‘ఆ ఇద్దరి’ నడుమ నరేంద్ర మోడీ

12 Aug, 2014 00:18 IST|Sakshi
‘ఆ ఇద్దరి’ నడుమ నరేంద్ర మోడీ

భారత్‌తో వాణిజ్య వ్యూహాత్మక మైత్రి కోసం చైనా, జపాన్‌లు రెండూ పోటీపడుతున్నాయి. ప్రత్యర్థులుగా ఆసియాలో ప్రచ్ఛన్న యుద్ధానికి కాలు దువ్వుతున్న ఈ రెండు దేశాలతో సత్సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో మోడీ చాకచక్యంగా వ్యవహరించగలుగుతున్నారు.
 
 సంసార జంజాటానికి దూరంగా బతుకుతున్న నరేంద్ర మోడీ ప్రధానిగా ఏక కాలంలో రెండు ‘ప్రేమాయణాలను’ రక్తి కట్టిస్తున్నారు. ఆసియాలో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులను సృష్టిస్తున్న చైనా, జపాన్‌లు రెండూ మోడీపై తెగ ప్రేమ ఒల కబోసేస్తున్నాయి. నేటి అత్యధునాతన ‘ప్రేమ’లకు పునాది ప్రయోజనవాదమే. జపాన్, చైనాలకు ప్రేమ కానుకల చిట్టా లున్నాయి. జపాన్‌తో ‘వ్యూహాత్మక మైత్రి’ జపం చేస్తూనే గత యూపీఏ ప్రభుత్వం జపాన్ కు చె ందిన ‘మిసుబిషి’, ‘హోండా’లను 260 కోట్ల డాలర్ల పన్ను బకాయీల కోసం తెగ ఇబ్బంది పెట్టింది. భారత పన్ను చట్టాల్లోని మార్పుల వల్ల ఏర్పడ్డ ఆ బకాయీలను మాఫీ చేయడమే ‘న్యాయ’ మని జపాన్ ప్రధాని షింజో అబే మొరపెట్టుకున్నా కనికరిం చలేదు. అబే ప్రేమ కానుకల చిట్టాలోని మొదటిది అదే.

దీర్ఘకాలిక అల్ప వృద్ధి జాఢ్యం బారిన పడ్డ జపాన్ చైనాతో ఇప్పటికే భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. అయినా అది దక్షిణ చైనా సముద్రంలోని సెనెకాకు దీవుల కోసం చైనాతో జగడానికి దిగింది. ఫలితంగా గత ఏడాది కాలంలోనే చైనాకు జపాన్ ఎగుమతులు 18 శాతం మేర క్షీణించిపోయాయి. భారీ ఎత్తున జపాన్ వస్తు వుల మార్కెట్ విస్తరణకు అవకాశాలను, ‘ఢిల్లీ - ముంబై కారిడార్’ వంటి భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సహా భారీగా జపాన్ పెట్టుబడులకు అవకాశాలను ఆశిస్తున్నారు. మోడీ ఆ కోరికలను తీర్చడానికి  సిద్ధమే. కాకపోతే ఆయనది కూడా ప్రయోజనవాద ప్రేమే. భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు జపాన్ అడిగిందే తడవుగా చక చకా పచ్చజెండా ఊపేశారు. కాకపోతే అబేకు ‘దక్షిణ టిబెట్’ దారి చూపారు. ఈశాన్య భారతాన్ని చైనా ఆ పేరుతోనే పిలుస్తుంది. ఈశాన్యం సరిహ ద్దుల్లోని రక్షణ ఏర్పాట్లకు అవసరమైన రోడ్లు వంతెనల నిర్మాణ భారీ ప్రాజెక్టులన్నీ జపాన్‌కు అప్పగిస్తున్నారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులను తెరిచింది కూడా అమెరికా, జపాన్ ల కోసమే. చైనాను ఏకాకిని చేసే వ్యూహంతో అమెరికా - జపాన్‌లు నిర్మిస్తున్న ఆసియా - పసిఫిక్ కూటమిలో భారత్ చేరాలని మన జాతీయ మీడియా, కార్పొరేట్ గుత్తాధిపతులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ‘వ్యూహాత్మక’ మౌనంతో మోడీ వారందరినీ సంతృప్తిపరుస్తున్నారు.

ఇక చైనా, మోడీల మధ్య ప్రేమ బంధం చాలా పాతది. 2002 గుజరాత్ మత కల్లోలాల కారణంగా అమెరికా వంటి దేశాలు మోడీని ‘అంటరానివాడి’గా చూస్తుండగా... 2006, 2007, 2011లలో ఆయన చైనాలో పర్యటించారు. చైనా రెడ్ కార్పెట్ పరచి ఘన స్వాగతం పలకడమే కాదు, ఒక ముఖ్య మంత్రికి దేశాధినేతకు ఇచ్చేటంత గౌరవాన్ని ఇచ్చింది. చైనా ఆయనను ‘నిర్ణయాత్మకమైన, సత్వరమైన నిర్ణయాలను తీసుకోగల, శక్తివంతమైన, ఫలిత ప్రధాన్య దృక్పథంగల నేత’గా గుర్తించింది. ప్రధానిగా మోడీని ‘చైనా డైలీ’ ఏకంగా  
 ‘భారత నిక్సన్’ అంటూ ఆకాశానికెత్తేసింది. అబే కూడా సరి గ్గా మోడీలోని ఈ లక్షణాలను చూసే ముచ్చటపడిపోతుండ టం విశేషం. ప్రతిపక్షంలో ఉండగా చైనా, పాకిస్థాన్‌ల పట్ల ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని బీజేపీ దుయ్యబడు తుంది. కానీ ఏబీ వాజపేయీ హయాంలోనే చైనా సిక్కింను భారత్‌లో భాగంగా గుర్తించింది!

ఇప్పటికైతే మోడీ చైనాతో వాణిజ్య, పెట్టుబడుల బంధా నికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా సరిహద్దు సమస్యను పక్క న బెట్టి ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచి స్తోంది. ఇటీవల బ్రిక్స్ దేశాల సమావేశం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు క్సీ జింగ్‌పింగ్ సూచించింది అదే. మోడీ సైతం సరిహద్దుల్లోని సంఘర్షణలను పక్కనబెట్టి కీలకమైన రక్షణ, విద్యుత్ రంగాల్లో చైనా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అ నుమతులు జారీ చేస్తున్నారు. ‘జాతీయ భద్రతకు ముప్పు’ అని జంకి యూపీఏ ఇదే చేయలేకపోయింది. అలా అని మోడీ సరిహద్దు సమస్యను చిన్న చూపు చూస్తున్నదీ లేదు. చైనా పట్ల కఠిన ైవె ఖరిని చూపే మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్‌ను విదేశాంగ శాఖ జూనియర్ మంత్రిగా నియమించారు. చైనా, పాక్‌లలో రహస్య కార్యకలాపాల నిర్వహణకు పేరు మోసిన మాజీ గూఢచారి శాఖ అధిపతి అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారును చేశారు. ‘దక్షిణ టిబెట్’కు ఆయననే ఇన్‌చార్జిని చేశారు. రేపు చైనాతో వ్యూహాత్మక చర్చలకు ఆయనే మోడీ తరఫున ప్రతినిధిగా హాజరుకాబోతున్నారు. ఇప్పటికైతే మోడీ చైనా, జపాన్‌లతో ఏకకాలంలో ప్రేమను చాకచక్యంగానే నెట్టుకొస్తున్నారు. మరో చిరకాల ప్రేమికురాలు అమెరికా కూడా రంగంలోకి దిగాక ఎలాంటి మార్పులు వస్తాయో వేచిచూడాలి.

 పిళ్లా వెంకటేశ్వరరావు
 
 

మరిన్ని వార్తలు