ఇంగ్లిష్‌కన్నా వందేళ్ల ముందే తెలుగులో తిసారెస్‌

25 Jun, 2017 23:50 IST|Sakshi
పైడిపాటి లక్ష్మణకవి ‘ఆంధ్రనామ సంగ్రహము’, ఆడిదం సూరకవి ‘ఆంధ్రనామ శేషము’ కలిపిన వావిళ్ల వారి 1920 నాటి ముద్రణ

ఇంగ్లిష్‌ Thesaurus1805 ప్రాంతాల నుంచీ తయారీ అని చెప్పినా, ఒక కొలిక్కి వచ్చి అచ్చులోకి వచ్చింది 1852లో! మన తెలుగు భాషా నిర్మాతలు 1750 ప్రాంతాలలోనే తెలుగు మాటల తిసారెస్‌ తేవడం గమనార్హం. దీన్ని భాషకు సంబంధించి ఆధునికతల తొలి వేకువగా చెప్పవచ్చు.

పద్నాలుగో శతాబ్దానికి ఇంకా చెదురుమదురుగా ఉండి, 1343లో, చాసర్‌ మహాకవి జననానికి ఇంగ్లండ్‌లో  సాహిత్యం ఎదురుచూస్తున్నది. ఇంకా రెండు వందలేళ్ళ తర్వాత కానీ షేక్‌స్పియర్‌ ఆంగ్ల సాంస్కృతిక సమాజంలో ప్రభవించడు. చాసర్‌ కాలానికే, భారత అనువాదం పూర్తి కావచ్చి, నన్నెచోడ కవి, పాల్కురికి సోమనల రచనా ధార తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తోంది. తెలుగు మాటల అంటే దేశి మాటల వాడుక పెరిగి, సంస్కృతి అంతా దేశి పదాల్లో విస్తరిస్తున్న సమాజం అది. భాష అభివృద్ధి వల్లనే ఏ భాషలోనైనా పర్యాయపదాలు, నానార్థాలు ఏర్పడతాయి. ఈ పర్యాయ పదాలను ఒక చోట చేర్చడం నామకోశం అని మన దేశంలోనూ, తిసారెస్‌ అని ఆంగ్లంలోనూ వాడుక.

సంస్కృత ‘నామలింగానుశాసనం’ పేరిట క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే అమరసింహుని అమరకోశం, సంస్కృత పదాలకు ఇటువంటి ఒక సూచిగా పద్య రూపంలో నిలిచింది. ఇదే పీటర్‌ మార్క్‌ రోజెట్‌ తయారీ అయిన ఇంగ్లిష్‌ తిసారెస్‌కు మూల ప్రేరణ అని ఆంగ్ల పండితుడు డాక్టర్‌ జాక్‌ లించ్‌ (1917–1999) అభిప్రాయపడ్డారు. రోజెట్‌ నామకోశం 1805 ప్రాంతాల నుంచీ తయారీ అని చెప్పినా, ఒక కొలిక్కి వచ్చి అచ్చులోకి వచ్చింది 1852లో!

పదమూడు శతాబ్దాలు ముందరే ఇటువంటి నామకోశం సంస్కృత పదాలకు ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. అప్పటికే అది సౌష్టవమైన భాష. కానీ మన భాషా నిర్మాతలు ఆంగ్ల తిసారెస్‌ (్టజ్ఛిట్చuటuట) కన్నా దాదాపు  శతాబ్దం ముందరే తెలుగు మాటల తిసారెస్‌ తేవడం గమనార్హం. దీన్ని భాషకు సంబంధించి ఆధునికతల తొలి వేకువగా చెప్పవచ్చు. ఈ గణనీయమైన కృషి 1750 ప్రాంతాలలో జరిగింది. దీని పేరు ఆంధ్రనామ సంగ్రహము. కవి, సంకలన కర్త, ఆ నానార్థ పదాలతో పద్యాల నిర్మాత... పైడిపాటి లక్ష్మణకవి. వీరు ఏ ప్రాంతంవారో చెప్పడానికీ, కచ్చితం అయిన కాల నిర్ణయం చేయడానికీ ఆధారాలు లేవు. కానీ వీరి తరువాత, ఈ నామ సంగ్రహానికి ఇంకొన్ని జోడింపులు జరిగితే కానీ సంపూర్ణం కాదని, ఆ పని చేసింది మాత్రం విజయనగర సంస్థాన ఆస్థానకవి ఆడిదం సూరకవి.

ఈయన 1780 వరకూ జీవించారు. వీరు జత కూర్చిన మాటలతో ‘ఆంధ్ర నామ శేషము’ అని దానికి అనుబంధంగా వెలువరించి ఆంధ్ర నామ సంగ్రహకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ భాషావేత్తల తెలుగు మాటల సేకరణ జరిగిన చాలా దశాబ్దాలకు, చిన్నయ సూరి(1809–1861) ఇంకా ఆరేళ్లలో కన్ను మూస్తారు అనగా, 1855లో బాలవ్యాకరణం వచ్చింది. వ్యాకరణ పద్ధతుల స్థిరీకరణ జరగడానికి వందేళ్ల ముందరే, తెలుగు మాటల నామ సంగ్రహం జరగడం... తెలుగు భాష విషయంలో సరైన క్రమంలోనే జరిగిందని భావించవచ్చు. భారతీయ సాహిత్య లక్షణం అయిన పద్య రూపాల్లో లక్ష్మణకవి, సూరకవి ఈ నామకోశం   రచించారు. దేవ వర్గు మొదల్లో శివుడి ఇరవై పేర్లను ఒక సీసపద్యం, ఒక తేటగీతిగా లక్ష్మణకవి పొందుపరచిన తీరు ఒక సుశిక్షిత నిర్మాణానికి మచ్చు తునక.
సీ.     ముక్కంటి యరపది మోముల వేలుపు,
    మినుసిగ దయ్యంబు, మిత్తి గొంగ
    గట్టు విల్తుడు, గరకంఠుడు మిక్కిలి
    కంటి దేవర, బేసి కంటి వేల్పు
    వలిమలల్లుడు, వాక తాలుపు కొండ,
    వీటి జంగము, గుజ్జు వేల్పు తండ్రి
    వలరాజసూడు, జక్కుల రేని చెలికాడు
    బూచుల ఏకి మీడు పునుక తాల్పు,

తే.    విసపు మేతరి, జన్నంపు వేటకాడు
    బుడుత నెలతాల్పు, వెలియాల పోతు రౌతు
    తోలు దాలుపు, ముమ్మొనవాలుదాల్పు
    నాగ భవదాఖ్యలొప్పు అంధక విపక్ష            

ఇలా అచ్చ తెలుగులో రెండు వందల పేజీలుగా దీని నిర్మాణ విభాగాలు దేవ వర్గు, మానవ వర్గు, స్థావర వర్గు, జంగమ వర్గు, నానార్థ వర్గు. ఏ పద్ధతి అయితే అమరసింహుడు మొదలు పెట్టాడో అదే యిక్కడ తెలుగులోనే కాక, సముద్రాల కడ నున్న ఇంగ్లిష్‌ వారికీ 18వ శతాబ్దంలో శిరోధార్యం అయింది. ఈ విభాగ పద్ధతిలోనే ఇంగ్లిష్‌ తిసారెస్‌ ప్రతి దశాబ్ద్దమూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆంగ్లభాషా ప్రేమికులకు, అభ్యసనశీలురకు ఈ రోజెట్‌ తిసారెస్‌ తప్పనిసరి సంప్రదింపు పుస్తకం. దీని మొదటి రూపం, రెండు మూడు వత్సరాలు అటూ ఇటూగా మన బాల వ్యాకరణం వచ్చే కాలానికి పదిహేను వేల మాటలతో వెలువడ్డది. ఇప్పుడు రెండువేల మూడు వందల గ్రూపులుగా పర్యాయపదాలను కలిగి ఉన్నది. ఈ అభివృద్ధి ఆంగ్ల భాషకు సాధ్యం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

ఇంగ్లిష్‌ వారికి మన వంటి పద్యం లేదు కనుక వారి తిసారెస్‌ నిర్మాణం వచనంలోనే జరిగింది. ఇలా తెలుగులో వచన పర్యాయ పదకోశం మనకు తిరుపతి విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన ఆచార్య జి.ఎన్‌.రెడ్డి రచన తెలుగు పర్యాయపద నిఘంటువు వచ్చేంత వరకూ రాలేదు. ఈ నిఘంటువులో తెలుగు, సంస్కృత పర్యాయపదాలు కలిసే ఉన్నాయి. మొదటి  తెలుగు నామ సంగ్రహాలు మాత్రం తెలుగు భాషకే పరిమితం అయ్యాయి. భాష అభివృద్ధిని సూచించే ఒక సూచీ పదకోశాన్ని తెలుగు భాషావేత్తలు పదిహేడో శతాబ్దంలోనే   నిర్మించడం, అదీ ఆంగ్లభాష తిసారెస్‌ కన్నా దాదాపు వందేళ్ల ముందరే రావడం ప్రపంచ భాషా సమాజాల్లో తెలుగుకు ఒక సమున్నతమైన గుర్తింపును అందచేసే పరిణామం! ఇందుకు కారకులైన పైడిపాటి లక్ష్మణకవి, అడిదం సూరకవిని మనం రోజూ తలచుకోవాలి.- ఠి రామతీర్థ, మొబైల్‌ నెం: 98492 00385

మరిన్ని వార్తలు