గత వైభవానికి పునరంకితం

5 Sep, 2014 00:13 IST|Sakshi
గత వైభవానికి పునరంకితం

తత్వశాస్త్ర ఆచార్యుడిగా విద్యార్థులను పరవశింపజేసిన అత్యుత్తమ గురువు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయాలి.
 
వృత్తులన్నింటికీ మూలమైనది బోధనావృత్తి, సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, పాలనారంగ ప్రముఖులైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, మంత్రులు, ప్రధాన మంత్రులు అందరినీ తీర్చిదిద్దే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఒక సందర్భం లో, జాతీయోద్యమ నేత బాలగంగాధర తిలక్ ‘‘నేను ప్రధాని కావాలని కోరుకోవడం లేదు. అవకాశం ఉంటే అధ్యాపకుడిగా కొనసాగాలని అనుకుంటున్నాను. ఎందరో ప్రధానులను తీర్చిదిద్దగల అవకాశం అధ్యాపకుడికి మాత్రమే ఉంటుంది’’ అని చెప్పిన అభిప్రాయం అధ్యాపక వృత్తి ఔన్నత్యాన్ని చాటిచెబుతుంది. ‘‘ఉపాధ్యాయులు ఉన్నత పదవుల్లో ఉన్న విద్యార్థులను గూర్చి గర్వంతో ఉప్పొంగడం కన్నా తమ నిర్లక్ష్యానికి గురై అగమ్యంగా రోడ్లపై తిరిగే వారిని గూర్చి ఆలోచించి, సంస్కరించే ప్రయత్నం చేయుట కర్తవ్యం’’ అంటారు మదర్ థెరిస్సా. ‘‘ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని గుర్తు చేయవలసిన స్థితి శోచనీయం.
 
వారు తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి న్యాయం చేయాలి’’ అంటారు అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ ఉపాధ్యాయులు.ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువు. విజ్ఞాన కల్పతరువు. ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుత్తణిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన ఏక సంథాగ్రాహి. మైసూర్ విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (1931-36) బెనారస్ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా (1936-39) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి విద్యావేత్తల ప్రశంసలందుకున్నారు. యూజీసీ చైర్మన్‌గా భారతదేశంలో ఉన్నత విద్యకు సంబంధించి, ఎన్నో సంస్కరణాత్మక సూచనలు చేశారు.
 
తత్వవేత్తగా ‘భారతీయ తత్వశాస్త్రం’, ‘ఎతిక్స్ ఆఫ్ వేదాంత’, ‘ఈస్ట్రన్ రెలిజియన్’, ‘వెస్ట్రన్ థాట్’ వంటి గ్రంథాలు వ్రాసి, పాశ్చాత్యుల ప్రశంసలు పొందారు. భారత రాజ్యాం గ పరిషత్ సభ్యులుగా, రష్యా రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా గొప్ప రాజ నీతిజ్ఞులు అనిపించుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి అమేయమైన ప్రతిభతో, అపారమైన మేధస్సుతో భారత రాష్ట్రపతి పదవి అలంకరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉపాధ్యాయ లోకానికే ఆయన గర్వకారణం. అందుకే భారత ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవాన్ని 1962 నుంచి గురుపూజా మహోత్సవంగా నిర్వహిస్తోంది.
 
నేడు విద్యారంగం కలుషితమైపోయిం ది. ఒకనాటి పవిత్రమైన గురుశిష్య సంబంధం విచ్ఛిన్నమైపోయింది. కార్పొరేట్ విద్యా విధానంలో ధనపు గురువులు, మదపు శిష్యులు ఉన్నారు. మనకిప్పుడు గురు బ్రహ్మలు, గురు విష్ణువులు, గురు మహేశ్వరులు లేరు. విద్యాసంస్థల్లో కొట్టే బెల్‌కు, నెల మొదట్లో వచ్చే జీతపు బిల్లుకు నిరీక్షించే నైజం ఉన్న గురువులే ఉన్నారు. నైతిక విలువలు నశించి, విద్యార్థినులను, సహోపాధ్యాయినులను లైంగిక వేధిం పులకు గురిచేసే కీచకోపాధ్యాయులున్నారు. విద్యార్థుల మనస్తత్వాన్ని అవగాహన చేసుకోలేక అసహనంతో, కోపంతో అమానుషంగా దండించి, భౌతికంగా గాయపరిచే ఉపాధ్యాయులున్నారు. ఇది విద్యారంగం దురదృష్టం. ఈ సందర్భంలో స్వామి వివేకానంద మాట లు స్మరించుకోవడం సముచితంగా ఉంటుం ది. ‘‘ప్రాథమిక దశలో విద్యార్థులు ఉద్యానవనంలో పూలమొక్కల వంటి వారు. ఉపాధ్యాయులు తోటమాలుల్లా ప్రేమతో వారిని పరిరక్షించాలం’’టారు.
 
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... ఉపాధ్యాయులు అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలి. ఉపాధ్యాయ సంఘాలు హక్కుల కోసం ఉద్యమించటంతో పాటు ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని, బాధ్యతలను గుర్తించి ఆదర్శంగా పనిచేసేట్లు దిశానిర్దేశం చేయాలి. సాధారణ ఉపాధ్యాయులంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా రూపొందిన నాడే గురుపూజా మహోత్సవాలు సార్థకమౌతాయి.

(వ్యాసకర్త రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత)

మరిన్ని వార్తలు