పీడిత జన న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్

17 Nov, 2014 00:55 IST|Sakshi
పీడిత జన న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్

ప్రజానుకూల తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని  దీప్తిమంతం చేసిన అరుదైన న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్. పీడితుల పట్ల ఇంత ప్రేమను, పక్షపాతాన్ని ప్రదర్శించిన న్యాయమూర్తులు చాలా అరుదు. ఆయనకిప్పుడు వందేళ్లు. రిటైరయ్యాక కూడా అవిశ్రాంతంగా సామాజిక న్యాయంకోసం పోరాడుతున్నారు.
 
ఒక సమాజ చరిత్రలో వందేళ్లు అంటే తక్కువ కాలమే కావ చ్చు. ప్రాకృతిక ప్రతిబంధకాలను అధిగ మించి ఒక వ్యక్తి జీవితం వందేళ్లు కొనసాగితే ఏ సమాజానికైనా అదొక అపురూపమైన విషయం. అలా జీవించడం మాత్రమే కాదు...న్యాయవాదిగా, మంత్రిగా, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వివిధ పాత్రలు పోషిస్తూ కూడా పీడిత జన పక్షపాతాన్ని కొనసాగించడం అసామాన్యం. అలాంటి అరుదైన వ్యక్తి జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ తన వందో పుట్టినరోజును ఈమధ్యే జరుపుకున్నారు. మన సమాజంలోని దురదృష్టవంతుల తరపున అవిశ్రాం తంగా పోరాడుతూ వచ్చిన ఈ విశిష్టవ్యక్తి పదవీ విరమణ తర్వాత కూడా ప్రశాంత జీవితం ఎంచుకోకుండా ఎక్కడ అన్యాయం కనిపించినా, తన నిరసన వాణిని నిరంతరం గా వినిపిస్తున్నారు.

వి.ఆర్ కృష్ణయ్యర్ పూర్తి పేరు వైద్యనాథపుర రామకృష్ణ అయ్యర్. 1914 నవంబర్ 15న కేరళ రాష్ట్రంలో మలబారు ప్రాంతంలోని పాలక్కాడ్ సమీ పంలోని వైద్యనాథపురంలో జన్మించారు. 1952లో కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1957లో కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా చేరి శాస న, విద్యుత్, జైళ్లు, సాగునీటి శాఖల్లో మౌలిక మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వం రద్దుతో మళ్లీ న్యాయవాద వృత్తి చేపట్టా రు. అటు తర్వాత కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులై 1980లో పదవీవిరమణ  చేశారు. న్యాయవ్యవస్థ గౌరవా న్ని నిలబెడుతూ అసంఖ్యాక తీర్పులను వెలువరించి న్యాయాన్ని సామాన్యుల చెంతకు చేర్చారు. పద్మవి భూషణ్‌తోపాటు అనేక అవార్డులు ఆయన్ను వరించాయి. నాలుగు పర్యాటక గ్రంథాలతో సహా న్యాయ, సామాజిక, రాజకీయ అంశాలపై మొత్తం 105 పుస్తకాలు రచించారు.  కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కృష్ణయ్యర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిం చడంపై పలువురు న్యాయనిపుణులు భృకుటి ముడిచారు. కాని అనుమానించిన వారే ఆరాధించేలా చేసుకున్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ చిన్నపరెడ్డిల పై ఆయన ప్రభా వం ఫలితంగా 1970-80 మధ్య కాలంలో భారత రాజ్యాంగ దార్శనికత ఒక స్పష్టమైన వాస్తవంగా రూపు దిద్దుకుంది. ఈ క్రమంలో ప్రజాప్రయో జన వ్యాజ్యం దేశ ప్రజలకు ఒక వరమైంది. దశాబ్దాలుగా స్తబ్దతకు గురైన పాత న్యాయ నిబంధనలకు వీరు పాతరే శారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఉప శమనం కలిగించే తీర్పులను ఈ న్యాయమూర్తుల త్రయం వెలువరించింది. దీని ఫలితంగా సామాన్యుల హృదయాల్లో న్యాయవ్య వస్థపై గౌరవం, ఆరాధన ఏర్పడింది. మన సర్వోన్నత న్యాయస్థానం కీర్తి ప్రతిష్టలు జాతీయంగా, అంతర్జాతీ యంగా మార్మోగాయి.
 
చారిత్రాత్మక తీర్పు


నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక వివాదంపై జస్టిస్ కృష్ణయ్యర్ 1975 జూన్ 24న ఇచ్చిన తాత్కాలిక తీర్పు భారత న్యాయ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఎన్నికల్లో అవకతవకలకు గాను ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని అలహాబా ద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలంటూ ఆమెపెట్టుకున్న అప్పీలును కృష్ణయ్యర్ తోసిపుచ్చారు. హైకోర్టు తీర్పుపై బేషరతు స్టే ఇవ్వడానికి కృష్ణయ్యర్ నిరాకరించారు. ఒక దేశ ప్రధానికి పార్లమెంటులో ఓటు హక్కు ఉండదని ప్రకటించిన అద్వితీయమైన తీర్పు అది. ఇందిర ఎన్నిక చెల్లదని ఆమెపై అనర్హత వేటు వేసిన ఈ తీర్పుతో ఆ మరుసటి దినం అంటే జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించి ఇందిరాగాంధీ దేశచరిత్రలో చీకటి అధ్యాయానికి నాంది పలికారు. ఆ తీర్పు  అంతర్జా తీయ ప్రశంసలు పొందింది. సుప్రీంకోర్టు పరంగా చూస్తే అదొక అత్యుత్తమ కాలం. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఇందిర తరపున నాటి కేంద్ర న్యాయమంత్రి హెచ్.ఆర్ . గోఖలే తనను కలుసుకుంటానని చేసిన అభ్యర్థనను కృష్ణయ్యర్ సున్నితంగా తిరస్కరించారు. భారత న్యాయ వ్యవస్థ ఉద్దీప్తం చెందిన క్షణాలవి.
 
అవిశ్రాంత కార్యాచరణ


న్యాయమూర్తులుగా, ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసిన వారు కూడా రిటైరవగానే ప్రభుత్వ పదవులు, గవర్నర్ పదవులు, ఇతర ప్రయోజనాలకు సిద్ధపడిపోతు న్న కాలాన్ని మనం చూస్తున్నాం. కానీ జస్టిస్ కృష్ణయ్యర్ కీర్తి పదవీ విరమణ అనంతరం మరింతగా గుబాళించిం ది. 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్మెంట్ పుచ్చుకున్నప్పటినుంచి ఆయన సామాజిక న్యాయ చాంపి యన్‌గా అవతరించారు. రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, సామాజిక న్యాయం వంటి పలు అంశాలపై ఆయన వ్యాఖ్యానాలు, ప్రతిస్పందనలు జాతీయంగా, అంతర్జాతీయంగా మన్ననలు పొందాయి. అంతర్జాతీయ న్యాయ కమిషన్ మాజీ అధ్యక్షుడు జస్టిస్ మైఖేల్ కిర్బీ (ఆస్ట్రేలియా), ఈ శతాబ్దిలోనే ఉమ్మడి న్యాయానికి సంబంధించిన అత్యున్నత మూర్తిగా కృష్ణయ్యర్‌ను ప్రశం సించారు. 90 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా సామాజిక సమస్యలపై ఆయా సందర్భాల్లో స్పందిస్తూనే వచ్చారు. స్వస్థలమైన కేరళలో అనేక ప్రజా ఉద్యమాలు, ప్రపంచీకరణ వ్యతిరేకోద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. 2008లో ప్రముఖ న్యాయమూర్తులు, పౌర హక్కుల కార్యకర్తలతో కలిసి, అంతర్జాతీయ మానవ హక్కులకు కట్టుబడి ఉండాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. కోట్లమంది పైగా ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్న దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్, ఫైనాన్స్‌ను ప్రవేశపెట్టడానికి ఆయన 2010లో మద్దతు నిచ్చారు. శతవసంతాల జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్‌కు  శతాసహస్రాభివందనాలు.
     
కె.రాజశేఖరరాజు
 
 

>
మరిన్ని వార్తలు