నమో విశ్వనాథా!

29 Apr, 2017 00:51 IST|Sakshi
నమో విశ్వనాథా!

అక్షర తూణీరం
తెలుగు పాటలు ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌లో వినిపించసాగాయి. ఓంకార నాదాలు సంధానమై సప్తసముద్రాలు ప్రతిధ్వనించాయి. అది శంకరాభరణంతోనే మొదలైంది.

జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి నూత్న మర్యాద కల్పించిన దర్శకులు విశ్వనాథ్‌. సినిమాలు ఇంతటి రసరమ్యంగా కూడా ‘తీయనగును’ అంటూ తీసి చూపిం చిన చిత్రశిల్పి ఆయన. ఆ కళాతపస్విని ఏనాడో గుర్తించి, దేశప్రజలు తల మీద పెట్టుకున్నారు. గంగాధరునికి జలాభిషేకం చేసిన చందంగా, ఇప్పుడు ప్రభుత్వం రాజ ముద్ర వేసింది. ఆ సందర్భంగా శుభాభివందనాలు. మనకి జానపదబ్రహ్మలు, పౌరాణిక రుద్రులు ఉంటే ఉండవచ్చు గాక– ఈ ఫాల్కే గ్రహీత కథ వేరు.

ఆయన కథలు వేరు. తనదై ఉండాలి, తనలోంచి రావాలి, జనానికి చేరాలన్నది ఆయన సిద్ధాంతం. ‘‘నేనేం పెద్దగా చదవను, సినిమాలు అంతగా చూడను. ఏవో ఆలోచనలొస్తాయ్‌.. అంతా దైవదత్తం’’ అంటూ క్రెడిట్సన్నీ దేవుడికిస్తారు. నిజం, దైవదత్తం కాబట్టే ప్రతి ఆలోచనా ఓ తొలకరి మెరుపై అందగించింది. లేకుంటే, ఓ గంగిరెద్దుల నాడించే జానపద కళాకారుల గురించి ఎవరాలోచిస్తారు? ఎవరు వెండితెరకెక్కిస్తారు!? వందనాలు... వంద వందనాలు.


అనుభవంలో చేవలు తేలిన నటుల్ని తగినట్టు శిల్పించడం కొంచెం బాగా కష్టం. కానీ వారిని లేతగా తాజాగా ప్రజంట్‌ చేయడం విశ్వంకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ట్రాక్‌ రికార్డ్‌లో తొంభై శాతం విజ యాలే కనిపిస్తాయ్‌. కాకపోతే ఘన విజయాలు! దర్శకుడిగా విశ్వనాథ్‌ గొప్ప ప్రయోగశీలి. ఆది నుంచీ ప్రయోగాలే, కాదంటే దైవలీలే! మొట్టమొదటగా తెలుగు పాటలు ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌లో వినిపించసాగాయి. ఓంకార నాదాలు సంధానమై సప్తసముద్రాలు ప్రతిధ్వనించాయి. అది శంకరాభరణంతోనే మొదలైంది. విశ్వనాథ్‌ కెరియర్‌ రెండు పక్షాలైంది. శంకరాభరణం పూర్వపక్షాన్ని మరిపించింది.

దేశం పట్టనంత కీర్తి... విశ్వమంతా పొంగి పొర్లింది. ఆ తర్వాత ఆయనకు ఏ బిరుదు ఇచ్చినా వెలవెలబోవడం మొదలైంది. దరిమిలా తంబురా శ్రుతి మీద దేశం శ్వాసించడం మొదలు పెట్టింది. ఎందరికో కీర్తికిరీటాలు దక్కాయి. అప్పటికే మంచి నోరు పేరు తెచ్చుకున్న యస్పీ (విశ్వనాథ్‌ బాలుని ‘మణి’ అని పిలుస్తారు) శంకరాభరణంతో బంగారు మెట్టు మీద కూర్చున్నాడు. ‘బాలు మెచ్యూరయ్యాడన్నారు’ సినీ పండితులు. అప్పటికి పరిశ్రమలో ఆయన వయసు పదమూడు.


ఆదుర్తి దగ్గర పనిచేసిన రోజుల్లో, మూగమనసులతో ప్లటానిక్‌ ప్రేమ సిద్ధాంతం గట్టిగా విశ్వాన్ని పట్టుకున్నట్టుంది. అక్కడ నుంచి ఆ పాట ఈ నోట పలకడం మొదలైంది. గోపి, అమ్మాయి గారు; చి కాదు, సి అంటూ సవరింపులతో పాట నేర్పించడం కొనసాగుతున్న కథాంశాలు. విశ్వనాథ్‌ తనకి స్వేచ్ఛనిచ్చే నిర్మాతలతోనే ప్రయాణం సాగించారు. కనుకనే అద్భుతాలు సాధించారు. తెలుగు సినిమా పరిశ్రమకి ఈయన అందించిన సేవలు అసామాన్యమైనవి. అన్నీ ఒక ఎత్తు– ఓ సీతకథతో కాళిదాసుని, సిరివెన్నెల ద్వారా భవభూతిని పట్టుకొచ్చి మనకి అంకితం చేయడం మరో ఎత్తు. వారి దయవల్ల వెండితెర బంగారమైంది. చినుకులన్నీ కలిసి చిత్రకావేరి అయినట్టు.


(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

మరిన్ని వార్తలు