ఆత్మస్తుతి–పరనింద

8 Apr, 2017 02:22 IST|Sakshi
ఆత్మస్తుతి–పరనింద

అక్షర తూణీరం
చంద్రబాబుకి ‘ఆత్మస్తుతి పరనింద‘ అనేది జాడ్యమై పట్టుకుంది. దీనివల్ల ప్రత్యర్థి సదా జనం మనసులో మెదుల్తుంటాడు. ఇదొక సర్వే రిపోర్ట్‌! ‘‘మీరు గమనించారా... మొన్నంటే మొన్న చంద్రబాబు జగజీవన్‌రామ్‌కి ఘనంగా నివాళులర్పించారు’’


‘‘ఔను, అర్పించారు. అయితే...’’ అన్నాను. ‘అదే మరి, మీకూ నాకూ తేడా’’ అన్నాడు పెద్దాయన. అయోమయంగా చూశాను.

చంద్రబాబు ‘‘జగ’’ అన్న రెండక్షరాలు పలగ్గానే ఆయనకు ప్రతిపక్షనేత ‘‘జగన్‌’’ మనసులోకి వచ్చారు. జగన్‌ చేసిన, చేస్తున్న, చేయబోయే అకృత్యాలను ఏకరువు పెట్టి, ఆ పూటకి బరువు దించుకున్నారు– అంటూ పెద్దాయన తను గమనించిన సత్యాన్ని చెప్పాడు. నే చెబుతున్న ఈ పెద్దాయన తెలుగుదేశం అభిమాని. ఎన్టీఆర్‌కి వీరాభిమాని. పార్టీని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబుపై ఆయనకి పిచ్చి నమ్మకం. కాకపోతే ప్రత్యర్థిని క్షణక్షణం తలుచుకుంటూ ఉలికిపాట్లు పడడం పెద్దాయనకు సుతరామూ గిట్టదు.

వెనకటికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇదే చేసి దెబ్బతిన్నారు. హరి ప్రస్తావన ఎక్కడ వచ్చినా అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు. నారదుడు లాంటి వారు అప్పుడప్పుడు అగ్నిలో ఆజ్యం పోస్తుండేవారు. నీ రాజ్యంలో తుమ్మెదలు అదే పనిగా హరి నామ స్మరణ చేస్తూ పూల మీద వాలి మధువు సేకరిస్తున్నాయి. ఏ పూల తోటకి వెళ్లినా నీ శత్రు నామ స్మరణే వినిపిస్తోంది రాక్షసాగ్రణీ! అంటూ హిరణ్యకశిపునికి విన్నవించాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! రాక్షస సైన్యాన్ని పిలిపించి, రాజ్యంలో తుమ్మెదలు ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికి పోగులు పెట్టండని ఆజ్ఞాపించాడు.

రాక్షస గణాలు విజృంభించాయి. వారం తిరిగే సరికి రాజ్యంలో ఎక్కడా పచ్చని మొక్కగానీ, పూలుగానీ లేకుండా పోయాయి. తుమ్మెదలు పూల కోసం వెదుకుతూ, ఝంకారం చేస్తూ, ఎగురుతూ తిరుగుతూనే ఉన్నాయి. చట్టం ఎటూ తన పని తాను చేసుకు వెళుతుంది. ఇంటా బయటా ఎక్కడంటే అక్కడ ప్రత్యర్థి ప్రస్తావన తేవడం అంత వినసొంపు కానేకాదు. ఎమర్జెన్సీ తర్వాత జనం ఇష్టపడి జనతా ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు. వారు ఇందిరాగాంధీ స్మరణతో గడుపుతూ, నాలుగువేల కేసులు పెట్టి నిత్యం ఆమెను వార్తల్లో ఉంచారు. తిరిగి ఆవిడ అత్యధిక మెజార్టీతో పవర్‌లోకి రానే వచ్చింది. ఆ పెద్దాయన పాపం పదే పదే అదే అంటుంటాడు.

ఆ మాటకొస్తే మోదీ తెలివైనవాడు. వారి హయాంలో కాంగ్రెస్‌ నేతలు కూడా దేశానికి బోలెడు చేశారని వదిలేశాడు. నిత్యం దైవ ప్రార్థనలా కాంగ్రెస్‌ని విమర్శించడం అవసరమా? పెద్దాయన అన్నట్టు, చంద్రబాబుకి ‘ఆత్మస్తుతి పరనింద‘ అనేది జాడ్యమై పట్టుకుంది. దీనివల్ల ప్రత్యర్థి సదా జనం మనసులో మెదుల్తుంటాడు. ఇదొక సర్వే రిపోర్ట్‌!


(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

మరిన్ని వార్తలు