్యులు గల హక్కుల సంఘంలో కాంగ్రెస్ సభ్యులే కాకుండా ఎస్‌వి సుబ్బారెడ్డి, రవికుమార్ వంటి తెలుగుదేశం పార్టీ సభ్యులూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన రంగారెడ్డి, గుమ్మడి నరసయ్య కూడా ఉన్నారు. తాను అనని మాటలు తనకు పత్రికలు ఆపాదించాయనీ, ఆనరబుల్ స్పీకర్ అంటే తనకు ఎంతో గౌరవమనీ, ఈ వివాదంలోకి స్పీకర్‌లాంటి పెద్దమనిషిని లాగడం దురదృష్టకరమనీ విచారం వెలిబుచ్చుతూ  బలరామమూర్తి ఒక సంజాయిషీ పత్రాన్ని హక్కుల కమిటీకి మే 2న సమర్పించారు. ఈ అంశంపైన చర్చించేందుకు 2008 ఏప్రిల్ 11 నుంచి మే 14 వరకూ సభాహక్కుల సంఘం అయిదు విడతల సుదీర్ఘ సమావేశాలు నిర్వహించింది. ఆగస్టు 8న శాసనసభలో గాదె వెంకటరెడ్డి సభాహక్కుల సంఘం నివేదికను ప్రవేశపెట్టారు.

బలరామమూర్తిని ఆరు మాసాల పాటు సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. నివేదికపైన శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొని సుదీర్ఘంగా వివరణ ఇచ్చే అవకాశాన్ని కూడా బలరామమూర్తికి సభాపతి సురేశ్‌రెడ్డి ప్రసాదించారు.  తర్జనభర్జనల తర్వాత నివేదికను శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాతనే సభ నిర్ణయాన్ని సురేశ్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఇంత వివరంగా విచారణ జరిగినప్పటికీ స్పీకర్ ప్రకటన చేసిన రోజు దుర్దినమనీ, సభా నిర్ణయం  కక్ష సాధింపు చర్య అనీ వ్యాఖ్యానించారు. గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. అదే నాయకుడు ఇప్పుడు ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు లేదంటున్నారు. సభాపతి నిర్ణయానికి తిరుగులేదంటున్నారు.

 పార్లమెంటు సంప్రదాయం
 ఓటుకు నోటు కేసులోనూ స్పీకర్ పద్ధతి ప్రకారమే వ్యవహరించారు. 2008 జూలై 22న ముగ్గురు బీజేపీ సభ్యులు-అశోక్ అర్గల్, ఫగ్గన్ సింగ్ కులాస్తి, మహేశ్ భగోరా-డబ్బు సంచులతో లోక్‌సభలోకి ప్రవేశించారు. యూపీఏ-1 ప్రభుత్వం అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల నిరసనగా వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహమ్మద్ పటేల్  తమకు లంచం ఇచ్చారంటూ నోట్ల కట్టలను ముగ్గురు సభ్యులూ స్పీకర్‌కు చూపించారు. ఈ ఆరోపణలపైన విచారించవలసిందిగా ఢిల్లీ పోలీసు శాఖను స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించేందుకు పార్లమెంటు సంయుక్త సంఘాన్ని(జేపీసీ) నియమించారు. సభ్యులు చేసిన ఆరోపణ నిరాధారమంటూ జేపీసీ 2008 డిసెంబర్ 15న నివేదిక సమర్పించింది. చట్టసభలలో సభ్యులపైన వేటు వేయాలంటే ఇంత తతంగం జరగాలి.

 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం ఏమి జరిగింది? ధూళిపాళ్ల నరేంద్ర, మరి కొందరు తెలుగుదేశం పార్టీ సభ్యులూ అడిగారు. యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. స్పీకర్ నిర్ణయం ప్రకటించేశారు. చకచకా జరిగిపోయింది. రోజా చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించినట్టు ప్రకటించిన తర్వాత గంటసేపటికి  ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించారు. రోజాకు మైకు ఇవ్వలేదు. ఆమె ఏమి అన్నారో ప్రసారం కాలేదు. ప్రజలకు తెలియలేదు. జరిగిన రభస సభకే పరిమితం. క్షమాపణతో సరిపెట్టవలసిన విషయాన్ని సస్పెన్షన్ వరకూ లాగడంలో ఔచిత్యం కనిపించడం లేదు. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా ప్రతిపక్షం శనివారం చేసిన విజ్ఞప్తిని సభాపతి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రోజాపైన సస్పెన్షన్ వేటు వేయాలని 340 నిబంధన రెండో సబ్‌క్లాజ్ కింద నిర్ణయం తీసుకున్నట్టు  శివప్రసాద్ చెప్పారు. ఈ నిబంధన కింద సంవత్సరం పాటు సభ్యులను సస్పెండు చేసే అధికారమే లేదు. వేటుకు గురి అవుతున్న సభ్యురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవ హరిస్తున్నారంటూ మిత్రపక్షమైన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పిన హితవునూ పెడచెవిన పెట్టారు.


 పాత భవనంలో ఇరుకు శాసనసభలో ముఖ్యమంత్రికే రక్షణ లేదంటూ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న హాలు పాతది. గాంధీ విగ్రహం వెనుక గోపురాలతో ఉన్న భవనాన్ని 1985 వరకూ అసెంబ్లీ సమావేశాలకు ఉపయోగించేవారు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణంగా పదవీచ్యుతుడైన ఎన్‌టి రామారావు ఆగ్రహించి ఆ సభలో అడుగుపెట్టనంటూ ప్రతిజ్ఞ చేసి కొత్త భవనం నిర్మించేందుకు ఆదేశాలు ఇచ్చారు. 315 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా కొత్త సభాస్థలిని నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణకు దక్కింది. పాత అసెంబ్లీ భవనంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష సభ్యులు 67 మందీ స్పీకర్ పోడియం దగ్గరికి ఒక్కసారే వెడితే కొందరు స్పీకర్‌కు కుడివైపు కూడా రావలసి వస్తుంది.

స్పీకర్ వైపు చూస్తూ నినాదాలు చేసుకుంటూ వచ్చిన రోజా వెనక్కి తిరిగే సరికి కొన్ని అడుగుల దూరంలో ముఖ్యమంత్రి ఎదురుగా కనిపించారు. నినాదాలు కొనసాగించారు. పనికట్టుకొని ముఖ్యమంత్రి ఎదురుగా వచ్చి నినాదాలు చేయలేదని చెప్పడం మాత్రమే ఉద్దేశం. అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించినందుకు సభ్యురాలి చేత క్షమాపణ చెప్పించవచ్చు. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ ఆమెను సస్పెండు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ కాలం సస్పెండు చేసే అధికారం స్పీకర్‌కు సైతం 340వ నిబంధన కింద లేదు. క్షణాలలో సభ్యులను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం ఒక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే జరిగింది. కనీసం శనివారంనాడు సభాపతి నిర్ణయం మార్చుకొని ఉదారంగా వ్యవహరించి ఉంటే ఆయన పట్ల గౌరవం పెరిగేది. శాసనసభకూ అపకీర్తి తప్పేది.
http://img.sakshi.net/images/cms/2015-03/51427572512_295x200.jpg

వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి
 

మరిన్ని వార్తలు