దళితుల ప్రతిఘటనా పోరాట దిక్సూచి ‘కారంచేడు’

17 Jul, 2015 01:05 IST|Sakshi
- మల్లెల వెంకట్రావు

30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని సంపన్న గ్రామం కారంచేడులో మున్నంగి సువార్త అనే మాదిగ స్త్రీ ఆ ఊరి కమ్మ యువకులపై మంచినీళ్ల బిందెతో దాడిచేసింది. కారణం మాదిగ, మాల పల్లెలు మంచినీళ్లు తాగే చెరువులో ఇద్దరు కమ్మ యువకులు తమ గేదెలు కడుగుతూ, కుడితి నీళ్లను చెరువులో పోయటమే కాకుండా, ప్రశ్నించిన మున్నంగి సువార్తను, చర్నాకోలతో కొట్టారు. దాంతో ఆమె వారికి బిందెతో బుద్ధి చెప్పింది. వేలాది ఎకరాల సుసంపన్న భూములు, రాజకీయ, సినీ, వ్యాపార రంగాలలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన ప్రముఖులతో పాటు, స్వయానా అప్పటి సీఎం ఎన్.టి.రామారావు వియ్యంకుడు దగ్గుపాటి చెంచురామయ్య స్వగ్రామం అది. ఆ అహంకారమే మాదిగల మంచినీళ్ల చెరువులో గేదెలను కడిగేందుకు పురికొల్పింది.
 
 ఈ సంఘటనను కారణంగా చూపి జూలై 17, 1985న వేలాది మంది కమ్మ యువకులు బరిసెలు, గొడ్డ ళ్లు, కత్తులతో మాదిగ పల్లెపై దాడి చేశారు. స్త్రీలపై అత్యా చారాలు చేశారు. విచక్షణ లేకుండా రాక్షసంగా, క్రూరాతి క్రూరంగా వెంటపడి పాశవికంగా దాడి చేశారు. ఈ కులోన్మాద మృగాల దాడిలో దుడ్డు రమేష్, దుడ్డు వంద నం, దుడ్డు అబ్రహాం, తేళ్ల ఎహోషువా, తేళ్లమోఫే, తేళ్ల ముత్తయ్యలు నేలకొరిగారు. కారంచేడు ఘటన భారత దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. అప్పటి వరకూ హరి జనులుగా గుర్తింపు పొందిన మాల మాదిగల్ని దళితులు అని పిలవటం ప్రారంభమైంది.
 
 కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది దళితులు తమ అస్థిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్లు బిగించారు. 1989లో వచ్చిన ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అనేక అస్థిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమ స్ఫూర్తి కారణం. కారంచేడు ఉద్యమమే భారత దేశం గుండెలపై కులం ప్రశ్నను ముద్రించింది. దళితుల సమస్యలన్నింటికీ పరిష్కారం రాజ్యాధికారమే అన్న డా॥అంబేడ్కర్ వాక్కును దళితుల మెదళ్లలో నింపింది. అయితే మహత్తరమైన దళితోద్యమాన్ని నిర్వీర్యం చేసిం ది దళిత నాయకత్వం. కోట్లాది మంది దళితుల ఆశలు నెరవేర్చేందుకు దిక్కు చూపే వేగుచుక్కలా అన్యాయా న్ని, అక్రమాన్ని ఎదుర్కొనేందుకు గర్జించే కోడెవయసు సింహంలా, ఉండాల్సిన దళితోద్యమం నేడు మోడువారి పోయింది. జాతి కోసం ఒక వీరుణ్ణి తయారు చేయలేక పోయింది దళిత నాయకత్వం.
 
 ‘నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించం డి.. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్లీ మళ్లీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను!’’ అన్న కలేకూరి కవితా స్ఫూర్తి తో కారంచేడు నెత్తుటి త్యాగాలను స్మరించుకుందాం. దళితోద్యమ విజయాలను దళిత నాయకత్వానికి, విదేశీ నిధులు అడుక్కునే స్వచ్ఛంద సంస్థలకు వదిలేద్దాం. వైఫ ల్యాలకు బాధ్యత వహిద్దాం. మోడువారిన 30 సంవ త్సరాల దళితోద్యమాన్ని సమీక్షించుకుందాం. డా॥అం బేడ్కర్ ఆశయ సాధన కోసం కారంచేడు వీరుల స్ఫూర్తితో ముందుకు కదులుదాం.
 (వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, మాల మహాసభ) మొబైల్: 92913 65253

మరిన్ని వార్తలు