టాగూర్‌కు తగని అనువాదం

11 Jan, 2016 01:51 IST|Sakshi
టాగూర్‌కు తగని అనువాదం

‘వెయ్యేళ్లలో స్ట్రేబర్డ్స్‌తో సరిపోల్చదగ్గ కవిత్వం రాలేదు. మళ్లీ చదివి స్పందించినందుకు అనువాదకుడికి కృతజ్ఞతలు మాత్రం చెప్పక తప్పదు’.
 
విశ్వకవి రవీంద్రుడి నిరాడంబరతను, హృదయసౌందర్యాన్ని ప్రతిఫలించే ‘స్ట్రేబర్డ్స్’ కవితా సంకలనాన్ని గతంలో చాలా మంది చైనా భాషలోకి అనువదించారు. అయితే, ఫెంగ్‌టాంగ్ తాజాగా చేసిన అనువాదం వివాదాస్పదమైంది. అది అసభ్యకరంగా ఉందనీ, మూలరచనకు దూరంగా జరిగిందనీ అక్కడి సాహితీలోకం, పత్రికాప్రపంచం విరుచుకుపడింది. ఫెంగ్‌టాంగ్ అనువాదాన్ని తూర్పారబడుతూ ‘చైనా డెయిలీ’లో రేమండ్ జో అనే రచయిత పెద్ద వ్యాసమే రాయగా, ‘పీపుల్స్ డెయిలీ’ ఏకంగా సంపాదకీయమే రాసింది. మన దేశంలో కూడా ఫెంగ్‌టాంగ్ అనువాదంపైన నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఖంగుతిన్న జిజియాంగ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ పబ్లిషింగ్ హౌస్ ఆ అనువాద ప్రతులను వెనక్కి తీసుకుంది.
 
ఫెంగ్‌టాంగ్ కలం పేరుతో రాసే జాంగ్‌హైపెంగ్(44) చైనాలో ప్రసిద్ధ నవలా రచయిత. వైద్య శాస్త్రం చదివిన ఈయన ఎంసీకిన్సే కన్సల్టెంట్‌గానూ, ప్రభుత్వ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌గానూ పనిచేసి, ఏడాది క్రితం రాజీనామా చేసి, వ్యాపారంలో స్థిరపడ్డాడు. స్ట్రేబర్డ్స్ లాంటి క్లాసిక్స్‌ను ప్రజల భాషలో సరళంగా రాస్తే బాగుంటుందని బూతులు రాశాడు. ‘ద వరల్డ్ టేక్స్ ఆఫ్ ఇట్స్ మాస్క్ ఆఫ్ వాస్ట్‌నెస్ ఫర్ ఇట్స్ లవర్’ అన్న రవీంద్రుడి మాటకు,‘ద వరల్డ్ అన్‌జిప్ప్‌డ్ హిజ్ ప్యాంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ లవర్’ అని అనువాదం చేశాడు. ఇలాంటి తప్పుడు అనువాదాల్ని పత్రికల్లో చాలా ఉదహరించారు.
 
ఒక భాషా పదానికి సరైన సమీప పదం మరో భాషలో అరుదుగా మాత్రమే లభిస్తుంది. మంచి అనువాదకులు మూలానికి ఏ పదం తగిందో ఎంపిక చేసుకుంటారు. అది వారి వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ‘తన సొంత రచనను తన సొంత బాణీలో రాసుకునే స్వేచ్ఛ ఫెంగ్‌టాంగ్‌కు ఉంది. అలాంటి రచనను ఇష్టపడే పాఠకులు కూడా ఉంటారు. అందులో తప్పు లేదు. ఇలాంటి వక్రీకరణలను మాత్రం అనువాదాలనలేం’ అని పీపుల్స్ డెయిలీ తన సంపాదకీయంలో అభిప్రాయపడింది.
 
ఇక, ఫెంగ్‌టాంగ్ అనువాదంపై రేమండ్ జో వ్యంగ్య బాణాలు సంధించాడు. ‘వైద్యశాస్త్రం చదివిన ఇతను దారి తప్పి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పొందాడు. తన మనసులో దాగి ఉన్న వాంఛ మేరకు సాహిత్యంలో నిష్ణాతుడు కావాలనుకున్నాడు. వీటన్నిటికీ తోడు అతనికి టెస్టోస్టిరోన్ ఎక్కువగా పనిచేయడం వల్లనే అసభ్యత ప్రదర్శించాడు’ అని జో రాశాడు. ‘ఫెంగ్ రాసినవి ఒక్కొక్కసారి లయాత్మకంగా ఉంటాయి. కానీ అవి అంతర్గత లయను పట్టివ్వలేవు. వెయ్యేళ్లలో స్ట్రేబర్డ్స్‌తో సరిపోల్చదగ్గ కవిత్వం రాలేదు. మళ్లీ చదివి స్పందించినందుకు అనువాదకుడికి కృతజ్ఞతలు మాత్రం చెప్పక తప్పదు’ అన్నాడు.
 
అయితే, ఫెంగ్‌టాంగ్ మాత్రం వీటికి చలించలేదు. ‘చైనా భాషను నేను చాలా బాగా వాడగలను. నాకా గట్టి నమ్మకముంది. నా అనువాదం సరైనదే. ఆ అనువాదం తనని తాను చెప్పనివ్వండి. దాని మంచి చెడులను కాలమే నిర్ణయిస్తుంది,’ అన్న ఆయన సమాధానం ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న కృష్ణశాస్త్రి మాటలను గుర్తుచేయట్లేదూ!
 రాఘవ శర్మ
 9493226180

మరిన్ని వార్తలు