తస్లీమా నస్రీన్ రాయని డైరీ

13 Jun, 2015 23:49 IST|Sakshi
తస్లీమా నస్రీన్ రాయని డైరీ

కొద్దిసేపటిగా చీకట్లో ఉన్నాను. కొద్దిసేపటిగా అంటే ఓ ఇరవై ఏళ్లుగా. ఉద్యమ జీవితంలో ఇరవయ్యేళ్లన్నది ఏమాత్రం వ్యవధి కనుక! పోరుబాటలో గడిచిపోతున్నవి... అవి దశాబ్దాలైనా, శతాబ్దాలైనా  కాల ప్రవాహంలో ఒడ్డుకు చేరిన గులకరాళ్ల వంటివే. గదిలో, గది చీకట్లో ఒక్కదాన్నే ఉంటున్నా నాకేమీ భయం కలగడం లేదు. నా లోపల నాలుగు కాగడాలు వెలుగుతున్నాయి. సెక్యులర్ హ్యూమనిజం, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ ైరె ట్స్... ఆ నాలుగు కాగడాలు. చీకటిలో నేను వెలిగించుకున్నవి కాక, నా చుట్టూ ఉన్న చీక టితో నేను వెలిగించుకున్న కాగడాలవి.

కిటి కీలోంచి దూరంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తోంది. యూఎస్‌లో స్వేచ్ఛకు ఇప్పుడు నేను ఏ వైపున ఉన్నానో స్పష్టం కావడం లేదు. ఇండియా నుంచి వచ్చి కొన్నాళ్లయింది కానీ, ఎన్నాళ్లయిందో తెలియడం లేదు. స్వేచ్ఛా ప్రతిమ కింద కదులుతున్న నీడల్లో అల్‌ఖైదా జాడల్ని నా చూపులు అంచనా వేస్తున్నాయి. మృత్యువు నాకు సమీపంలోనే ఉందని తెలుస్తూనే ఉంది. ఎంత సమీపంలో అన్నది నా సమస్య కాదు. నా శత్రువు సమస్య. నా శత్రువుది కూడా కాదు. నన్ను శత్రువుగా భావిస్తున్నవాళ్లది. నాకు స్నేహితులు తప్ప శత్రువుల్లేరు. ఆ స్నేహితులను అల్‌ఖైదా వరసగా చంపుకుంటూ వస్తోంది. స్త్రీ స్వేచ్ఛ, మత స్వాతంత్య్రం నా స్నేహితుల నినాదం. అందుకే చంపేస్తోంది. ఉగ్రవాదం మనుషుల్ని మాత్రమే నరికి చంపగలదు. నినాదాల తాకిడిని తట్టుకునే శక్తి దానికి లేదు.

ఈ ఫండమెంటలిస్టులు, ప్రభుత్వాలు, ప్రెస్‌వాళ్ల ధోరణి తరచు నాకు ఒకేలా అనిపిస్తుంటుంది! ఈ మూడు శక్తులదీ ఒకేరకమైన ఇన్‌సేనిటీ. ఉద్యమకారుల్ని ఫండమెంటలిస్టులు వెంటబడి తరుముతుంటారు. ఉద్యమకారుల్ని లోపలికి రానీయకుండా ప్రభుత్వాలు తలుపులు వేసుకుంటాయి. ఉద్యమకారుల దారుల్ని ప్రెస్‌వాళ్లు చక్కగా స్కెచ్‌గీసి బయటపెడుతుంటారు.

నేను యూఎస్ రాగానే ఇండియా నుంచి ఒక జర్నలిస్టు మిత్రుడు అడిగాడు... ‘అల్‌ఖైదా హిట్‌లిస్టులో ఉన్నారట కదా’. ‘అవును’. ‘ఇండియన్ గవర్నమెంట్ మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట కదా!’. ‘అవును’. ‘యూఎస్ లోనే ఉండిపోతారట కదా’. ‘కాదు’.
 ‘కానీ, భారత ప్రభుత్వం...’ అంటూ మళ్లీ మొదటికొచ్చాడు మిత్రుడు. ‘ఎన్నాళ్లిలా దేశం నుంచి దేశానికి తప్పించుకుని తిరుగుతారు’ అని అడిగాడు! ‘ఎన్నాళ్లయినా’ అని చెప్పాను. సిద్ధాంతాలను బతికించుకోవాలంటే ముందు మనం బతికి ఉండాలి. బతికుండడం కోసం నాకు ఏ దేశమైనా ఒక్కటే. యూఎస్‌గానీ, స్వీడన్ గానీ, ఇంకోటి గానీ. కానీ బతకడం కోసం మాత్రం నాకు ఇండియా కావాలి.  
 
 మాధవ్ శింగరాజు
 
 

మరిన్ని వార్తలు