అంకెలు బోధనకీ ఓ లెక్కుంది

12 Mar, 2014 01:04 IST|Sakshi
అంకెలు బోధనకీ ఓ లెక్కుంది

ప్రపంచ గణిత దినోత్సవం నేడు: క్రీడా గుణంతో గణితాన్ని బాలబాలికలకు పరిచయం చేయడమే పరమోద్దేశం. గణితంలోని అనువర్తనాల విస్తృతిని పరిచయం చేయడం మరో ఉద్దేశం. ఇప్పుడు చాలా దేశాలలో ఈ సంరంభం విస్తరించింది.
 
 దేనికోసమైనా నిరీక్షించవలసినపుడు కాలక్షేపానికి అన్నట్టు కొన్నిచోట్ల గళ్ల నుడికట్టు కాగితాలు ఇస్తూ ఉంటారు. అడ్డంగా, నిలువుగా, ఏటవాలుగా ఎలా కూడినా ఒకే మొత్తం రావాలి. ఒక అంకెను రెండోసారి ఉపయోగించకూడదు. ఒక పొరపాటు జరిగితే మిగిలేది తప్పుల తడకే. అందుకే ఏకాగ్రతతో తీక్షణంగా ఆ పని చేస్తారు. ఇంతకీ ఇది గణిత సాధనా? వినోద క్రీడా? నిజం చెప్పాలంటే, ఆ రెండూ కూడా. ఇలాంటి వాటినే ఎడ్యుకేషనల్ గేమ్స్ అని పిలుస్తారు. ఆట విడుపు, సాధన రెండూ జమిలిగా ఉన్న ఈ ప్రక్రియలను విద్యా పరమైన క్రీడలుగా గుర్తిస్తున్నారు. ఇలాంటి ఎడ్యుకేషనల్ గేమ్స్‌ను విస్తరింప చేయడానికే మార్చి 12వ తేదీని ‘ప్రపంచ గణిత దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ 22న జరుపుకునే జాతీయ గణితశాస్త్ర దినోత్సవం వేరు. ఇది భారతీయ గణితశాస్త్ర అద్భుతం శ్రీనివాస రామానుజం జన్మదినం. మన దేశానికే పరిమితం.
 
 అంకెలు, లెక్కలు, లెక్కించడం స్పష్టతకు చిరునామా. ఇదంతా గణితం. ఇది అస్పష్టతకూ, అయోమయానికీ సుదూరం. ఇల్లాలు చేసే వంటలో కూడా గణన, లెక్కింపు ఉన్నాయి. జీతం పెరిగినపుడు, విద్యార్థి మార్కులు తెలిసినపుడు, బ్యాంకులో నగదు తీసేటపుడు, వేసేటపుడు, ఇల్లు కట్టేటపుడు, ఇల్లు మారేటపుడు లెక్కింపు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంగీతానికీ, ఛందస్సుకీ కూడా లెక్కలు ముఖ్యమే. అసలు జీవితానికీ, సమాజానికీ ఓ లెక్కుంది. వీటిని గమనించకుండా మాకు లెక్కలంటే ఇష్టంలేదనడం, ‘బోర్’ అనడం అర్థంలేని విషయం. ఈ భావన నుంచి బయటకు రావడానికి ఎడ్యుకేషనల్ గేమ్స్ (విద్యాక్రీడ) సాయపడతాయి.
 
 బాలబాలికలను విద్యాక్రీడలతో పరిచయం చేసే పని 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మొదలయింది. మార్చి 12కు ముందే గణితంలో రకరకాల పోటీలు నిర్వహిస్తారు. వాటి లక్ష్యం బాలబాలికలు. క్రీడా గుణంతో గణితాన్ని వారికి పరిచయం చేయడమే పరమోద్దేశం. గణితంలోని అనువర్తనాల విస్తృతిని పరిచయం చేయడం మరో ఉద్దేశం. ఇప్పుడు చాలా దేశాలలో ఈ సంరంభం విస్తరించింది.
 
 విద్యార్జన అనేది క్రమంగా నిరాసక్తంగా, ఆనందం కలిగించని అంశంగా మారిపోతోంది. ఈ దుస్థితిని బద్దలు కొట్టకపోతే ప్రమాదం. ఇందుకు బాలబాలికలను తప్పు పట్టడం సరికాదు. గణిత సమస్యను ఉపాధ్యాయుడు నల్లబల్ల మీద సాధిస్తాడు. కానీ అది బాలలకు అర్థం కావాలంటే తపస్సు చేయాలి. వెంటనే వచ్చే ప్రశ్న - ఇంతకష్టమెందుకు? ఇలాంటి ప్రశ్న విద్యార్థి సంధిస్తే ఉపాధ్యాయుడు జవాబు చెప్పగలిగి ఉండాలి. ఆ జవాబు కూడా విద్యార్థి అనుభవాల నుంచి రాబట్టే విధంగా ఉండాలి.
 
 గణితశాస్త్రం ప్రయోజనం ఏమిటని ఎవరైనా విద్యార్థిని లేదా పరిశోధన చేసిన విద్యావేత్తను అడిగినా స్పష్టమైన సమాధానాలు రావు. అంతేకాదు, గణితమంటే మరింత గందరగోళానికి గురి చేసే అభిప్రాయాలు వెలువడతాయి. ఈ అంశం మీద ఉన్న అభిప్రాయం అలాంటిది. దీనికి మనం పాఠ్యపుస్తకాలను, పరీక్షలను విమర్శించడం కంటె, ఇలాంటి ప్రశ్న ఎదురైనపుడు బోధకులు అనుసరించవలసిన ధోరణి మీద దృష్టి పెట్టడం అవసరం.

ఏడవ తరగతి పాఠ్య పుస్తకాలలో ఒకచోట మున్నుడిలో చక్కని వివరణ ఉంది. ‘గణితశాస్త్ర ప్రయోజనం విశ్వాంతరాళంలో వస్తువుల మధ్యదూరం లెక్కించడం’ అని స్పష్టంగా ఉంది. ఈ వాక్యంలోని నిగూఢత్వాన్నీ, విస్తృతినీ, పరిధినీ ఉపాధ్యాయుడు అందుకోవాలి. అది సాధ్యం కావాలంటే మరింత అధ్యయనం చేయాలి. కొంత సాధన చేయాలి. ఇవి వీలైనపుడు గణిత బోధన, సాధనఅలుపునివ్వని క్రీడలా కనిపిస్తుంది. విద్యార్థులు కూడా గణితాన్ని ఆస్వాదించగలుగుతారు. విశ్వంలోని పదార్థ ప్రవృత్తిని సులభంగా ఆకళింపు చేసుకోగలుగుతారు. ఎడ్యుకేషనల్ గేమ్స్ ఆశయం ఇదే.    
 (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త)
 డా॥నాగసూరి వేణుగోపాల్

మరిన్ని వార్తలు