తమిళ రాష్ట్రంలో తెలుగు కవి సమ్మేళనం

26 Jul, 2015 00:18 IST|Sakshi
తమిళ రాష్ట్రంలో తెలుగు కవి సమ్మేళనం

రిపోర్టు

350 మంది కవులు... 350 కవితలు.. 4 రాష్ట్రాల నుంచి ఒకే వేదిక మీద తెలుగువారు... మద్రాసు విశ్వవిద్యాలయం, దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో 24 గంటలపాటు నిరాఘాటంగా జరిగిన తెలుగు కవుల సమ్మేళనం గురించి, ఆ కార్యక్రమ రూపకర్త మాడభూషి సంపత్‌కుమార్ ‘సాక్షి’కి అందించిన వివరాలు:

‘‘ఇంతకుముందు ఎక్కడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఇందులో ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి 350 మంది కవులు పాల్గొన్నారు.  తెలుగేతర రాష్ట్రంలో తెలుగు భాషలో ఇటువంటి కార్యక్రమం జరగడం ఒక అరుదైన సంఘటన. ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు మా కార్యక్రమాన్ని గుర్తించారు. ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు కూడా, ‘ఈ కార్యక్రమం మాకు గర్వకారణం. ఇటువంటిది ఎక్కడా వినలేదు’ అని ప్రశంసించారు.

ఆలోచన ఇలా..
తెలుగువాళ్లంతా మనవాళ్లే అనే ఆలోచన నుంచే ఈ కార్యక్రమ రూపకల్పన జరిగింది. మనందరం అప్పుడప్పుడు కలుస్తూండటం వల్ల తెలుగుదనం అణగారిపోకుండా ఉంటుంది. ఇంతమంది తెలుగువాళ్లం ఉన్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. భౌగోళికంగా విడిపోయినా కలసి ఉన్నామనే భావనతోనే అందరూ మాట్లాడారు. తెలుగు భాష, తెలుగు వారం అనే అంశం మీద 10 శాతం మంది ఉపన్యసించారు. ఈ సమ్మేళనంలో పద్యకవులు ఎక్కువమంది పాల్గొన్నారు.

150 మంది దాకా స్త్రీలు వచ్చారు. గోదావరి పుష్కరాల కారణంగా అటువైపు వారు కొందరు ఆగిపోయారు. కార్యక్రమం వాయిదా వేసుకుంటే వస్తామని సూచించినప్పటికీ వీలు లేకపోయింది. అయినా ఊహించని విధంగా కొందరు అప్పటికప్పుడు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు సమావేశానికి వచ్చిన మండలి బుద్ధప్రసాద్‌గారు సంతోషించారు. ఇది తెలుగు రాష్ట్రాలలో అయితే ఇంత చక్కగా జరిగేది కాదన్నారు’’.
సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై.

మరిన్ని వార్తలు