రెండు ఎన్నికలు - ఒకే నీతి

12 Feb, 2015 01:25 IST|Sakshi
రెండు ఎన్నికలు - ఒకే నీతి

గత సంవత్సరంగా కంటి మీద కునుకులేని చాలా చాలా పార్టీలకి కేజ్రీవాల్ విజయం ఒక ఊరట. ఆయన గెలిచినందుకు కాదు. మోదీ ఓడినందుకు. ఓటమికి ఇది ప్రారంభమని వారు గుండెల మీద చేతులు వేసుకోగలిగినందుకు.
 
గత పన్నెండు నెలల్లో కేజ్రీవాల్‌ని ఢిల్లీ ప్రజలు రెండు సార్లు ఎన్నుకున్నారు. మొదటి సారి కేవలం అవినీతిపై కేజ్రీవాల్ ఎత్తిన ధ్వజం మాత్రమే కారణమైతే, రెండో సారి ఎన్నికల్లో మిగతా పార్టీలు మోదీపై వారు ఎత్తద లచిన ధ్వజం కారణం. తృణ మూల్ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, లల్లూ ప్రసాద్, నితీశ్‌కుమార్ వంటి వారికి కేజ్రీవాల్ మీద ప్రేమ కంటే మోదీ పట్ల వ్యతిరేకత - ఇంకా తమ ఉనికి పట్ల సందిగ్ధత ఎక్కువ మొగ్గు. బాచయ్య బూచయ్యకి వ్యతిరేకి. బూచయ్యంటే నాకు సుతరామూ ఇష్టం లేదు. అందుకూ బాచయ్యంటే నాకిష్టం.
 
రాష్ట్రంలో తన ప్రతిపత్తిని కోల్పోయిన లల్లూకి, పశ్చిమ బెంగాల్‌లో నానాటికీ అవినీతి తెరలు ముసురు కుంటున్న మమతా బెనర్జీకి, స్వయంకృతాపరాధం నుంచి ఎలా బయటపడాలో తెలీని నితీశ్‌కి కేజ్రీవాల్ నీటిలో తేలే ఊతం కర్ర.
 
అయితే ఇక్కడ ఆగితే కేజ్రీవాల్‌కి అన్యాయం చేసినట్టే అవుతుంది. ‘టీ’ అమ్ముకుని జీవించిన ఓ సాదా సీదా మనిషి ఢిల్లీకి నిచ్చెన వెయ్యడమనే ‘అండర్ డాగ్’ రొమాన్స్ ఆనాడు ఆకర్షణ అయితే- గత ఏడు నెలలుగా తిరుగులేని విజయాలని మూటగట్టుకున్న ‘ఆత్మ విశ్వాసం’ దాదాపు అహంకారపు స్థాయికి చేరిన మోదీ కారణంగానే కేజ్రీవాల్ అండర్ డాగ్ అయ్యాడు. ఆరోజు మోదీ ఎన్నిక కావడానికి ముఖ్య కారణమే ఈ రోజు కేజ్రీ వాల్‌కి కొంగుబంగారం అయింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టుబడి- మోదీ.
 
ఈ దేశంలో గత సంవత్సరంగా కంటి మీద కును కులేని చాలా చాలా పార్టీలకి కేజ్రీవాల్ విజయం ఒక ఊరట. ఆయన గెలిచినందుకు కాదు. మోదీ ఓడినం దుకు. ఓటమికి ఇది ప్రారంభమని వారు గుండెల మీద చేతులు వేసుకోగలిగినందుకు. ఎనిమిది నెలల పాటు తిరుగులేని విజయాన్ని శిరస్త్రాణంలాగ ధరించి, నిరంకు శంగా నడిచిన మోదీ ‘బాడీ లాంగ్వేజ్’ వారిని హింసిం చింది. ఎట్టకేలకు మోదీ ప్రతిభ, మోదీ గ్లామర్, మోదీ దూకుడు వీగిపోయిన మధురక్షణం- చాలామందికి.
 
ఇందులో బీజేపీ స్వయంకృతాపరాధం కూడా ఉంది. తమ పార్టీకి తిరుగులేదనుకుంటే ఫరవాలేదు కాని- తక్కువ వ్యవధిలోనే సాథ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహరాజ్, ప్రవీణ్ తొగాడియా వంటివారు ఈ విజయా న్ని నెత్తికెత్తుకుని అనుచితంగా చేసిన ప్రకటనలని మోదీ ఖండించకపోవడం ద్వారా పరోక్షంగా వాటిని సమర్థిస్తు న్నట్టు కనిపించడం చాలామందిని గాయపరిచింది. నాయకత్వం పట్టించుకోని అలసత్వం నిజంగా ప్రభుత్వ ధోరణికి అద్దం పడుతోందా అన్న మీమాంస చాలా మంది ఓటర్లని బలితీసుకుంది. ఏడు దశాబ్దాల ‘సెక్యుల రిజం’ అనే ఆత్మ వంచనని ప్రాక్టీసు చేస్తున్న ఈ దే శపు పార్టీలకి ఇది అదను. అవకాశం. బీజేపీని ఎదిరించ డానికి వారి ఆయుధమూ- మతమే.
 
క్రితం ఎన్నికకీ, ఈ ఎన్నికకీ కేజ్రీవాల్ శక్తి సామ ర్థ్యాలు చరిత్ర సృష్టించేంత పెరగలేదు. అయితే ఎదిరి పక్షం బలహీనమయింది. తమ తమ ప్రయోజనాలకు మిగతా పార్టీల దొంగ దెబ్బ కలసివచ్చింది. ఇది కాదన లేని కర్ణుడి శాపం.
 
తాను చెయ్యదలచుకున్నదంతా 49 రోజుల్లోనే చేసెయ్యాలనుకున్న ఆత్రుత ఆనాడు కేజ్రీవాల్ ప్రభుత్వా న్ని రోడ్డు మీదకు ఈడిస్తే, అయిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం లో 7 నెలల అలసత్వం - దాదాపు అదే ఇబ్బందిని - సూచనగా బీజేపీకి కలిగించింది. అయితే ఇద్దరికీ రెండు అవకాశాలున్నాయి. కేజ్రీవాల్‌కి ఇప్పుడు ఐదేళ్ల పాలనా వకాశం. బీజేపీకి ఇంకా 4 సంవత్సరాల 4 నెలల అవకా శం. ఈ విధంగా ఈ అపజయం బీజేపీకి పరోక్షమయిన ఉపకారం. వేళ మించిపోకుండా కలసొచ్చిన చెంపపెట్టు.
 
ఇకముందు కేజ్రీవాల్ - ఇదివరకులాగ కాక తన పాత్రని సవరించుకోవలసి ఉంది. ఉద్యమానికీ, ఉద్యో గానికీ, నినాదానికీ, నిర్మాణానికీ బోలెడంత తేడా ఉంది (ఉద్యోగానికీ, రాజకీయానికీ చుక్కెదురని నిరూపించిన ఇద్దరు మహానుభావులు కళ్లముందున్నారు- మన్మోహన్ సింగ్, కిరణ్‌బేడీ). కాగా నిజాయితీ మంకు పట్టుదల కాకూడదు. అర్ధరాత్రి దాడులు కాకూడదు. రోడ్ల మీద ప్రభుత్వాల ధర్నా కాకూడదు.
 
ఇవన్నీ కేజ్రీవాల్‌కి ఈపాటికి అర్థమయ్యే ఉంటా యి. ముఖ్యంగా ఆయన గోడ మీద రాసుకుని గుర్తుం చుకోవలసిన విషయం ఒకటుంది. 67 సంవత్సరాలు జులుంతో, అవినీతితో, దుర్మార్గంతో, అసమర్థతతో రాజకీయ నాయకుల అరాచకంతో విసిగిపోయిన ప్రజా నీకం- రాజకీయాలతో ప్రమేయం లేని ఉద్యమకారుడిని గద్దె ఎక్కించింది. ఇది స్వతంత్ర భారతంలో చరిత్ర.
 
ఈ ఎన్నిక విజయం కాదు. ఓటరు విసుగుదలకి సంకేతం. ఒక పరీక్ష. ఒక అవకాశం. కుర్చీ ఎక్కించిన ఓటరు నిర్దాక్షిణ్యంగా దింపగలడని- కనీసం ఈ ఎన్నిక- ఈ రెండు పార్టీలనూ హెచ్చరిస్తోంది.

మరిన్ని వార్తలు