ఆదివాసీ అభివృద్ధితో భీంకు నివాళి

8 Oct, 2014 02:42 IST|Sakshi
ఆదివాసీ అభివృద్ధితో భీంకు నివాళి

నేడు కొమురం భీం 74వ వర్ధంతి
 కొమురం భీం మరణించి ఏడు దశాబ్దాలు దాటినా ఆదివాసీ జీవితం నేటికీ ఏ కొత్త చిగురులూ వేయలేదు, ఏ కొత్త పూవులూ పూయలేదు. ఈ నేపథ్యంలో నాలుగు తరాలుగా నెరవేరని ఆదిలాబాద్ భూమిపుత్రుల చిరకాల కోర్కెలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పరిష్కరించాలి.
 
 ఆదివాసీ హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరా టంలో 1941 అక్టోబర్ 8న కొమురం భీం అసువులు బాశాడు. ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం నుం చి హైదరాబాద్‌కు కాలినడకన వెళ్లి నిజాం ప్రభు వుకు గిరిజనుల జీవన్మరణ బాధను భీం వినిపిం చాడు. భూములకు పట్టాలివ్వాలని, కప్పం కట్టాలని అధికార్లు, రజాకార్లు చేస్తున్న వేధింపులను ఆపాలని వేడుకున్నాడు. నిజాం సర్కారు కరుణించకపోగా రజాకార్లను ఉసిగొల్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన కొమురం భీం 1941 ఆశ్వయుజ మాసం కార్తీక పౌర్ణమినాడు 12 గ్రామాలకు చెందిన గిరిజన తెగ లను కూడగట్టి సామూహిక తిరుగుబాటుకు సిద్ధమ య్యాడు. రాజీ మార్గం విఫలమై నిజాం రజాకార్లు చేసిన దాడిలో భీం వీర మరణం పొందాడు.
 
 భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భీం నేల కొరిగిన జోడెన్ ఘాట్‌ను తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు సందర్శించనున్నారు. కేసీఆర్ రాకకు రెండు రోజుల ముందు, ఆ  పరిసర ప్రాం తాల్లో ఆంత్రం జంగు (18) డిగ్రీ విద్యార్థి, తొడసం రావు పటేల్ (55), జక్కావాడ్ (4), వేముల సోని (20) అనే నలుగురు గిరిజనులు తీవ్ర జ్వరాలతో మరణించారు. 74 ఏళ్ల క్రితం భీం ప్రాణాలొడ్డి  చాటి న సమస్యలు నేటికీ అపరిష్కృతంగా ఉండటం నిజంగా సిగ్గుచేటు. గిరిజనుల ప్రాథమిక హక్కు జల్ జంగల్ జమీన్‌పై ఏ ప్రభుత్వాలూ పట్టించుకో లేదు. వారు సాగుచేస్తున్న అటవీ పోడు భూము లకు, బంజర్లకు నేటికీ సంపూర్ణ హక్కుపత్రాలు రాలేదు. భీం ప్రాణత్యాగం తర్వాత హక్కు పత్రాలి చ్చిన భూములకు చట్టబద్ధమైన సౌకర్యాలు, రుణ సదుపాయాలను నేటికీ కొమురం భీం వారసులు పొందకపోవడం ఘోరం.
 
 ఆదివాసీలకు నేటికీ రక్షిత నీరు లేదు. ప్రాణా లకు ప్రమాదకరమైన చెలిమల్లో, వాగుల్లో నీళ్లే వాళ్లకు ప్రధాన దిక్కు. ఈ అరక్షితమైన తాగునీళ్లే ప్రతి ఏటా వందలాది మంది గిరిజనుల ప్రాణా లను తీస్తున్నాయి. జిల్లాలోని ఆదివాసీల్లో నూటికి 70 మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నవారే. వీరి అనారోగ్య మరణాలను నివారించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైంది. కేసీఆర్ పర్యటన సంద ర్భంగానైనా జిల్లాలో అనారోగ్యం బారిన పడి మర ణిస్తున్న ప్రతి ఒక్క చావుకు శాశ్వత ముగింపు పలికేలా గట్టి చర్యలు తీసుకోవాలి.
 
 తెలంగాణలో ఒక ఊరితో మరో ఊరికి రహ దారి సంబంధం లేని వాగులపై వంతెనలు లేని జిల్లాల్లో ఆదిలాబాద్‌దే అగ్రస్థానం. ఇక్కడ నేటికీ ఎడ్లబండ్లే అంబులెన్సులు. వర్షం వస్తే చాలు మంచా లు, కర్రకు కట్టిన జోలెలే రోగులకు ఆంబులెన్సులు అవుతున్నాయి. చస్తే అవే పాడెలవుతున్నాయి. జిల్లా లోని 32 అంబులెన్సులకుగాను 16 పైగా మూత పడ్డాయి. ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకునే శక్తి లేక నిస్సహాయ పరిస్థితుల్లో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శవాలను ద్విచక్ర వాహ నాలపై తీసుకెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాగ్దానం చేసినట్లుగా హెలికాప్టర్ అంబులెన్స్ (రోగులను హెలికాప్టర్ ద్వారా తరలించడం) సౌకర్యం కల్పిస్తే కేసీఆర్ గారికి ఆదివాసులు రుణపడి ఉంటారు.
 
 అపారమైన నీరున్న ఆదిలాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వాటర్ గ్రిడ్‌ను ప్రారంభించాలి. వ్యవసాయానికి ఒక్క పంటకు కూడా సాగునీరు సౌకర్యం లేకపోవ డమే జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలకు కారణం. 1,050 కిలోమీటర్ల దూరం ప్రవహింపచేసి చేవెళ్లకు తరలించే మా ప్రాణహిత నీళ్లను ముందుగా అతి సమీపంలో ఉన్న మూలవాసుల ప్రాణాలకు, భూములకు కూడా హితం చేకూర్చే ప్రణాళిక కావా లిప్పుడు.
 
 ఇక్కడికి సమీపంలోని ఉట్నూరు ఆదివాసీ ప్రాంతంలోని భూములకు రెండు పంటలకు సాగు నీరు అందించాలి. మెరుగైన పారిశుధ్య వసతులను కల్పించాలి. ఆదివాసుల్లో రక్తహీనతను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచే అతి చౌకైన పౌష్టికాహా రాన్ని (జొన్నలు, కొర్రలు, రాగులు, సామలు, పప్పుదినుసులు) చౌకధరలతో ప్రత్యేక నిత్యావసర పథకం కింద అందించాలి. అన్ని రకాల పోషకాహార పంటలకు మద్దతు ధర పెంచి ప్రోత్సహించాలి. జిల్లాలోని ప్రతి ఆదివాసీ ప్రాణాన్నీ కాపాడే ప్రణా ళికలను సీఎం కేసీఆర్ ప్రకటించాలి. అదే కొమురం భీం ప్రాణార్పణకు అచ్చమైన నివాళి.
- మర్సుకోల తిరుపతి
 (ఏజెన్సీ ఆరోగ్య పరిరక్షణ కమిటీ కన్వీనర్)
 నైనాల గోవర్ధన్
 (తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులు)

మరిన్ని వార్తలు