చంద్రశేఖర సోమయాజి!

19 Dec, 2015 02:39 IST|Sakshi
చంద్రశేఖర సోమయాజి!

అక్షర తూణీరం
 
కేసీఆర్ తలపెట్టిన యజ్ఞం తాలూకు వార్తలే రెండు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. విశ్వశాంతిని కాంక్షిస్తూ సంకల్పించిన మహాయజ్ఞమిది.
 
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మహాయాగశాలగా మారిపోయింది. యాభై ఎకరాల సువిశాల ప్రాంగ ణంలో నూటారు హోమగుండాలు స్థాపితమ య్యాయి. పదిహేను వందల మంది రుత్విక్కులు వేదమంత్రాలను నాలిక చివర నిక్షిప్తం చేసుకుని అయుత చండీ మహాయాగానికి హాజరవుతున్నారు.

పూటా ఐదు వేల మందికి మడి భోజనాలుంటాయి. యాభై వేల మందికి పొడి భోజనాలుంటాయి. వండి వార్చి వడ్డించడానికి నలభీమ సములైన పాకశాస్త్ర ప్రవీణులు గరిటెలతో ప్రాంగణానికి రానున్నారు. నాలుగు వేదాలు పుక్కిట పట్టిన వేదకోవిదులు వేదనాదంతో ఎర్రవెల్లిని పునీతం చేయనున్నారు. మంత్రశాస్త్రాన్ని ఆపోశన పట్టేసిన పండితవర్గం హోమగుండాలను సభిక్షం చేయనుంది.

మహా యజ్ఞానికి కావాల్సిన ద్రవ్యాలు ఈసరికు యజ్ఞస్థలికి చేరాయి. మేడి, రావి మొదలైన అర్హత గల సమిధలు ఎండుగా మెండుగా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. దర్భలు మేటలుగా నిలిచి, ఎప్పుడెప్పుడు యజ్ఞగుండాలకు ఆహుతవుదామా అని ఎదురు చూస్తున్నాయి. ప్రశస్థమైన ఆవు నెయ్యి పీపాలలో ఘుమఘుమలా డుతోంది.

దాదాపు రెండునెలల నుంచి కేసీఆర్ తలపెట్టిన యజ్ఞం తాలూకు వార్తలే రెండు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. విశ్వశాంతిని కాంక్షిస్తూ సంకల్పించిన మహాయజ్ఞమిది. యాభై కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. అయితే విశ్వశాంతి, దేశ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగే సత్కార్యానికి ఇదేమీ పెద్ద బడ్జెట్ కాదు. ఎటొచ్చీ సక్సెస్ రేటుని పరిశీలించాల్సి ఉంది. కేసీఆర్‌కి మొదటి నుంచీ ఆధ్యాత్మిక వాసనలంటే ఇష్టం. నమ్మకం కూడా. ప్రత్యేక తెలంగాణ యాగా లతోనే సాధ్యపడిందని ఆయన నమ్మకం.

ఈ మహా క్రతువుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా చేయ సంకల్పించారు. దేశంలో ప్రముఖులను ఆహ్వా నించడమే ఒక యజ్ఞంలా సాగించారు. భారత రాష్ట్రపతి ఇప్పటికే పొలిమేరల్లో విడిది చేసి ఉన్నారు. ప్రధాని మోదీ ఒక ముఖ్యఘట్టానికి హాజరు కానున్నారు. దైవభక్తి, పాపభీతి మెండుగా గల రాష్ట్ర గవర్నరు అరణితో అగ్ని రగల్చడం నుంచి పూర్ణాహుతి దాకా ఉండి, మోయగలిగినంత పుణ్యాన్ని రాజ్‌భవన్‌కు మోసుకువెళితే అది వార్తకాదు. హేతువాదులు ఇలాంటి క్రతువులను గొప్పవేస్టుగా భావిస్తారు.

అసలీ ఖర్చు ఏ ఖాతాలోదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక మంచి పనికి, పైగా పుణ్యకార్యానికి ఆ మాత్రం ఖర్చు చేసే స్వేచ్ఛ ఒక ముఖ్యమంత్రికి లేకపోతే రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉంటుంది.

అసలు పిలుపులతోనే కేసీఆర్ ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పారని పరిశీలకులు వాపోతున్నారు. మరీ ముఖ్యంగా కృష్ణాతీరానికి హెలికాప్టర్‌లో సకుటుంబంగా వెళ్లి పొరుగు రాష్ట్రాధినేతను ఆహ్వానించడం అందరినీ ఆకర్షించింది. చంద్రబాబు తన పాతమిత్రునికిచ్చిన ఎదురుకోలు కూడా ముచ్చటగా ఉంది.

ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన చండీమహాయజ్ఞ పిలుపు విందు కమ్మగా నోరూరించేలా ఉంది. నాటు కోడికూర, చేపల పులుసు, ఇంకా ఇతర భూచర, భేచర, జలచర వంటకాలను కొసరి కొసరి వడ్డించి కేసీఆర్‌తో తినిపించడం భలేగా ఉంది. మొత్తానికి మహాయజ్ఞం మసాలా వాసనతో ఆరంభమైనట్టుంది.
 
 - శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు