చేనేతకు తప్పని దిగులు..!

28 Apr, 2016 01:57 IST|Sakshi
చేనేతకు తప్పని దిగులు..!

సందర్భం
పాలకవర్గాల తీవ్ర నిర్లక్ష్యంతో విభజనకు ముందు, ఆ తరువాత కూడా, చేనేత రంగం కష్టాలు పెరిగాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో, చేనేత కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని, తగు నిర్ణయాలు ప్రకటించే ప్రభుత్వ విధాన పత్రం అవసరం ఎంతైనా ఉంది.
 
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం సాగిన కాలంలో పాలనా యంత్రాం గం చతికిలపడినప్పుడు, గోడు వినే వారు లేక, చేనేత కుటుంబాల వృత్తి వలసలు జరుగుతూనే వచ్చాయి. నేడు సైతం చేనేత కుటుంబాల ఆదాయం పెరిగే అవకాశాలు తగ్గిపోతున్నాయి. చేనేత కూలీ, నానాటికీ పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల సూచీతో పోటీ పడలేక ఎప్పుడో చతికిలపడింది. ఫలితంగా చేనేత కుటుం బాలకు అప్పులు, దిగజారుతున్న జీవన ప్రమాణాలు మిగి లాయి. ఒకప్పుడు గ్రామంలో ఇతర వృత్తులకు కళ్ళు కుట్టేలా ఒక వెలుగు వెలిగిన చేనేతలు కట్టెలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అక్కడే ఉండలేక, ఆదాయం పెంచుకునే మార్గంలేక, నమ్ముకున్న వృత్తి వదలలేక, అనేక కష్టాల మధ్య తమ కళా నైపుణ్యం బతికిం చుకుంటున్న చేనేత కుటుంబాలు ఆత్మస్థైర్యంలో, త్యాగంలో కర్షకులతో పోటీ పడుతున్నాయి. గ్రామీణ వాతావరణం, ఈ వృత్తి కొనసాగింపునకు అనుకూలంగా లేదు.

ప్రస్తుతం ఆదాయం ఎలా అనే ప్రశ్నతోపాటు, తమ పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా చేనేత కుటుంబాలలో ఉంది. అనేక కుటుంబాలు పిల్లలకు ఇప్పటికీ తమ శక్తి మేరకు చదువులు చెప్పించి కష్టాల కడలి దాటించే ప్రయత్నం చేస్తున్నా యి. ఇప్పటి పోటీ ప్రపంచంలో ఈ అరకొర చదువుల వల్ల పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రయత్నాల్లోను విఫలం అవుతు న్నారు. ఫలితంగా పిల్లలకు నైపుణ్యం లేక, చదువు లేక, ఉద్యో గాలు లేక, పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నాయి.

ఈ చేనేత కుటుంబాల పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న రాజకీయ నేతలు, ఎన్నికల సమయంలో చేసిన ఆశలు రేకెత్తించే వాగ్దానాలు చేసి తర్వాత మరిచిపోవడం పరిపాటి అయ్యింది. చేసిన వాగ్దానాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టినా, చేనేత సమా జం నుంచి ప్రతిస్పందన ఉండదు అని గమనించిన రాజకీయ చాణక్యులు వీరిని మోసం చేయడం అలవాటుగా మార్చుకు న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్ర బాబు చేనేత రంగానికి రూ. 1,000 కోట్లు కేటాయిస్తామని వాగా ్దనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి తమ ఎన్నికల ప్రణాళికలో చేనేత అభివృద్ధికి ఒక సమగ్ర విధానం ప్రకటిస్తామని వాగ్దానం చేసింది. ఈ వాగ్దానాలు కార్యరూపం దాల్చలేదు. సరి కదా, దానికి వ్యతిరేకమైన చర్యలు మాత్రం తీసుకున్నారు.

2014 ఎన్నికలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చేనే తకు ఆశల హరివిల్లు పేనిన పార్టీలలో మొదటి స్థానంలో తెలం గాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం ఉన్నాయి. అధికారం వచ్చినాక, చేనేతలు ఓపికతో వేచి చూస్తున్నా కూడా ఇచ్చిన వాగ్దానాల మాట దేవుడెరుగు, చేనేత కష్టాలను పెంచే చర్యలు క్రమంగా తేలుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా చేనేతకు బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయి. ఇచ్చిన నిధులు ఖర్చు చేయడం లేదు. అవసరమైన పథకాలు పూర్తిగా ఎత్తివేశారు.

ఆప్కో విభజన ఆలస్యమవుతుంటే ప్రాథమిక సహకార సంఘాలు దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి. ఆప్కో విభజనకు ముందు నుంచే ఉన్న ప్రభుత్వ బకాయిల చెల్లింపు ఇప్పుడు ఏ ప్రభుత్వ బాధ్యత అన్నది తేలలేదు. ఆస్తులు, అప్పులు, నిరర్ధక వస్త్రాల స్టాకు బాధ్యత తేలేదాక, రెండు రాష్ట్రా ల ప్రాథమిక సహకార సంఘాలకు దిక్సూచి అయిన రాష్ట్ర చేనేత సహకార సంఘం ఏర్పడి, సమర్థంగా పనిచేసే పరిస్థితి లేదు. ఈ మార్గంలో చేనేత కుటుంబాలకు పని, ఉపాధి పూర్తిగా మూసుకు పోయే ప్రమాదం ఉన్నది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న ‘భేషజాల’ పోరులో ఆప్కో మరియు టెస్కో సంస్థల అభివృద్ధి మీద ఆశలు ఆవిరి అవుతున్నాయి.

రాష్ట్ర విభజన తరువాత ఇప్పటికి మూడు బడ్జెట్లు వచ్చి నాయి. ఒక్కొక్క బడ్జెట్ మారుతున్న క్రమంలో, చేనేత రంగం పట్ల ప్రభుత్వ ఆలోచనల వ్యతిరేక దిశ స్పష్టమవుతోంది. చేనేత శాఖను, సిబ్బంది పనితీరును మెరుగుపరిచి, సమర్థవంతంగా చేనేత కుటుంబాల ఉపాధి కొనసాగించే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. అత్యంత ఉన్నత స్థానమైన చేనేత సంచాల కులు ఎవరు? అనే సందిగ్ధత నాలుగు ఏళ్ల నుంచి రెండు రాష్ట్రా లలో కొనసాగుతున్నది. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఆధునిక పరిశ్రమల స్థాపనపై పూర్తిగా దృష్టి పెడుతున్న వైనంలో అదే ‘ముఖ్య’ శాఖలో ఒక విభాగం అయిన చేనేత శాఖ పట్టించు కోని ‘పెద్ద పిల్ల’ లాగా అయ్యింది. మంత్రుల తీరు కూడా అదే. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు చేనేతను పీడించిన ఈ దౌర్భా గ్యపు పాలన సంస్కృతి ఇప్పటికి కొనసాగుతున్నది.

ఉమ్మడి రాష్ర్టంలో 2013-14లో జౌళి శాఖకు రూ. 214 కోట్లు కేటాయించగా, 2014-15లో తెలంగాణ రూ.142.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.99.86 కోట్లు కేటాయించాయి. 2015 -16లో తెలంగాణ రూ.201.72 కోట్లు కేటాయించగా, ఆంధ్ర ప్రదేశ్ కేవలం రూ. 45.92 కోట్లు కేటాయించింది. 2016-17లో తెలంగాణ రూ. 83.05 కోట్లు ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ రూ. 124.56 కోట్లు ఇచ్చింది. ఉమ్మడి రాష్ర్టంలోనే చేనేతకు బడ్జెట్ పెంచాలని చేనేత కుటుంబాలు కోరగా, రెండు రాష్ట్రాలు అయినాక బడ్జెట్ అంతకంటే తక్కువ కావడం దారుణం.

అనేక సంవత్సరాల నుంచి చేనేత రంగం... జౌళి పరిశ్రమ శాఖ నుంచి విముక్తి కోరుతున్నది. జౌళి శాఖ కేటాయింపులలో కూడా అచ్చంగా చేనేతకు ఇస్తున్న నిధులు చాలా తక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14లో చేనేతకు కేటాయింపులు రూ. 148.77 కోట్లు కాగా, 2014-15లో తెలంగాణ కేటాయించింది రూ. 93.47 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 57.29 కోట్లు. 2015- 16లో తెలంగాణ రూ. 53.29 కోట్లు ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 16.37 కోట్లు కేటాయించింది. 2016-17లో తెలం గాణ చేనేత పథకాలకు నయా పైసా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం రూ. 27.65 కోట్లు విదిల్చింది

ప్రపంచీకరణ నేపథ్యంలో, చేనేత కార్మికులు ఎదుర్కొం టున్న సవాళ్ళను అర్థం చేసుకుని, వాటికి అనుగుణమైన విధాన నిర్ణయాలు ప్రకటించే ప్రభుత్వ విధాన పత్రం అవసరం ఎం తైనా ఉంది. విస్తృత సంప్రదింపుల తరువాత చేనేత విధానం ప్రకటించాలి అని చేనేత రంగం ఎప్పటి నుంచో కోరుతున్నది. ముసాయిదా జాతీయ ఫైబర్ విధానం చేనేతకు వ్యతిరేకంగా ఉంది. దీనిని సవరించి సహజ నూలుకు, చేనేతకు అనుకూలంగా తయారు చేస్తే చేనేత రంగానికి, కోట్లాది చేనేత కుటుంబాలకు మేలు చేసిన వారవుతారు.


డి. నరసింహారెడ్డి,  వ్యాసకర్త జాతీయ చేనేత జౌళి నిపుణులు

 మొబైల్: 9010205742

మరిన్ని వార్తలు