సమాఖ్య స్ఫూర్తితోనే ‘సంధానం’

19 Apr, 2015 03:04 IST|Sakshi
సమాఖ్య స్ఫూర్తితోనే ‘సంధానం’

ఇంటర్వ్యూ / వెదిరె శ్రీరాం
 
వెదిరె శ్రీరాం... తెలంగాణ, నల్లగొండ వాసి. అమెరికాలో పదహారేళ్లు ఇంజనీర్‌గా పనిచేసి స్వదేశంలో సేవలందించాలని 2008లో వచ్చారు. నీళ్ల సద్వినియోగం గురించి ‘ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రిడ్’ పేరుతో ఒక పుస్తకం రాశారు. తండ్రి వెంకటరెడ్డితో కలసి ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ మీద కూడా పుస్తకం రాశారు. శ్రీరాం 2009లో బీజేపీ అభ్యర్థిగా నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. తర్వాత వాటర్ మేనేజ్‌మెంట్ నేషనల్ కన్వీనర్‌గా పూర్తి సేవలందించడం మొదలుపెట్టారు. ఇప్పుడు నదుల అనుసంధాన కార్యదళం సభ్యుడిగా నియమితులయ్యారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి జరుగుతున్న నదుల అనుసంధాన యత్నం, ఉపయోగాలు, సమస్యల గురించి శ్రీరాం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ...
 
 నదుల అనుసంధానం వెనుక భావన ఏమిటి? ఉపయోగాలు ఏమిటి?


దేశంలో వర్షాభావ పరిస్థితులు ఒకచోట, వరదలు ఇంకో చోట. ఈ రెండు సమస్య లను ఏకకాలంలో పరిష్కరించేదే నదుల అనుసంధానం. ఉత్తర భారత ప్రాంత జీవనదులు బ్రహ్మపుత్ర, గంగలకు తరచూ వరదలొస్తుంటాయి. ఆ వరద నీటిని దక్షిణాది నదులలో కలపడమే నదుల అనుసంధానం. దీనివల్ల ఉత్తరాది నదుల వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలు సురక్షితమవుతాయి. కరువు పీడిత ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి. ఆ వరదనీటి కోసం ఏర్పాటు చేసే రిజర్వాయర్లతో నేలలో నీటిమట్టం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు అందుతుంది. విద్యుత్తునూ ఉత్పత్తి చేసుకోవచ్చు.

 దీనివల్ల రాష్ట్రాల మధ్య తగాదాలు రావా? అంటే సహజ న్యాయసూత్రాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండొచ్చు కదా? కావేరి జలాల గురించి తమిళనాడు, కర్ణాటక మధ్య; కృష్ణాజలాల గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య గొడవలు ఉండనే ఉన్నాయి. అనుసంధానంతో అలాంటి గొడవలు ఎక్కువవుతాయేమో?

కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలన్నీ కేటా యించిన నీటికి  సంబంధించినవే. నదుల అనుసంధానమేమో వరదనీటి గురించి. ఆ వరదనీరు అలా సముద్రంలో కలసిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకొని ఆయా నదుల్లోకి మళ్లించి నిల్వ చేస్తాం. ఈ అదనపు నీటి మీద నదిని పంచు కుంటున్న అన్ని రాష్ట్రాలకు సమాన హక్కు ఉంటుంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి.. హరీశ్‌రావు, ఉమామహేశ్వరరావులిద్దరూ స్పష్టం చేశారు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగే సమావేశంలో- ‘కేటాయించిన నీటిలో చుక్క కూడా ఇవ్వలేం. మిగులు జలాలు మీ ఇష్టమ’ని. అయినా సమాఖ్య స్ఫూర్తిని  దెబ్బతీయకుండా జాతీయ స్ఫూర్తితోనే ఉపయోగించుకుంటాం కాబట్టి గొడవలూ, తగాదాలూ ఉండవనే అనుకుంటున్నా.
 నదుల అనుసంధానం అంటే భారీ ప్రాజెక్టులు కట్టాల్సివస్తుంది... దీనివల్ల పర్యావర ణం మొదలు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం.. ఇవన్నీ మళ్లీ సమస్యలే కదా. వీటన్నిటి దృష్ట్యా పర్యావరణవేత్తలు చెక్ డ్యామ్స్‌నే సూచిస్తున్నారు. దీనికి మీరిచ్చే వివరణ ఏమిటి?
 నిజమే. ఈ వాదనను నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో నిర్మించిన భాక్రానంగల్ ప్రాజెక్ట్ నిర్వాసితులకే ఇప్పటిదాకా పరిహారం, పరిష్కారం దొరక లేదు. ఇప్పుడు మళ్లీ ఇంత పెద్ద ప్రక్రియంటే నష్టం ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అనే ఆందోళన ఉంటుంది. అలాగే ‘ఎకోలాజికల్ ఫ్లో’ అనేది నది హక్కు. దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అదే సమయంలో ఈ ప్రక్రియ వల్ల భారీ నష్టం వాటిల్లకుండా దీన్ని విజయవంతం చేసే దిశగా ఉన్నాం. అంటే పెద్దపెద్ద లింక్స్ ఉన్నచోట రెండు మూడు బ్యారేజ్‌లు నిర్మించడం ద్వారా ముంపు ప్రాంతం పరిధినీ, ఇతరత్రా జరిగే నష్టాలనూ తగ్గించవచ్చు. ఉదాహరణకు.. ఒడిశాలో మహానది బేసిన్ నుంచి గోదా వరికి మళ్లే ప్లేస్‌లో మణిభద్ర ఉంది. అక్కడ ప్రాజెక్ట్ కట్టాలంటే చాలా ప్రాంతం ముంపునకు గురవుతుంది కాబట్టి ఒడిశా ఒప్పుకోవట్లేదు. ప్రాజెక్ట్‌కి ప్రత్యామ్నాయ పద్ధతి అయిన బ్యారేజెస్ గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. మా ఈ ప్రతి పాదనకు ఒడిశా అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఇలా చర్చలతో సమస్యను  పరిష్కరించుకుంటూ వెళ్తాం. అయితే అసలు నష్టం లేకుండా మాత్రం సాగదు. ఇక్కడ ఒక విషయం.. తాగునీరు, సాగునీరు బేసిక్ హ్యుమన్‌రైట్స్. మంచినీటిని కొనుక్కోవడం, రుణమాఫీ ఈ రెండూ ఆ రెండిటికీ ప్రత్యామ్నాయం కావు. నదుల అనుసంధానంతో తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ఈ రెండు పెద్ద ప్రయోజనాల కోసం కొంత నష్టాన్ని భరించవచ్చు అంటాను. అదీగాక ముంపునకు గురయ్యే ప్రాంతంలోని ప్రజలకు ముందు పునరావాసం చూపిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు చేపట్టాలనుకుంటున్నాం.

 నదుల అనుసంధానానికి బీజేపీ తప్ప ఇంకే పార్టీ ప్రభుత్వాలూ అనుకూలంగా ఉన్న ట్టు కనిపించడంలేదు. రాజకీయపరమైన ఆ అడ్డంకులను ఎలా అధిగమించబో తున్నారు?

నదుల అనుసంధానం, దాని ఉపయోగాలన్నీ ప్రజల ముందు పెడ్తాం. దీని గురించి వాళ్లకు అవేర్‌నెస్ కల్పిస్తూ .. ఇటు నాయకులతోనూ చర్చిస్తాం. ఇలా దీని మీద అందరికీ ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నిస్తూ వాళ్ల అంగీ కారంతోనే ఈ ప్రాజెక్ట్‌ను విజయంతం చేయాలనుకుంటున్నాం.

నదుల అనుసంధానం ఎప్పుడు మొదలై ఎప్పటికి పూర్తవ్వచ్చు?

2002లోనే దీనికి సంబంధించిన 30 లింక్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఆ 30లో ఫస్ట్ లింక్ మధ్యప్రదేశ్‌లోని కెన్, బెత్వా నదుల మీద, సెకండ్ లింక్ దమన్‌గంగా, పింజాల్ నదుల మీద, థర్డ్ లింక్ పార్, తాపీ, నర్మద నదుల మీద నిర్మాణం మొదలవబో తోంది. ఇట్లా మిగిలినవి త్వరగానే మొదలుపెట్టి త్వరగానే పూర్తిచేయాలనే సంక ల్పంతో ఉన్నాం. నిజానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది కూడా ఈ పనిని వేగవంతం చేయడానికే!

చివరిగా- ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ గురించి చెప్తారా? దీనికి నదుల అనుసం ధానానికి ఏమైనా సంబంధం ఉందా?

ఇవి రెండు వేర్వేరు ప్రాజెక్టులు. నదులు అనుసంధానం నీటిపారుదల శాఖకు చెం దింది, ఇన్‌ల్యాండ్ షిప్‌యార్డ్ మంత్రిత్వ శాఖది. ఈ రెండు శాఖల సమన్వయంతో ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ జరుగుతుంది. నదీపరీవాహక ప్రాంతాల్లో బ్యారేజ్‌లు కట్టుకుంటూ ఆ నదులను జీవనదులుగా మార్చడం, తద్వారా వాటిని నౌకాయా నానికి అనుకూలంగా తయారుచేయడమే ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్. ఉదాహ రణకు.. బంగాళాఖాతం నుంచి నదుల మీదుగా గోదావరి సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కట్టుకుంటూ  ఆ నీటి మీద తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (పోచంపాడు) వరకు నౌకలను తేవచ్చు. ఇంకా చెప్పాలంటే ధవళేశ్వ రం నుంచి పోచంపాడు దాటి మహారాష్ట్రలోని గైక్వాడ్ డ్యామ్ వరకు, అంటే ఈ తీరం నుంచి ఆ తీరందాకా అన్నమాట. శబరి మీద ఒడిశాలో, మంజీర మీద కర్ణాటకలో బ్యారేజెస్ నిర్మించి ఈ ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్‌ను సాధించవచ్చు. ఈ నౌకాయానం వల్ల ఓడల ద్వారా వర్తకం, వ్యాపారం జరుగుతుంది. దీనివల్ల ఆయా తీరప్రాంతాల్లో మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు వెలుస్తాయి. టూరిజం వృద్ధి చెందుతుంది. లోకల్ మార్కెట్ పెరుగుతుంది. వీటన్నిటి ద్వారా  దాదాపు కోటి మం దికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇట్లా ఇంతపెద్ద ఎకానమీని బూమ్ చేయొచ్చు. మా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అదే.
 - సరస్వతి రమ
 
నదుల అనుసంధానం మళ్లీ రంగం మీదకు వచ్చింది. దీనితో పాటు ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ మీద కూడా ఎన్డీయే కసరత్తును పునఃప్రారంభించింది. ఆ పథకం, దాని చుట్టూ ఉన్న వివాదాలు రెండూ పాతవే. వాటిని ఎలా అధిగమిస్తారు?  ఇంత పెద్ద  పథకం ఎప్పటికి పూర్తి చేస్తారు?
 

మరిన్ని వార్తలు