క్లాసికల్ హోదాకు తమిళుల మోకాలడ్డు!

9 Mar, 2015 00:47 IST|Sakshi
క్లాసికల్ హోదాకు తమిళుల మోకాలడ్డు!

రామతీర్థ
 
 తెలుగు భాషకు ప్రాచీనహోదాపై తమిళ భాషా నిపుణులు పిల్ రూపంలో కుయుక్తితో వేసిన అడ్డుపుల్ల గత ఏడేళ్లుగా కేంద్రం నుంచి మనకు రావలసిన నిధులను అడ్డుకుంటోంది. దీనిపై తెలుగు రాష్ట్రాల తక్షణ స్పందన అవసరం.
 
 
 ఏడేళ్ల కిందట తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా ప్రక టించింది నాటి కేంద్ర ప్రభు త్వం. దాంతోపాటు, మీకు ఈ హోదా వలన కలిగే లాభాలు అన్నీ, మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉన్న ప్రజాహిత వ్యాజ్యం తేలాక మాత్రమే అందుబాటులోకి వస్తాయని షరతులూ తగిలించారు. తమిళులు 2004లోనే తమ భాషకు ప్రాచీన హోదాను ఒక రాజకీయ డిమాండ్‌గా చేసి యూపీఏ-1 ప్రభుత్వా న్ని ఇరుకున పెట్టి తమ మాట నెగ్గించుకున్నారు. కేంద్రం ఇతర దేశ భాషల విషయంలోనూ ఇలాంటి డిమాండ్లు వస్తాయని గ్రహించి 2014 నవంబర్‌లోనే ఒక భాషా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తమిళ భాషకు ప్రాచీన హోదా ప్రకటించే కాలానికి ఆ భాష సాహిత్యా నికి వెయ్యేళ్లు ప్రాచీనత ఉంటే సరిపోతుందన్నది ఒక అవగాహనగా ఉండగా, దాన్ని ఇతర భాషల విషయానికి వచ్చేటప్పటికి 1500-2000 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన చొప్పించింది కూడా తమిళ సోదరులే. దాంతో మనమందరం కూడా మేము అంత ప్రాచీనులం అంటే ఇంత ప్రాచీనులమని వెదుకులాటలో పడిపోయాం. ఇలా మనల్ని ఒక కృత్రిమ రేసులో దారి తప్పించి, ప్రాచీ న భాష హోదా వల్ల తమకు ఉపయోగ పడే అంశాలను సాధించుకునే క్రమాన్ని వారు వేగవంతం చేసుకున్నారు.
 నాలుగేళ్ల తర్వాత అంటే 2008 అక్టోబర్‌లో కేంద్రం తెలుగు, కన్నడ భాషలకు కూడా ప్రాచీన హోదా ప్రకటిం చింది. భాషా నిపుణుల కమిటీలోని తమిళ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ రెండు భాషలకు ప్రాచీన హోదా ప్రకటనను అడ్డుకోలేము అన్న సంగతి స్పష్టమైపోయి కుయుక్తిపన్నారు. కేంద్రం దీనిపై ప్రకటన చేయడానికి ముందే వారు, తమిళ న్యాయవాది ఆర్.గాంధీ చేత ఒక పిల్‌ని మద్రాస్ హైకోర్టులో దాఖలు చేయించారు. ఆయన ఈ విషయంలో తెలుగు, కన్నడ (2008లో), మలయాళ భాషా (2013లో) సమాజాలకు ప్రాచీన హోదాకు వ్యతిరేకంగా మూడు ప్రజాహిత వ్యా జ్యాలు వేసి ఉంచాడు. ఆయనతో తమకేమీ సంబంధం లేదని తమిళనాడు ప్రభుత్వం తెలివిగా దూరం పాటి స్తోంది కానీ, ఈ చర్య వల్ల ఈ మూడు భాషలూ నేటి వర కూ ఎలాంటి లబ్ధికి నోచుకోలేదు. ప్రాచీన భాష హోదా పై నిబంధనలను ఇతర భాషల విషయంలో కఠినం చేయడంలో కూటనీతికి పాల్పడ్డారు తమిళ సోదరులు. ప్రాచీనతా నిర్ధారణ సంఘంలో తామూ ఉండడం వల్ల తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీనహోదాపై కేంద్ర ప్రభు త్వం చేయనున్న ప్రకటనను ముందుగానే గ్రహించి, ఆ ఆంతరంగిక సమాచారాన్ని ముందస్తుగా పిల్ దాఖలు చేసే న్యాయవాదికి అందచేసి ఇతర భాషా సమాజాలకు జరిగే లబ్ధికి అడ్డుపడటం తమిళ సమాజ కుసం స్కారా నికి ప్రబల నిదర్శనం. దీనిని తెలుగు, కన్నడ, మలయాళ సోదరులు సమైక్యంగా ఎదుర్కొనగలిగితే వారికి ఒక గుణపాఠం చెప్పిన వారం అవుతాము. లేదా అత్యంత అవమానకరంగా.. కేంద్ర ప్రభుత్వం అందజేసి న ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగానికి సంబంధించిన ఒక ప్రధాన లబ్దిని సాకారం చేసుకోకుండా ఈ అనవసర వ్యాజ్యంలో ఇప్పటికే ఏడేళ్లుగా ఇరుక్కున్న మనం ఆ లబ్ధిని ఇంకా దూరం చేసుకుంటాం.
 కొన్నేళ్ల క్రితం ఈ విషయాన్ని తేల్చమని ఆంధ్ర, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ మద్రాస్ హైకోర్టు ముందున్న పిల్‌లో జోక్యం చేసుకోవ డానికి నిరాకరిస్తూ ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవా ల్సిందని సూచించారు. అయితే ప్రాచీన హోదా అమలు మాత్రం ఈ కేసు తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
 ఇలా మనం ప్రాచీన హోదా దాని ప్రయోజనాల విషయంలో కోర్టుల వెంబడి తిరుగుతుండగా, తమిళులు తమకు కాగల కార్యాన్ని పూర్తి చేసుకున్నారు. మైసూరు లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇనిస్టి ట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ తమిళ్‌ను 2008లోనే వేరు చేసి తమ రాష్ట్రానికి తీసుకుపోయి ఏటా రూ. 75 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభు త్వ సంస్థగా నిర్వహించుకుంటున్నారు. మన తెలుగు భాష క్లాసికల్ పరిస్థితి అందరికన్నా ఘోరంగా ఉంది. ఆనాడు పిల్‌పై అప్పీల్ చేసిన అధికార భాషా సంఘం ఇప్పుడు లేదు. రాష్ట్రం కూడా రెండుగా చీలిపోయింది. ఈ పిల్‌కు సంబంధించి అధికార భాషా సంఘం పేరు ఎక్కడా ప్రతివాదుల జాబితాలో లేకపోవడం, దివంగత ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పేరు నేటికీ ఆ జాబితాలో ఉండటం చూస్తే ఈ కేసులో మన ప్రభుత్వ శాఖల, అధికారుల వైఫల్యం స్పష్టమవుతుంది.
 
 భాషల ప్రాచీనతే ప్రాచీన భాష హోదాకు తప్పని సరి అనే నిబంధన వెనక్కు వెళ్లాక కూడా ఇంకా మద్రాస్ హైకోర్టులో పిల్స్ పెండింగ్‌లో ఉండటంపై తెలుగు, కన్న డ, మలయాళ భాషా సమాజాల ప్రజలు తమ అభ్యంత రాలు పంపి ఆ వ్యాజ్యాలను రద్దు చేసుకోవాలి. ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రియాశీల కంగా పనిచేసి తమిళులకు తగు వ్యూహంతో దీటుగా జవాబు ఇవ్వాలి. ఎప్పటికైనా ఫలితం దక్షిణ రాష్ట్రాలకు అనుకూలంగానే వస్తుంది కానీ తమిళ భాషా సమాజం, తోటి దక్షిణ  భాషలకు చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపో తుంది. భాషా రాజకీయాలకు తమిళులు పెట్టింది పేరు.


 రెండేళ్లకు ఒకసారి తెలుగు మహాసభలు జరుపు కోవడం బాగానే ఉంటుంది కానీ, మన భాషపై పొరుగు వారు అనవసరంగా కాలు పెట్టి తొక్కుతున్న నేపథ్యం లో, తగు స్పందనలు ఇవ్వకపోవడం, ఇందుకోసం ఒక సదస్సు కూడా లేకపోవడం.. ఇవన్నీ మన వైఫల్యాలే. ప్రాచీన భాష అనే మాయాజాలం లోంచి విశిష్ట భాషా చైతన్యంలోకి మనం ఎంత వేగంగా వస్తే అంత మంచిది. జాతి కాలిలో గుచ్చుకున్న ఈ ముల్లును మనం ఎంత వేగంగా తీసివేయగలిగితే అంత వేగంగా మన భాషా ప్రగతి భవ్యపథంలో సాగుతుంది.
  వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత
 మొబైల్ : 9849200385

 



 

>
మరిన్ని వార్తలు