నాటి పార్టీ... నేటి కంపెనీ

7 Nov, 2014 23:45 IST|Sakshi
నాటి పార్టీ... నేటి కంపెనీ

 ‘‘నాకు రెండెకరాల భూమి ఉంది. పుష్కలంగా నీళ్లున్నాయి. సాలుకు నాలుగు పంటలు. సౌకర్యంగా ఉన్నాం. రాజధాని కోసం నా భూమిని తీసుకొని, ఎక్కడో... ఎప్పుడో ఎకరాకు వెయ్యి గజాల చొప్పున ఇస్తారట. అప్పటి వరకూ నేనేం చేయాలి? ఆ వెయ్యి గజాలు ఇచ్చిన తర్వాత మాత్రం ఏంచేయాలి? ఇప్పుడు నేను రైతును అని చెప్పుకుంటున్నాను. అప్పుడు ఏమంటారు నన్ను?... బికారి అనేగా! మా నాన్న రైతు అని నా పిల్లలు చెప్పుకుంటున్నారిప్పుడు. భూమి పోయిన తర్వాత? మా నాన్న బికారి అనేగా చెప్పేది?’’... ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ చేయాలని నిర్ణయించిన ఒక గ్రామం నుంచి తెలుగు న్యూస్ చానల్ ఒకటి రైతుల ఇంటర్వ్యూలను ప్రసారం చేసింది.

 

అందులో ఒక రైతు అడిగిన ఈ సూటి ప్రశ్న ప్రేక్షకుల గుండెకు ఈటెలా తగిలింది. తల్లి నుంచి బిడ్డను లాగివేసే అమాన వీయ సన్నివేశం లాంటిదే రైతు నుంచి భూమిని లాగివేయడం కూడా. ఇలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు సగటు మనుషుల హృదయాలు ద్రవించకుండా ఉండవు. ఒక రోబో, ఒక బాబు ఇందుకు అతీతులు. రోబోకు హృదయంలేదు. బాబు హృదయం ద్రవించదు. ఆయన సగటు మనిషి కాదు.
 మానవీయ కోణానికి అందని మనిషి
 
 అల్పమైన మానవీయ స్పందనలకు అతీతంగా చంద్రబాబు తనను తాను మలచుకున్న తీరు నిరుపమానం. పేద రైతు కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానంలో భావోద్వేగరహిత స్వభావాన్ని చెప్పే దృష్టాంతాలెన్నో! నిన్న మొన్నటివరకు ఆయన నవ్వేవారు కూడా (బహిరంగం గా) కాదన్న విషయం చాలామందికి తెలుసు. శ్రేయోభిలాషుల ప్రోద్బలంతో గత కొంత కాలంగా అప్పుడప్పుడూ ముఖానికి నవ్వు పులుముకుంటున్నారు. అదీ ప్రజాసంబంధాల్లో భాగంగా. అర్జునుడు పక్షి కన్నుకు గురిపెడితే అది మాత్రమే కనిపించేదట. పక్షి రెక్కలు, ఈకలు, తోక, చెట్టుకొమ్మలు, చెట్టు, పరిసరాలు ఏవీ కనిపించేవి కాదట. అలాగే చంద్రబాబు అధికార ‘లక్ష్మీ’ కాం క్షలో కూడా టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది. టార్గెట్‌ను చేరుకోవడం మాత్రమే ముఖ్యం. ఎలా చేరుకున్నామన్నది అప్రస్తుతం.
 
 చిన్న వయుసులోనే ఎమ్మెల్యే కావడం, సహాయమంత్రి పదవిని కూడా ’సంపాదించడం,’ రామారావుగా రింటి అల్లుడు కావడం, ఆ తర్వాత ఆయన పరిపాలించిన తీరు... ఇవన్నీ ఆయన లక్ష్యసాధన కోసం చేసుకున్న ప్రోగ్రామింగ్‌లో భాగంగానే జరిగిపో యాయి. రామారావుగారి పదవి లాగేసుకోవడం అన్యాయమన్నారు. వెన్ను పోటు అని కూడా అన్నారు. ఆయన స్పందించలేదు. తనదృష్టిలో ఒక లాభ సాటి కంపెనీని జస్ట్... టేకోవర్ చేశారు... ఎంతో తెలివిగా. అంతే తప్ప ఈ సంబంధాలు, బాంధవ్యాలు, మానవీయ కోణాలు, నవ్వడం, దుఃఖించడం, ప్రేమించడం. కళలు, సంస్కృతులు, సాహిత్యం, చరిత్ర, నాగరికత వగైరా వగైరా కీవర్డ్స్ ఆయన సెర్చింజన్‌లో లేనేలేవు.
 
 సీఎంగా కంటే... సీఈఓ అంటేనే ఇష్టం
    
 
 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే తనను తాను ఒక కంపెనీ సీఈవో గా భావించుకున్నారు. అలాగే పిలిపించుకోవాలని ఉబలాటపడ్డారు. లాభాలు సంపాదించడమే సీఈవో పని కనుక అందుకోసం తహతహలాడారు. ఎన్నిక లకు ముందు ఎన్టీ రామారావు హామీ ఇచ్చి, పట్టుదలతో అమలు చేసిన రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని ఎత్తిపారేశారు. మద్య నిషేధాన్ని ఊడబెరికారు. బెల్టు షాపులకు శ్రీకారం చుట్టి వాడవాడకూ మద్యం కాలువలు పారించారు. రైతులు వాడుకునే వ్యవసాయ విద్యుత్‌పై మోయలేని భారాన్ని మోపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల మార్కెట్లో బహుళజాతి కంపెనీల ఇష్టారాజ్యానికి గేట్లెత్తి రైతు ఆత్మహత్యల పరంపరకు తొలి కారకుడయ్యారు.

 

ఎన్టీరామారావు సంక్షేమ రాజ్య సిద్ధాంతాన్ని తలకిందులు చేసి’ ప్రపంచ బ్యాం కు జీతగాడు’గా తరించారు. అప్పు కోసం ప్రపంచ బ్యాంకు షరతులన్నిటికీ తలొగ్గి ఆ బ్యాంకు విజన్‌నే తన విజన్‌గా ప్రకటించుకున్నారు. ఆ విజన్‌ను కర్క శంగా అమలుచేసేందుకు పూనుకున్నారు. అడ్డుపడిన రైతులను పిట్టల్లా కాల్చా రు. గళంవిప్పిన అంగన్‌వాడి మహిళలను గుర్రాలతో తొక్కించారు. ఈ క్రమం లో తెలుగుదేశంపార్టీ స్వరూపస్వభావాలను పూర్తిగా మార్చిపారేశారు. ఎన్టీఆర్ తీర్చిదిద్దిన ప్రజల పార్టీ కార్పొరేట్ కంపెనీగా మారిపోయింది.
 
 శోభనాద్రీశ్వర రావు లాంటి రైతు నాయకులు పనికిమాలినవాళ్లయ్యారు. హోటళ్లు నడుపుకునే వాళ్లు, వ్యాపారాలు చేసుకునేవాళ్లూ పార్టీ బోర్డురూమ్‌ను ఆక్రమించారు. ఎన్టీఆర్ హయాంలో పేద ప్రజలనూ, బలహీనవర్గాల వారినీ నాయకత్వ శ్రేణు ల్లోకి తీసుకొచ్చి రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన తెలుగుదేశంపార్టీ ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికీ, పైరవీకార్లకూ ఆలవాలంగా మారిపోయింది.  వాస్త వాలు ఇలావుంటే మీడియాలో మాత్రం బాబు ‘బంగారు బాబు’లా కనిపించే వారు.

ప్రపంచ బ్యాంకు స్పాన్సర్డ్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి బాబు పరిపాలనను ఆకాశానికె త్తుతూ వ్యాసాలు రాసేవారు. మూడో ప్రపంచదేశాల్లోని పాలకులందరూ బాబు దగ్గర పాఠాలు నేర్చుకోవాలని సూచించేవారు. జాతీయ మీడియా మేనేజ్ మెంట్ కోసం ఒక ప్రత్యేక యంత్రాంగంలా పనిచేస్తుండేది. ఫలితంగా దేశానికి బాబులాంటి నేతలు అవసరమనే అభిప్రాయం జాతీయ మీడియాలో తరచు వ్యక్తమవుతూ ఉండేది. ఇక రాష్ర్ట మీడియా ఆయన పల్లకీని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మోసిన సంగతి మనకు తెలిసిందే.
 
 పేరు గొప్ప ఊరు దిబ్బ
 
 చంద్రబాబును అభివృద్ధికి నమూనాగా కీర్తించే ప్రచారంలో ఎంత నిజముందో ఒక చిన్న ఉదాహరణ చాలు. 1981-1991 మధ్యకాలంలో రాష్ట్ర జీడీపీ వృద్ధిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నాలుగోస్థానంలో ఉంది. ఈ కాలంలో ఏడేళ్లపాటు ఎన్టీ రామారావు అధికారంలో ఉంటే, మూడేళ్లు కాంగ్రెస్‌పార్టీ పాలించింది. అదే 1994-2001 మధ్యకాలానికి చూసినప్పుడు రాష్ట్రం ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడి పోయింది. ఈ కాలంలో ఒక సంవత్సరం మినహా మిగతా సమయమంతా చంద్రబాబు పాలనే కొనసాగింది. హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్‌గా మార్చిన ఘనత తనదేనని చెప్పుకుంటున్న బాబు హయాంలో ‘దేశంలోనే అత్యధికంగా బాలకార్మికు’లున్న నగరమనే ఖ్యాతి కూడా దక్కింది. అనేక దశాబ్దాలపాటు దేశంలోనే ఐదవ పెద్ద నగరంగా వర్ధిల్లిన హైదరాబాద్ చంద్ర బాబు హయాంలో ఆరోస్థానానికి పడిపోయి, బెంగళూరు ఐదోస్థానాన్ని అందుకుంది.

 

బాబు తన ఖాతాలో వేసుకుంటున్న ఔటర్ రింగ్‌రోడ్డు భూసేక రణ-నిర్మాణ- ప్రారంభమంతా వైఎస్‌ఆర్ హయాంలోనే జరిగింది. పద్నాలుగు కిలోమీటర్ల పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే ‘ఆలోచన-ఆచరణ ’ అంతా వైఎస్ హయాంలోనిదే. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు భూసేకరణ జరిగిం ది మాత్రమే బాబు హయాంలో. అది కూడా రెండువేల ఎకరాలు అవసరముం టే, ఐదున్నర వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా లాగి కట్టబెట్టారు. ఎయిర్ పోర్టు నిర్మాణం-ప్రారంభమంతా వైఎస్ హయాంలోనే జరిగింది.
 
 మరోసారి భంగపడ్డ రైతాంగం
 
 ఇప్పుడిక్కడ ఆయన గతాన్ని, స్వభావాన్ని తవ్విపోసుకోవడానికి కారణం ఉంది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఐదు నెలలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల హామీలపై ఒక చర్చ జరుగుతోంది. అలవికాని ఈ హామీలను ఎలా అమలు చేస్తారోనని కొందరు జుట్టుపీక్కుంటున్నారు. అంత శ్రమ అవసరం లేదు. ఆయన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ తెలిసిన వారికి ఇవేవీ జరిగే పనులు కావని తెలుసు. ఈ విషయం చంద్రబాబుకు కూడా స్పష్టంగా తెలుసు. ఈ ఐదునెలల పరిణామాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. ‘పంచపాండవులంటే మంచం కోళ్లమాదిరిగా ముగ్గురే’ అని చెబుతూ రెండు వేళ్లు చూపించాడట వెనుకటికొకడు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అచ్చుగుద్దినట్టు ఈ సామెతకు సరిపోతుంది. రెండోసారీ బాబు చేతిలో మోసపోయిన రైతులు ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని క్షమిస్తారనుకోవడం భ్రమే. గ్రామీణ ఆర్థికవ్యవస్థను గతిశీలంగా ఉంచడంలో గత పది, పదిహేనేళ్లుగా కీలక భూమిక పోషించిన డ్వాక్రా సంఘాలను కూడా తప్పుడు హామీతో బాబు దెబ్బ తీశారు.
 
 రుణమాఫీని దృష్టిలో పెట్టుకొని వేసుకున్న అంచనాలు తప్పడంతో పాటు అదనంగా వడ్డీ భారం వారి మీద పడింది. అధికారికంగా లేని బెల్టు షాపులను నిషేధిస్తూ ప్రమాణ స్వీకారం రోజున బాబు సంతకం చేశారు. ఇప్పటివరకూ ఒక్క బెల్టు షాపు మూతపడకపోగా, దర్జాగా సైన్‌బోర్డులు పెట్టుకొని మరీ నడుపుతున్నారు. త్వరలో వీటన్నిటినీ అధికారిక షాపులుగా గుర్తించే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెన్షనర్లకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతున్నట్టు భారీగా ప్రచారం చేసుకున్నారు. కానీ, ఇప్పటికే తొమ్మిది లక్షల మందిని పెన్షనర్ల జాబితా నుంచి తొలగించారు. ఇంకెంతమందిని తొలగిస్తారోననే అనుమానం వెన్నాడుతోంది. ఇంటికో ఉద్యోగం-లేకుంటే రెండువేల నిరుద్యోగభృతి అన్నారు. ఇప్పు డాసంగతి ఎత్తేవాడే లేడు. ఇలా కేవలం ఐదు మాసాల్లో అన్ని వర్గాల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయింది. మరో పక్క తెలుగుదేశం పార్టీ కార్పొరేటీకరణ పూర్తయింది.

 

ప్రభుత్వంలో కె.ఇ.కృష్ణమూర్తి, యనమల వంటి సీనియర్లు ఉన్నా, వాళ్ల పాత్ర నామమాత్రమే. సుజనాచౌదరి, సీఎం రమేశ్, నామా, నారాయణ వంటి వ్యాపారస్తులదే రాజ్యం. పార్టీ అగ్రనాయకత్వ బాధ్యతల్లోకి నెమ్మదిగా చినబాబు ప్రవేశిస్తున్నారు. బాబు ఐడియాలజీ సాఫ్ట్‌వేర్‌కు చినబాబు సెకండ్ వెర్షన్ అని చెబుతారు. ఐఫోన్-5, ఐఫోన్-6లాగా ఈయన బాబు-2 అన్న మాట. ఈ బాబు-2 వెర్షన్ ఆపరేషన్‌లోకి వచ్చీరావడంతోనే తనదైన కొత్త స్కీము తెరపైకి తెచ్చింది. ‘కార్యకర్తలకు పుట్నాలు- కార్పొరేట్లకు కట్నాలు’ అనేది ఈ స్కీము సారాంశం.

 

కార్యకర్త సంక్షేమం పేరుతో ఒక నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన చినబాబు అదే చేత్తో తనదైన నయా ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గాన్ని సీఎం పేషీతోసహా ప్రభుత్వ యంత్రాంగంలో ప్రవేశ పెట్టారు. ప్రజల కిచ్చిన ఎన్నికల హామీలనైతే అటకెక్కించారు, కానీ, సొంత కార్యక్రమాలు మా త్రం చకచకా సాగుతున్నాయి. రాజధాని పేరుతో వేలకోట్ల రియల్ ఎస్టేట్ దందాకు తెరలేచింది. యేటిలోని ఇసుక, కొండలోని బాక్సైట్... కాదేదీ కొల్లగొట్టేం దుకు అనర్హం’ అన్న రీతిలో పథక రచన సాగుతోంది. ఇలాంటి వైఖరి వల్లే వరు సగా రెండు ఎన్నికల్లో చావుదెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో మోదీ గాలి కలిసొచ్చి, తప్పుడు హామీలు కొంత ఫలితమిచ్చి, చిన్నచిన్న ఆర్థమెటిక్ ఈక్వేషన్లు సహకరించడంతో ప్రాణాలు దక్కించుకుంది. అయినా, బాబు మారలేదు... ఆయన కాంక్ష తీరలేదు.    
 
 -వర్ధెల్లి మురళి

మరిన్ని వార్తలు