పొగడ్తల రాజసూయం

27 Aug, 2016 01:44 IST|Sakshi
పొగడ్తల రాజసూయం

అక్షర తూణీరం
అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు!

ఆనాడు ధర్మరాజు రాజ సూయం చేశాడు. అది మహా భారతంలో ఒక సువర్ణ అధ్యాయం. ఆ యజ్ఞం చేయ డానికి గొప్ప శక్తి సామర్థ్యాలు కావాలి. పుష్కలంగా నిధులు కావాలి. అర్జునుడు లోకం మీదపడి, రాజుల్ని గెలిచి ధనం దండుకువచ్చాడు. అప్పట్నించీ ‘ధనంజయుడు’ అనే కీర్తినామం ధరించాడు. ఆ సందర్భంలోనే మయుడు ఒక మహత్తరమైన సభా మండపాన్ని నిర్మించి పాండవులకు కానుకగా సమర్పించాడు. రాజ సూయానికి సుయోధనుడు కూడా మంచిమనసుతోనే వచ్చాడు. ఆయనను ఖజానావద్ద కూర్చోబెట్టారు. రారాజు చేతిలో పరుసవేది ఉంది. అంటే ఆ చేతులతో ధనధాన్యాలను తీస్తుంటే, ఎన్నితీసినా అవి అడు గంటవు. గల్లాపెట్టె అక్షయపాత్రగా నిలుస్తుంది. రాజ సూయం వెనకాల సచివుడు సారథి శ్రీకృష్ణుడున్నాడు కనుక కిటుకులు చెప్పి ముందుకు నడిపించాడు. అత్యంత శోభాయమానమైన మయసభను సుయో ధనునికి విడిదిగా ఇచ్చారు. మయసభ రారాజుకి ‘అయోమయ సభ’ అయింది. ఆపైన పాంచాలి పరిహ సించుటయా! మయసభలోనే కురుక్షేత్ర మహా సంగ్రా మానికి బీజం పడింది. శ్రీకృష్ణుడిని అగ్రపూజకు ఎంపిక చేశారు. కొందరు హర్షించి ఊరుకున్నారు. శిశుపాలుడు మాత్రం సభాముఖంగా రెచ్చిపోయాడు. కృష్ణునిలో పర మాత్ముని పక్కనపెట్టి, ఉతికి ఆరేశాడు. నిండుసభలో సుదర్శనానికి శిశుపాలుడు బలైపోయాడు. నలుగురు సోదరులు నాలుగు వేదాలై నిలవగా, ధర్మజుడు యజ్ఞ కుండమై భాసిల్లాడని వ్యాసమహర్షి అభివర్ణించాడు. రాజసూయంలో పాండవులపై కురిసిన పొగడ్తలు అన్నీ ఇన్నీ కావు. శేష జీవితానికి సరిపడా, పళ్లు పులిసేలా పొగిడేశారు సామంతులు.


ఇక్కడ ఇది చాలా అసందర్భమే కానీ, ఎందుకో కృష్ణా పుష్కరాలని ఆరంభం నించి చివరి ఆస్ట్రేలియా బాణసంచా దాకా చూశాక రాజసూయ ఘట్టం గుర్తుకు వచ్చింది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. అదేదో సంగమం దగ్గర కృష్ణానదిని ఆవహించినంతగా ఉంది. దాదాపు నెల రోజులపాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు డుమ్మా కొట్టాయి. కలెక్టర్ల నుంచి దిగువ దాకా అందరూ ‘‘ఆన్‌ డ్యూటీ’’గా పుష్కర ఘాట్లలో మునిగి తేలారు.


అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు! ‘‘అటుపోతే బ్యారికేడ్లు, ఇటు చూస్తే నీటి ప్రవాహం – ఈ మధ్యలో త్రిశంకు స్వర్గంలో నిలబడిపోయాం. ఏ దారీ లేక గోదారి అన్నట్టు, అక్కడ దొరికిపోయాం. పైగా పోలీసులు’’ అని ఒక భక్తుడు తడిబట్టలతో బాధపడ్డాడు. ‘‘మొత్తానికి బాబు మాస్‌ హిస్టీరియా క్రియేట్‌ చేశాడు’’ అని ఓ హేతువాది నిర్భ యంగా వ్యాఖ్యానించాడు. ‘‘ప్రజాధనం గంగలో పోశారు’’ అంటూ బెజవాడ పాత కమ్యూనిస్టు కష్ట పడ్డాడు. ‘‘ఒక రోజు పెళ్లికి మొహమంతా కాటుక’’ అన్నట్టు ఈ మాత్రం దానికి ఇంత హంగామా అవ సరమా అని చాలామంది అనుకున్నారు. కిలోమీటర్ల పొడవున ఎంతో ఉదారంగా నిర్మించిన స్నానఘట్టాల మెట్లన్నీ తోలు తీసిన ఆవుదూడల్లా కనిపిస్తున్నాయి. పైన పరిచిన టైల్స్‌ని పీక్కుపోవడం ప్రారంభమైంది. ఎంతైనా మన జాతి అసామాన్యమైన జాతి.

శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు