శిలాఫలకాలే ఆశాకిరణాలు

9 Sep, 2017 01:38 IST|Sakshi
శిలాఫలకాలే ఆశాకిరణాలు

అక్షర తూణీరం

నాయకులు ఇచ్చిన వాగ్దానాలను ప్రేక్షక శ్రోతలు మర్చిపోరు. నాయకులు సమయానికి తగు మాటలాడి, వేదిక దిగుతూనే మనసులోంచి దులిపేసుకుంటారు.

నాటక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. అది పౌరాణికం, సాంఘికం, జానపదం ఏదైనా కావచ్చు. టిక్కెట్టు లేని అందరూ ఆహ్వానితులే బాపతుకి జనం కొరత ఉండదు. ప్రతి నాటకానికి ఒక ట్రూప్‌ లీడర్‌ ఉంటాడు. సామాన్యంగా ఆయన నాటకంలో ముఖ్యపాత్ర పోషిస్తాడు. వేషం ఏదైనా మంచి దుస్తుల్లో కనిపిస్తాడు. చప్పట్ల వాన కురిసే అదునుపదును ఉన్న డైలాగులు ట్రూప్‌ లీడర్‌ నోట ఎక్కువగా వస్తాయ్‌. సీన్‌కి సీన్‌కి మధ్య గ్రీన్‌ రూమ్‌లో నటీనటులు మాట్లాడుకుంటారు. పరస్పరం అభినందించుకుంటారు. తాను సరిగ్గా అందుకోలేకపోయినాసరే, తప్పు ప్రాంప్టర్‌దే అన్నట్టు సైడ్‌వింగ్‌ని కేకలేస్తారు.

ఇప్పుడు ప్రభుత్వ పక్షాన నిత్యం జరుగుతున్న సభల్ని చూస్తుంటే నాటక రంగమే గుర్తొస్తోంది. ఈ రాజకీయ రంగస్థలం మీద ఎందరో ఆసీనులై ఉంటారు. వారంతా సందర్భోచితంగా ట్రూప్‌ లీడర్‌ ప్రసంగానికి మితిమీరి స్పందిస్తూ కనిపిస్తారు. నవ్వి నవ్వించడం, చప్పట్లకు సంకేతాలిచ్చి అందర్నీ కరతాళ ధ్వనులకు ఉసిగొల్పడం, ఆశ్చర్యపోవడం, తరచూ ఆవులింతలు ఆపుకోవడం లాంటి చర్యలు వేదిక మీది పెద్దల్లో చూస్తాం. అంతా లీడర్‌ సహచరులే అయినా, ఆయన మాటలకు విస్తుపోతూ ఉంటారు.

ఎందుకంటే ఆ పనులూ, ఆ పథకాలూ ఎప్పుడూ అనుకొనిగానీ, విని గానీ ఉండరు. ఈ ట్రూప్‌ లీడర్‌ ప్రదర్శించే నాటకంలో మిగతా ట్రూప్‌కి పోర్షన్లు ఉండనే ఉండవు. నాటకంగా చెబుతారు గానీ ఏకపాత్రాభినయంగా నడిచి ముగుస్తుంది. రోడ్లు, కాలువలు, విద్య, వైద్యం, అభివృద్ధి, పారిశుధ్యం, మీరేదైనా చెప్పండి– అన్నీ నంబర్‌వన్‌ చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ సభకు తెరపడుతుంది. మర్నాడు ఇంకో సభ. అక్కడ మళ్లీ బోలెడు కొత్త ముచ్చట్లు. అనేక భరోసాలు.. ఇలా సభ మీద సభ నడిచిపోతూ ఉంటుంది.

నాయకులు ఒక్క సంగతి గుర్తు పెట్టుకోవాలి. వేదికలపై నుంచి మైకుల్లో వారిచ్చిన వాగ్దానాలను ప్రేక్షక శ్రోతలు మర్చిపోరు. నాయకులు సమయానికి తగు మాటలాడి, వేదిక దిగుతూనే మనసులోంచి దులిపేసుకుంటారు. కాలం కదిలిపోతుంది. పవర్‌లోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. వేసిన ఎసళ్లు ఇంకా వేసినట్టే ఉన్నాయ్‌. జనం నకనకలాడుతున్నారు. అప్పుడే మళ్లీ ఎన్నికల కథలు మొదలైనాయ్‌. ట్రూప్‌ లీడర్‌కి కొత్త వాగ్దానాలేవీ గుర్తు రావడం లేదు. ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందాంధ్రప్రదేశ్‌ దాకా జనానికి చూపించేశారు. మహా క్యాపిటల్‌ అమరావతి చుట్టుపక్కల బోలెడన్ని శిలాఫలకాలు ఆశాకిరణాలుగా మెరుస్తున్నాయి. ఇవన్నీ మిద్దెలై, మేడలై, మహా నగరాలై, విశ్వవ్యాప్తమై, ప్రపంచ ప్రసిద్ధం కావాలంటే– చచ్చినట్టు నన్నే గెలిపించాలి. ఇదే మా ఎజెండా!

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు