కథా నిలయానికి దక్కాల్సిన యజ్ఞ ఫలం

15 Feb, 2016 01:10 IST|Sakshi
కథా నిలయానికి దక్కాల్సిన యజ్ఞ ఫలం

తెలుగు కథ పుట్టిన శతాబ్దం లోపలే, ఒక ప్రపంచ స్థాయి హోదా వేపు నడవడం మొదలు పెట్టింది. దేశంలో హిందీ తర్వాత, అత్యధిక ప్రజలు మాట్లాడే రెండో భాషగా ఎన్నదగిన స్థానం ఉన్న తెలుగు, ఒక సాహిత్య ప్రక్రియకు సంబంధించి ఇటు జాతీయ స్థాయిలోనూ, అటు అంతర్జాతీయ స్థాయిలోనూ లేనటువంటి, విస్తృత వనరుగా ఎదిగేందుకు సంకల్పాన్ని చెప్పుకుని, 1997లో కథానిలయాన్ని ప్రారంభించింది. వేల సంఖ్యలో కథకుల వివరాలు సేకరించారు, వేనవేల కథల కుప్పలు ఏర్పడ్డాయి.

కాళీపట్నం రామారావు అనే వ్యక్తి తలపెట్టినా, ఒక బృందం నడిపించినా, ఈ కథానిధి జాతి సంపద. ఉత్తరోత్తరా దీని అభివృద్ధి తెలుగు సాంస్కృతిక సమాజపు బాధ్యత. ఇప్పుడు వేగంగా కథానిలయం వెబ్‌సైట్ రూపొందుతోంది. 1,500 కథకుల, దాదాపు 86,000 కథల ప్రాథమిక సమాచారం వెబ్ పల్లకి ఎక్కిస్తూ, ఈ కృషిలో భాగంగా ఇప్పటికి 12,000 తెలుగు కథల పీడీఎఫ్ ప్రతులను సైటులో లభ్యపరిచారు. ఇరవయ్యో శతాబ్దపు ప్రపంచసాహిత్యంలోనే ఇదొక మైలురాయి.
 
 ఈ స్థాయిలో, ‘ఇంతింతై కథ ఇంతై’ అని ఎదిగే దశలో, ప్రభుత్వ సాంస్కృతిక శాఖ- శ్రీకాకుళం మునిసిపల్ పరిధిలో ఒక వెయ్యి గజాల స్థలం కేటాయించి, మూడు అంతస్తుల భవన నిర్మాణం చేసి, ఈ సాహిత్య పురోగతిని నిలబెట్టాలి. ఇది వేగంగా జరిగేలా, రచయితలు, సాహిత్యాభిమానులు, సంస్థలు, ఏక మాటగా సానుకూల వాతావరణాన్ని, ఏర్పరుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మంచి పని చేసేలా ప్రోద్బలం చేయాలి.
 
ఈ ప్రాజెక్ట్ ఎదిగే దశలో, యాభై మందికి మించి సౌకర్యవంతంగా సమావేశం కాలేని ఒక చిన్న ఇంటి ప్రదేశం, తప్పక ప్రతిబంధకం అవుతుంది. కొత్త భవనంలో, ఒక లైబ్రరీ, మొదటి అంతస్తులో కథలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ రీసెర్చ్, రిఫరెన్స్, రిసోర్స్ కేంద్రంగా పనిపాటలు, రెండవ అంతస్తులో సమావేశమందిరం ఏర్పాటు చేయడం, తెలుగు జాతి సాంస్కృతిక సాహిత్య వికాసానికి ఎన్నో వాగ్దానాలు చేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వపు విధాయకమైన కనీస సాంస్కృతిక కర్తవ్యం.

ఇక కథానిలయం, కేవలం ఒక ప్రాంతీయ భాష కథల వనరుగానే పరిమితం కాకుండా, తెలుగు అనువాదంలో ఉన్న జాతీయ భాషల కథలు, హిందీ, ఇంగ్లిష్ కథల ఏకకాల ఉపలభ్యతకు దారులు వేస్తే గనక, ముందరి తరాల కథాధ్యయనవేత్తలు,  కథకులు, పరిశోధకులకు ఒక సమగ్ర రెఫరెన్స్ సెంటర్‌గా ఎదుగుతుంది.
 - రామతీర్థ
 కాళీపట్నం రామారావు
 9849200385
 
 మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం.  రచనలు  పంపవలసిన చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. ఫోన్: 040-23256000 మెయిల్: sakshisahityam@gmail.com

>
మరిన్ని వార్తలు