పురస్కారాలూ - ప్రతిస్పందనలూ

14 May, 2016 02:55 IST|Sakshi
పురస్కారాలూ - ప్రతిస్పందనలూ

అక్షర తూణీరం

 

పొగడ్త సుగంధ ద్రవ్యం లాంటిది. అది మితంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. దాని వాడకం వ్యసనంగా మారితే చాలా ప్రమాదం - అంటూ ఒక పెద్దాయన హెచ్చరిస్తూ ఉండేవాడు.

 

సర్వసాధారణంగా సన్మానవేళ పంచాంగాలు ప్రధానంగా ఉంటాయి. పత్రం, పుష్పం, పచ్చడం, ఫొటో, పొగడ్త - ఇవీ ఆ ఐదు ప్రధానాంగాలు. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా సన్మానం అందగించక పోగా మందగిస్తుంది. నేనీమాట స్వానుభవంతో చెబుతున్నా.

 

మొన్నంటే మొన్న తెలుగు విశ్వ విద్యాలయం వివిధ సాహిత్య సాంస్కృతిక కళా రంగాలలో విశేష కృషి చేసి, చేస్తున్న కొందరిని గుర్తించి సత్క రించింది. వారందరికీ ఒకే వేదికపై పురస్కారా లందించి, తనని తాను సన్మానించుకుంది.

 

నిజంగా నాకెంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను. పైగా నా కాళ్లతో నేను వేదిక ఎక్కకలిగిన స్థితిలో, మనుషులు మనుషుల్లా కని పిస్తున్న దశలో నా గురించిన గొప్ప గొప్ప పొగడ్తలను స్వయంగా నా చెవులతో నేను వినగలిగిన వేళ - ఇలాంటి సదవ కాశం రావడం అదృష్టం. పంచేం ద్రియాలలో ఎనిమిది ఇంద్రియాలు పనిచేయని తరుణంలో ఇలాంటివి అడవిగాచిన వెన్నెలలవు తాయి. నా సంతోషానికి మరో కారణం, ఏకకాలంలో ఎక్కువమందిని సన్మానించడం. బాగా స్టేజిఫియర్ ఉన్న నాలాంటి వారికి చాలా ధైర్యంగా ఉంటుంది. ఎవరు ఏ రంగం నుంచి వచ్చినా, అక్కడ అందరం పురస్కార గ్రహీతలమే కదా. అదొక వెర్రి ధైర్యాన్ని స్తుంది. పైగా చూసి చూసి అక్కడి తంతు అర్థమ వుతుంది. మన వంతు వచ్చినపుడు తడబాటుకి ఆస్కారం ఉండదు. మీడియాకి ఎక్స్‌పోజు కావల్సిన పోజు కూడా నేర్చు కునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో పండిపోయిన వారు, మిగల ముగ్గిన వారు కొంద రుంటారు. వారిని గమనిస్తే నాలాంటి కసుగాయలకు చాలా మెలకువలు తెలు స్తాయి. అనంతరం, దండని తీసి ఆ నిర్మాల్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, విప్పి కప్పిన శాలువాని మడతలు ఎలా మడుచుకోవాలి లాంటి పలు సున్నిత అంశాలు అవగతం అవుతాయి. భావి జీవితానికవి రాచబాటలవుతాయి.

 

ఇలాంటి పురస్కారాలు ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కాని నా అనుభవం వేరుగా ఉంది. మొన్న బస్సు దిగి, సభా ప్రాంగణంవైపు వెళ్తుండగా ఒక పెద్దాయన అడ్డుకున్నాడు. ఏమి టిక్కడ విశేషం అన్నాడు. చెప్పాను. మరి మరేమిటనగా, నేనిట్టా హాస్యం, నా పేరు ఫలానా అన్నాను. ఆయనొ క్కసారి ఆశ్చర్యంగా చూశాడు.

 

‘‘అయ్యో! మీరా సంతోషం... ఎన్నాళ్లకు మీ దర్శనం’’ అంటూ కరచాలనం చేశాడు. మా ఇంటి ల్ల్లిపాదికీ మీ రాతలంటే చచ్చే ఇష్టం... ఈ యూనివర్సిటీలు అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తాయండోయ్ అంటూ విరగబడి నవ్వాడు. మీరు... చాలా హిలేరియస్ అబ్బో!

 మరీ ఆ బుడుగు... అప్పారావ్... బారిష్టర్ పార్వతీశం... ‘‘అది నేను కాదండీ’’ అనేశాను అప్రయత్నంగా. బుడుగు అవీ ముళ్లపూడి రమణ గారు రాసింది నేను కాదండీ’’ అన్నాను ధైర్యంగా. సర్లెండి, మీరు ఆ రమణేమో.. లోపలికి వద్దామనుకున్నా. మా అబ్బాయి సెలూన్‌కి వెళుతూ ఇక్కడ ఉండమన్నాడు. ఓకే.. వస్తాడు పికప్ చేసుకుంటాడు’’  ఈ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని కుంగతీశాయ్.

 

- శ్రీరమణ

 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు