ఇదియొక చమత్కారం

19 Mar, 2016 01:12 IST|Sakshi
ఇదియొక చమత్కారం

అక్షర తూణీరం
 
చాలా ఏళ్ల క్రితం పరిచయం ఉన్న ఒక ఎమ్మెల్యేగారిని అభినందిస్తూ ‘‘మీరు సభాపతి అవుతారనిపిస్తోందండీ!’’ అన్నాను. ఆయన వెంటనే, ‘‘వద్దండీ! సభలో హాయిగా కునుకు తీయడానికి ఉండదు’’ అంటూ కంగారు పడ్డారు. సెమినార్లలో, పునశ్చరణ తరగతులలో అధికారులు నిద్ర ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు.
 

గడచిన రోజు ప్రపంచ నిద్రా దినోత్సవం. నిద్రాప్రియులు ఇప్పుడు జాగృతమై ఉంటారు. వారందరికీ శుభాకాంక్షలు. నిద్ర ఒక యోగం. ఒక భోగం. కొందరికి నిద్ర పట్టదు. కొందరు నిద్రని పట్టించుకోరు. జపాన్‌లో ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు అందర్నీ ‘సుఖ నిద్రా ప్రాప్తిరస్తు’ అని దీవిస్తాడు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం ఉండి వాటికి తోడు చీకూ చింతా లేకుండా ఉండేవాడే సుఖ నిద్రపోగలడు. ఆ దీవెన వెనుక ఇంతటి అంతరార్థం ఉంది. ‘‘నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’’ అనే చంద్రబాబు నినాదం చాలా ఫేమస్. అందరూ నిద్రలో ఉండగా మనకు అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. అప్పట్నించీ దేశం అలాగే మగత నిద్రట్లో ఉండిపోయిందని కొందరు మేధావులు అంటూంటారు.

నిద్ర ఒక మానసిక స్థితి- కాదు ఇదొక శారీరక అవసరం. కాదు, ఇదొక దినచర్య. కాదు, ఇదొక చమత్కారం. నిద్రలో సుఖం ఉంది. నిద్రలో బంగారు కలలున్నాయి. కలల్లో అనేక తీరని కోరికలు తీరతాయి. ‘‘నిజానికి జీవితం యావత్తూ ఒక కలే!’’ అంటూ శంకరాచార్యులు మిధ్యావాదాన్ని ప్రతిపాదించారు. ఇది పెట్టుబడిదారుల కుట్ర అన్నాడు కారల్‌మార్క్స్. ‘‘వైకుంఠంలో విష్ణుమూర్తి కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు. కానీ అయ్యది యోగనిద్ర’’ అంటారు విశ్వనాథ. త్రేతాయుగంలోనే రెండు మహానిద్రలు గుర్తించారు.

సంవత్సరంలో సగకాలం ఏకధాటిగా నిద్రపోయే కుంభకర్ణుడు, భర్త వనవాస సమయం మొత్తాన్ని నిద్రలో సద్వినియోగం చేసుకున్న ఊర్మిళాదేవి ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నారు. దీంతో నిద్రకి పురాణ గౌరవం దక్కింది. జంతువులు, పక్షులు, చెట్లు సైతం హాయిగా నిద్రపోతాయి. చెట్లకొమ్మలకు వేలాడుతూ గబ్బిలం నిద్రలో రిలాక్స్ అవుతుంది. గుర్రం నిలబడే నిద్రపోగలదు. ‘‘ఏనుగు నిద్రపోదు. సింహం కల్లోకి వస్తుందని భయం’’ అంటారు. అంతా వట్టిది. ఇదొక అతిశయోక్తి. దీన్ని కవిసమయం అంటారు.

చాలా ఏళ్ల క్రితం పరిచయం ఉన్న ఒక ఎమ్మెల్యేగారిని అభినందిస్తూ ‘‘మీరు సభాపతి అవుతారనిపిస్తోందండీ!’’ అన్నాను. ఆయన వెంటనే, ‘‘వద్దండీ! సభలో హాయిగా కునుకు తీయడానికి ఉండదు’’ అంటూ కంగారు పడ్డారు. సెమినార్లలో, పునశ్చరణ తరగతులలో అధికారులు నిద్ర ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో వీడియో కవరేజీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు కోడికునుకులు తీస్తూనే సంగతులను ఆకళింపు చేసుకోగలరు. ఎన్టీఆర్ కునుకుల రాముడిగా ప్రసిద్ధి గానీ, కొంచెం జోగుతూనే సినిమా కథలు విని తీర్పులిచ్చేవారు. ఒకసారి కథంతా విని ‘‘బావుంది బ్రదర్! వెరీఫైన్. కానీ అక్కడక్కడ జంప్‌లు ఉన్నాయి. చెక్ చేసుకోండి!’’ అని సూచించారు. వెంటనే కవిగారు, ‘‘చిత్తం, తవరి కునుకులన్నీ జంపులే కదండీ’’ అన్నారు, వినయంగా. ‘‘మంచి అబ్జర్వేషన్ బ్రదర్’’ అంటూ మెచ్చుకున్నారు. నిద్ర విషయంలో మహర్జాతకుడాయన.

నాకు నాలుగు వేల ఆరొందల యాభయ్‌రూపాయల అప్పుంటేనే నిద్ర పట్టడం లేదు. ఆ విజయ్ మాల్యాకి ఎలా పడుతోందండీ  అని అడిగాడొక బక్కరైతు. ఎందుకు పట్టదు? ఆయనకి అప్పులిచ్చిన వాళ్లు తలొక వాయిద్యం వాయిస్తూ, లోగొంతులో జోల పాటలు పాడుతూ ఉంటే మహా బాగా పడుతుంది అన్నాడు సందేహం విన్న పెద్ద మనిషి. మనది వేదాలు వెలసిన నేల. హాయిగా నిద్రపోవడం మన జన్మహక్కు.

- శ్రీరమణ
 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు