విత్తన పరాధీనతకు చెల్లు చీటీ

9 Jul, 2014 00:38 IST|Sakshi
విత్తన పరాధీనతకు చెల్లు చీటీ

విత్తన పరిశ్రమ నియంత్రణాధికారులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపి ఆ దిశగా చర్యలను చేపట్టాలి. సహకార రంగంలో విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించి విత్తన రైతుల నుంచి నేరుగా రైతులకు విత్తనాలు అందేలా చేస్తేనే ప్రైవేటు, బహుళజాతి విత్తన కంపెనీల గుత్తాధిపత్యానికి  కళ్లాలు వేయడం సాధ్యం.
 
విత్తనాలు లేకుంటే వ్యవసాయం లేదు. వచ్చే ఏడాది విత్తడానికి రైతులు ఈ ఏడాది పండిన పంటల నుంచే ఎంచుకుని దాచుకునేవారు. తమలో తాము పంచుకునేవారు. మంచి విత్తనాలను గుర్తించి మెరుగైన రకాలను పునరు త్పత్తి చేసేవారు. అది విత్తు రైతు చేజారిపోని నాటి గతం. అధిక దిగుబడి వంగడాలకు ప్రోత్సాహం, సంస్కరణల పేరిట కేంద్రం రైతు చేతిలోని విత్త నాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టింది. నాణ్యతా ప్రమాణాలంటూ రైతుల విత్తన ఉత్పత్తి పరిజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసింది. దీంతో క్రమక్రమంగా రైతులు విత్తన ఉత్పత్తి పద్ధతులను, పరిజ్ఞానాన్ని మరచిపోయే పరిస్థితి ఏర్పడింది. విత్తనాల కంపెనీల మాయాజాలానికి విత్తనాలను పండించే తెలంగాణ రైతు లకే విత్తనం కరువయ్యే దుస్థితి దాపురించింది. రైతులు విత్తనాల కోసం విత్తన కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. తెలంగాణను విత్త నోత్పత్తి కేంద్రంగా మారుస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల్లో వాగ్దానం చేసింది. కానీ తెలంగాణ ఇప్పటికే విత్తన ఉత్పత్తి కేంద్రం. అది రైతులను దివాలా తీయించి, విత్తన కంపెనీలను కోట్లకు పడగలె త్తేట్టు చేసింది. జరగాల్సింది విత్తన ఉత్పత్తి రంగ ప్రక్షాళన.

విత్తన ఉత్పత్తి రంగ ప్రక్షాళన జరగాలి

పత్తి విత్తన రంగాన్ని కొన్ని ప్రైవేటు సంస్థలే శాసిస్తున్నాయి. బీటీ పత్తి వలన తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా ఏటా కోట్ల రూపా యలు రైతులు విత్తన కంపెనీలకు చెల్లించుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే గత ఏడాది తెలంగాణ రైతాంగం వాటికి వెయ్యి కోట్లు సమర్పిం చుకుంది. కానీ కంపెనీల ప్రకటనలకు భిన్నంగా మొక్కలు సరిగా పెరగక, చీడ పురుగులకు గురై రైతులు నష్టపోయారు. చెప్పిన దిగుబడిలో సగం కూడా రాలేదు. పైగా మార్కెట్లో తగిన ధరలు రాక మరింతగా నష్టానికి గుర య్యారు. వ్యాపార ప్రకటనలతో మభ్యపెట్టి రైతులకు మళ్లీ అదే నాసిరకం విత్తనాలను అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎంత మాత్రం విశ్వసించలేని కంపెనీల కాకి లెక్కలే వ్యవసాయ శాఖ గణాంకాలు. వాస్తవంగా విత్తనాల ఉత్పత్తి ఎంతో ఎవరికీ తెలియదు. కాబట్టి విత్తనాల కంపెనీలు, డీలర్లకు విత్తనాల కొరతను సృష్టించి రైతులను కొల్లగొ ట్టడం అలవాటుగా మారింది. పత్తి విత్తన కంపెనీలకు స్వంత విత్తన క్షేత్రాలు ఉండవు. రైతులతో ఒప్పందాలు చేసుకొని విత్తనాలను ఉత్పత్తి చేయిస్తారు. మొత్తం ఎంత విస్తీర్ణంలో ఎంత పరిమాణంలో విత్తనాలు ఉత్పత్తి అయ్యాయో గోప్యమే. వార్షిక ఉత్పత్తి ప్రణాళికలు సైతం రహస్యమే. ప్రభుత్వం, స్థానిక మార్కెటింగ్ కమిటీలతో కొంత సమాచారాన్ని పంచుకోవాలి. కానీ విత్తన కంపెనీలు అరకొర సమాచారంతో సరిపుచ్చుతాయి. మార్కెట్ ధరలకు అను గుణంగా విత్తన ధరలు కూడా పెరగాలనే వింత వాదనతో విత్తన కంపెనీలు ఏటా ప్రభుత్వంపై ధరలను పెంచాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరిగి, ఉత్పత్తి తగ్గిపోయిందని, బీటీ పత్తి వల్ల రైతుల ఆదాయం గణనీ యంగా పెరిగిందని కుంటి సాకులు చూపుతున్నారు. పత్తి విత్తనాల మీదే కాదు అన్ని విత్తనాల ఉత్పత్తి మీద, ధరల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ఒక్క బీటీ పత్తి విత్తనాల మీదే ఒక బహుళజాతి కంపెనీ ఏటా రూ. 400 కోట్ల రాయల్టీని పొందుతోంది. కానీ విత్తన నాణ్యతకు మాత్రం అది జవాబుదారీతనం వహించదు. బీటీ పత్తి విత్తన ప్యాకెట్ ధరలో విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుకు చెల్లించేది 20 నుంచి 30 శాతం మాత్రమే. కంపెనీ ఆర్గనైజర్ల వాటా కూడా అందులోనే . కంపెనీల సమాచారం ప్రకారం ప్రతి విత్తన ప్యాకెట్ ధరలో మూడు రకాల ప్రధాన ఖర్చులు కనబడతాయి. విత్తన రైతులకు ఇచ్చే సేకరణ ధర, మేధో సంపత్తి హక్కులకు గానూ మోన్సాంటో కంపెనీకి చెల్లించే రాయల్టీ, విత్తన కంపెనీ ఖర్చులు. ఆ లెక్కలనే నమ్మేట్ట యితే విత్తన కంపెనీలు లాభాలు లేకుండా ఎందుకు వ్యాపారం చేస్తున్నా యనే అనుమానం కలుగక మానదు. విత్తనాల ధరలు పెరిగితే కంపెనీల లాభాలు మరింత పెరుగుతాయి. విత్తన రైతులకు చెల్లించే ధర పెరగదు,  పరాధీనమైన విత్తన రంగంవిత్తన ఉత్పత్తిలో ప్రైవేటు రంగానికి పూర్తి స్థాయి పాత్రను కల్పిస్తూ 2002లో కేంద్ర ప్రభుత్వం చేసిన విధానపరమైన మార్పు తరువాత విత్తన రంగం అనేక మార్పులకు లోనైంది. దేశీయ విత్తన సరఫరా కంపెనీల సంఖ్య తగ్గి, బహుళజాతి కంపెనీల పాత్ర పెరిగిపోయింది. అనేక పంటలపైనా, కూరగా యలపైనా విదేశీ కంపెనీల పెత్తనం పెరిగింది. అవి చైనా, తైవాన్ లాంటి దేశాలనుంచి తక్కువ ధరకు కూరగాయల విత్తనాలను దిగుమతి చేసుకొని ఇక్కడి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. దీంతో వినియోగదారు లపై అధిక ధరల భారం పడుతోంది. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ఇది కూడా ఒక కారణం. కొన్ని ప్రధాన వాణిజ్య పంటలకు ప్రైవేటు కంపెనీల విత్తనాలు తప్ప గత్యంతరం లేదు. వ్యవసాయ విశ్వవిద్యా లయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు విత్తనాలపై పరిశోధనలను గానీ, విత్తన ఉత్పత్తిని గానీ చేపట్టడం లేదు. పేరుకు జాతీయ స్థాయి నుంచి మనకు ప్రభు త్వ రంగ విత్తన వ్యవస్థ ఉన్నా, ప్రభుత్వ విత్తన కార్యక్రమాలు శిథిలావస్థకు చేరాయి. వివిధ ప్రభుత్వాలు ప్రైవేటు విత్తన పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ విత్తన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశాయి. నిధులను తగ్గించాయి, కేటాయించిన వాటిని నేతలు, అధికారులు కైంకర్యం చేశారు. నేడు బీటీ యేతర పత్తి విత్తనాలు దొరకని ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఒక కంపెనీ లెసైన్స్ చట్రంలోనే అన్ని కంపెనీలను ఇరికించి బీటీ పత్తినే కొనేలా చేసిన ప్రత్యక్ష చర్యల ఫలితమిది. దేశీయ పత్తి విత్తనాల ఉత్పత్తి వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో ఒక బహుళజాతి కంపెనీ సఫలీకృతమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆహార పంటలన్నిటిపైనా ఒకే బహుళజాతి సంస్థ గుత్తాధిపత్యం, గుత్త వ్యాపారానికి దారి తీయక తప్పదు. పత్తి విత్తనాలలోని మన పరాధీనత పాలకులకు, రైతులకు, ప్రజలకు గుణపాఠం.

రాష్ట్ర ప్రభుత్వాలకే నియంత్రణాధికారాలు  

ప్రస్తుతం పార్లమెంటు ముందున్న విత్తనాల బిల్లులో అనేక లోపాలున్నాయి. గత అనుభవాల దృష్ట్యా విత్తన పరిశ్రమ నియంత్రణాధికారులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం అత్యవసరం. విత్తన ధరల నియంత్రణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉండాలి. స్వతంత్ర సంస్థ మదింపు చేసిన ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకొని విత్తనాల ధరలను నిర్ణయించాలి. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపి ఆ దిశగా చర్యలను చేపట్టాలి. కేవలం బీటీ పత్తికి మాత్రమే గాక అన్ని రకాల విత్తనాల ధరలు, నాణ్యతలకు సంబంధించి పూర్తి పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరం. తెలంగాణను విత్తన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందించడానికి పాటించాల్సిన సూత్రాలు, తీసుకోవాల్సిన చర్యలు : 1. విత్తన కంపెనీల నియంత్రణకు రాష్ట్ర స్థాయి విత్తన చట్టాన్ని తేవాలి. ధర, నాణ్యత, లభ్యతలకు రక్షణను కల్పించాలి. 2. రాష్ట్ర స్థాయి విత్తన సమాచార వ్యవస్థను ఏర్పరచి తెలంగాణ రైతులకు నిరంతరాయంగా విత్తన సమాచారాన్ని అందించాలి. 3. విత్తనాలకు సంబంధించిన శాస్త్రీయమైన, మార్కెట్ సంబంధమైన సమాచారంతో ఏటా రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికను తయారు చేసి భవిష్యత్ ప్రణాళికలకు, విధానాలకు ప్రాతిపదికను ఏర్పరచాలి. 4. విత్తన కంపెనీలు లేదా ఆర్గనైజర్లకు విత్తన రైతులకు మధ్య ఒప్పందానికి చట్టబద్ధతను కల్పించి రైతుల ప్రయోజనాలను కాపాడాలి. 5. సహకార రంగంలో విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించి, సాంకేతిక, పెట్టుబడి పరమైన సహాయాన్ని అందించాలి. తద్వారా విత్తన రైతుల నుంచి నేరుగా రైతులకు విత్తనాల సరఫరా సాధ్యమవుతుంది. అప్పుడే ప్రైవేటు విత్తన పరిశ్రమకు కళ్లాలు వేయడం సాధ్యం 6. హైదరాబాద్‌లో విత్తన ఎగుమతులు - దిగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 7. ప్రభుత్వ రంగంలో వ్యవ సాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విత్తన పరిశోధనను ప్రోత్సహించాలి. 8. నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన కంపెనీల నుంచి సత్వరమే రైతులకు తగు నష్ట పరిహారం అందేలా చట్ట సవరణలు చేయాలి. 9. రైతులు స్వంతంగా విత్తనాలను తయారు చేసుకోడాన్ని ప్రోత్సహించే పథకాలను చేపట్టాలి.

(వ్యాసకర్త వ్యవసాయరంగ విశ్లేషకులు)     డాక్టర్ డి. నర్సింహారెడ్డి
 

>
మరిన్ని వార్తలు