కథ రాయడం చాలా కష్టం

25 Jan, 2016 03:42 IST|Sakshi
కథ రాయడం చాలా కష్టం

అభిప్రాయం

 

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గుండెను తడి చేసే కథలు రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ గురించి, కథ రాయడంలోని కష్టం గురించి ‘సాక్షి’తో సంభాషించారు..

 

కథ రాయాలంటే...

కేవలం ఇతరుల రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడే మంచి కథలు వస్తాయి. తలుపులు మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావు. అనేక జీవితాలను పరిశీలించాలి. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతుంది. అయితే దాన్ని పట్టించుకోవాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి మాను అవుతుంది. అప్రయత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. అయితే, కథ రాసేవారికి బయటి నుంచీ ఏవీ సహకరించవు. రచయిత చూసినవి, రచయిత స్వానుభవం మాత్రమే కథలో ఉంటాయి. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది.

చిన్న కథ పుట్టుక...

‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. అయితే, ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతోషం, ఎండితే దుఃఖం. వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు.

వీరు కూడా రచించారు...

ప్రక్రియలన్నిటిలో కూడా కథానిక ప్రత్యేకమైనది. ఇది పాశ్చాత్య ప్రక్రియ. పాఠకులకు ఒక జీవిత శకలాన్ని చూపించే సాధనం కథ. ఉత్తమ కథానికలో ఒక్క అక్షరం కూడా వృథాపోదు. కథలో సాధారణ మానవుడి జీవితాన్ని సాధారణమైన పద్ధతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, వేలూరి వంటి పద్యకావ్య రచయితలు సైతం కథానికలు రాశారు. వారు కథను ప్రేమించారు. వాటి గొప్పదనాన్ని గుర్తించారు.

‘ముసురు’ కథ...

ఒక శవం పక్కన ఒక తమిళ అమ్మాయి కూర్చున్న దృశ్యం నన్ను ఆకర్షించింది. ఏం జరిగిందని పక్కన వాళ్లను అడిగితే, వారిద్దరూ ప్రేమికులనీ, లేచిపోయి వచ్చారనీ, చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగిస్తున్నారనీ, అతడు చనిపోయాడనీ, ఆ అమ్మాయికి మన భాష రాదనీ చెప్పారు. ఆ దృశ్యం చూశాక అంతర్మథన పడ్డాను. అందులో నుంచి వ చ్చిన కథే ‘ముసురు’.

‘ఇంగువ’ గురించి...

నా బాల్యమిత్రుడు ‘ఇంగువ అంటే ఏంటి?’ అని అడిగాడు. ఆ తరవాత కొన్నాళ్లకి చనిపోయాడు. ఇంతకీ అతడు ఈ విషయం తెలుసుకుని పోయాడా, తెలుసుకోకుండా పోయాడా అనుకున్నాను. జీవితంలో తెలుసుకునేవి తక్కువ, తెలియని విషయాలు ఎక్కువ. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘ఇంగువ’ కథ. ఇలా ఎన్నో కథలు నేను ఎన్నో జీవితాలను పరిశీలించి రాసినవే. పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో రైలు తుడవ డానికి ఎక్కే నలుగురు కుర్రాళ్ల జీవితాల మీద నాలుగు కథలు రాశాను. వారిలోనూ అద్భుతమైన జీవితం ఉంటుంది. వాళ్లకి ఆ స్టేషనే జన్మస్థలం, పడక, పక్క అన్నీ! వాళ్లు అక్కడ నుంచి బయటకు వెళ్లలేకపోతారు. వెళ్లాలంటే భయం.

విమర్శలు...

చాలామంది నా కథలు ఏడుపు కథలన్నారు. కరుణ అనేది సున్నితమైన సూత్రం. అది తెగితే జుగుప్స. నేను అచ్చంగా చూసిన జీవితాన్ని చూసినట్టు రాశాను. అలాగే, మనిషిలో అసంతృప్తి అనే లక్షణం ఉంటుంది. ఆ అసంతృప్తే నా కథలకు ప్రధాన వస్తువు. సరిగ్గా పరిశీలించి అర్థం చేసుకునేవారికి, మన చుట్టూ ఉన్నవన్నీ కథా వస్తువులే. అయితే, కథలు చదవడానికి కూడా ఒక కల్చర్ ఉండాలి. ఇంకించుకునేవారు ఉత్తమ పాఠకులు.

 

- డా. పురాణపండ వైజయంతి

 సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ

 ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి

మరిన్ని వార్తలు