పాత్రికేయులకు పెద్దబాలశిక్ష

9 Jul, 2016 01:11 IST|Sakshi
పాత్రికేయులకు పెద్దబాలశిక్ష

అక్షర తూణీరం

 

ఆవటపల్లి నారాయణరావు పేరు చాలా తక్కువమంది విని ఉంటారు. 1878 ప్రాంతంలో ఏలూరులో పుట్టారు. బందరులో పెరిగారు. చాలా చిన్న వయసులోనే పత్రికా రంగంలో అడుగుపెట్టి నిగ్గుతేలారు. కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, భారతి వంటి ఆనాటి ఐరావతాలను నడిపించిన మావటీ అవట పల్లి. ఆనాడు సాహితీ పరిమళాలకు కునేగా మరికొళుందు జోడించుకుని తెలుగు లోగిళ్లను ఘుమఘుమలాడించిన ఆంధ్రపత్రిక ఉగాది సంచికలకు ఒరవడి పెట్టిన మంచి హస్తవాసి ఆయనది. పేరు ప్రఖ్యాతి ఆశించక అంతర్యామిగానే ఉన్నారు.

 

పెళ్లి పేరంటాలు ఇతర జంజాటనలు పెట్టుకోకుండా, తన శక్తి సామర్థ్యా లన్నిటినీ అక్షరసేవకే వినియోగించారు. 1923లో బర్మా వెళ్లి, అక్కడ ఆంధ్ర కార్మిక ఉద్యమానికి దన్నుగా నిలిచారు. నారాయణరావు కార్య దక్షత ఆయనను బర్మా శాసన సభ్యుని చేసింది. 1942 దాకా బర్మాలోనే ఉండి కార్మిక సంఘాలను ఏకంచేసి, పోరాటం సాగించి గెలిచారు. బందరులో ఉన్నా బర్మాలో ఉన్నా ఆయన పోరు తెల్ల దొరతనంమీద. 30 డిసెంబరు 1946న గుడివాడలో ఆవటపల్లి నారాయణరావు కన్ను మూశారు.

 

జీవితమంతా పత్రికా రంగానికి, బర్మా ఆంధ్ర కార్మిక ఉద్య మానికి ధారపోశారు. ఈ ప్రస్థా నంలో ఆనాటి రాజాలు, జమీందా రులు, వృత్తి వ్యాపారాలవారు, రాజ కీయ నాయకులు, సంస్కర్తలు, రచ యితలు - పార్టీలకు, కులవర్గాలకు అతీతంగా ఆయనకు సన్నిహి తులు. వారిలో 88 మంది జీవిత విశేషాలను, వ్యక్తిత్వాలను ఏర్చి కూర్చి ‘‘విశాలాంధ్రము’’ సంపుటిని 1940లో ప్రచురించారు. పేరు ప్రతిష్ట లున్న వారిపై నిర్మొహమాట ధోరణిలో వచ్చిన తొలి తెలుగు సంపుటి విశాలాంధ్రము.

 

ఈ కర్మయోగి కూర్చిన వ్యాసాలలో పిఠాపురం రాజా, ముక్త్యాల రాజా, కాశీనాథుని నాగేశ్వరరావు, ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు, కట్టమంచి, వైఎస్ చింతామణి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ముట్నూరి, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, కె. కోటిరెడ్డి, ముళ్లపూడి తిమ్మరాజు మొదలైన మహనీయులెందరో మనకు దర్శన మిస్తారు. హాయిగా చది వించే రీతిలో వ్యాసం రాయడం చిన్న విషయం కాదు. స్తోత్రాలు, దండ కాలు, భజనపాళీలు లేకుండా, మెరుపుల్ని మర కల్ని సమాన స్థాయిలో ఎత్తిచూపుతూ రచన సాగించడానికి ధైర్య సాహసాలుండాలి. ఇవి రాసే నాటికి వీరంతా రచయిత సమకాలికులు. నిజాయితీ నిక్కచ్చితనం ఉన్న పాత్రికేయునికి మాత్రమే ఆ గుండెదిటవు ఉంటుంది. వాటికి తోడు విలక్షణమైన శైలి జతపడి వ్యాసాలు నూతన ఒరవళ్లయినాయి.

 

అప్పుడప్పుడే మారాకులు తొడుగుతున్న మొక్కల్ని ముందుగానే గుర్తించి, ఇవి కాబోయే వట వృక్షాలని ఆవటపల్లి సూచించారు. కథ నంలో నాటకీయత, శైలిలో తూగుతోపాటు ఉరవడి, ఆయా వ్యక్తులతో సాన్నిహిత్యం - ఇవన్నీ ఏకకాలంలో, ఏక స్థానంలో కలిసిరావాలి. అలా కల్పించుకున్న సిద్ధుడు నారాయణరావు. ఆనాటి త్యాగమూర్తులను, ధర్మవర్తనులను, దేశభక్తులను స్మరించుకోవడానికి ఇది అనువు. ఆవట పల్లి రచనా శైలి వర్ధిష్ణులైన పాత్రికేయులకు పాఠాలు నేర్పుతుంది. క్లుప్తత, ఆప్తత, గుప్తత ముప్పేట సాగే వ్యాసాలివి.

 

 

మరల 76 ఏళ్లకు ‘‘విశాలాంధ్రము’’ను బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారు ముద్రించారు. అదీ సర్వాంగ సుంద రంగా. అపురూపమైన కొత్త భోగట్టాతో కొత్త చిగుళ్లు తొడిగారు మోదు గుల రవికృష్ణ. సంపాదక బాధ్యతలు తీసుకుని ఏడాదిపాటు శ్రమిం చారు. మొన్నంటే మొన్ననే (జూలై 7) గుంటూరులో ఆవిష్కరణ సభ పెళ్లి సంబరంలా జరిగింది. సభకి ఆనాటి ఆస్థానాల, జమీన్‌ల, వదా న్యుల వారసులను ఆహ్వానించారు. కొందరు వచ్చారు. సభకి నిండు దనం చేకూరింది. ప్రభుత్వం చేయాల్సిన పని బొమ్మిడాల ఫౌండేషన్ చేసింది. మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించి, భాగం పంచుకెళ్లారు. చాలదూ?

 

- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు