ఉక్రెయిన్ గద్దెపై ‘చాక్‌లెట్ రాజా’

28 May, 2014 01:28 IST|Sakshi
ఉక్రెయిన్ గద్దెపై ‘చాక్‌లెట్ రాజా’

ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు ‘విప్లవ పార్టీల’న్నిటి నీ చెత్తబుట్టలోకి విసిరేశారు. ఉక్రే నియన్లలో కనిపించనిదిగా చెప్పే రాజీతత్వం కలిగిన పొరొషెంకో అధ్యక్షుడు కావడం అమెరికా, రష్యాలకు గౌరవప్రదంగా ఉక్రెయిన్ చిక్కుముడి నుంచి బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది.  
 
 యూరోపియన్ నేతలకు గత ఆదివారం దుర్దినం. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ఈయూ అస్తిత్వాన్నే సవాలు చేసే పార్టీలకు భారీ ఆధిక్యతను కట్టబెట్టారు. సరిగ్గా అదే రీతిలో అదే రోజున జరిగిన ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు ‘విప్లవ పార్టీల’న్నిటినీ చెత్తబుట్టలోకి విసిరేశారు. 2005లో సీఐఏ సూత్రధారిగా సాగిన ‘ఆరెంజ్ విప్లవ’ నేత్రి, మాజీ ప్రధాని యూలియా ట్యామషెంకో నేటి ఎన్నికల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగి ఘోర పరాభవం చవి చూశారు. ఏ పార్టీకీ చెందని పెట్రో పొరొషెంకో (48) ద్వితీయ స్థానంలో నిలిచిన ఆమె కంటే నాలుగు రెట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. ఉక్రెయిన్ ఎన్నికలను ప్రజాస్వామ్య విజయంగా కీర్తిస్తున్న అమెరికా, ఈయూలు పొరొషెంకోకు పాశ్చాత్య దేశాలకు అనుకూలునిగా ఉన్న పేరును గుర్తు చేస్తున్నాయి. ఈయూలో చేరడానికే కాదు, నాటో సైనిక కూటమిలో చేరడానికి కూడా ఆయన సుముఖులని చెప్పుకుని మురుస్తున్నాయి. ఫిబ్రవరి ‘ప్రజాస్వామిక విప్లవాన్ని’ ఆయన సమర్థించారని జ్ఞప్తి చేస్తున్నాయి. అయితే   అమెరికా, ఈయూల అనధికార అభ్యర్థి ట్యామెషెంకో మాత్రం ఆయన ‘రష్యా పంచామంగ దళానికి చెందిన ద్రోహి’ అని పదే పదే ఆరోపించారు. జర్మన్ మీడియా నిస్సందేహంగా ఆయన రష్యా అనుకూలుడేనని తేల్చిపారే సింది.
 
 ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా కనిపించే పొరొషెంకో 130 కోట్ల డాలర్ల నికర ఆస్తులతో ‘ఫోర్బ్స్’ ప్రపంచ బిలియనీర్ల జాబితాకు ఎక్కారు. రష్యా, యూరప్‌లలో ఏటా 100 కోట్ల డాలర్ల అమ్మకాలు సాగించే ‘రోషెన్’ చాక్లెట్ల పరిశ్రమకు ఆయనే అధిపతి. ఉక్రెయిన్, లిథుయేనియా, రష్యా తదితర యూరోపియన్ దేశాల నగరాల్లోని చాక్లెట్ల ఫ్యాక్టరీలేగాక కార్లు, షిప్ యార్డ్‌లు తదితర రంగాలకు ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. సోవియెట్ యూనియన్ సామ్రాజ్యపు శిథిలాలే ఆయన సామ్రాజ్యానికి పునాది. తూర్పు యూరప్ ప్రైవెటైజేషన్ ఉన్మాదంతో ఊగిపోతుండగా ప్రభుత్వ ఆస్తులను, చాక్లెట్ కంపెనీలను కారు చౌకకు కోనేసి ఆయన కోట్లకు పడగలెత్తారు. ఉక్రెనియాను శాసించే గుప్పెడు మంది కుబేరుల్లో ఒకరయ్యారు. ఉక్రేనియన్లలో కనిపించనిదిగా చెప్పే రాజీతత్వం ఆయనకు వరం. ‘గాలి వాటాన్ని’ బట్టి ఎప్పుడు ఎటు ఉండాలో అప్పుడు అటే ఉండగల నేర్పు ఆయన సొంతం.
 
 కాబట్టే యుషుచెంకో ‘ఆరెంజ్ విప్లవ’ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, ఫిబ్రవరిలో పదవీచ్యుతుడైన విక్టర్ యానుకోవిచ్ ప్రభుత్వంలో వాణిజ్య, ఆర్థికాభివృద్ధి మంత్రిగా పనిచేయగలిగారు. తదుపరి ‘విప్లవ’ పక్షంలో చేరారు. రష్యాతో సంఘర్షణ, అంతర్యుద్ధ పరిస్థితుల మధ్య తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు దేశ ఐక్యత నే తప్ప మితవాద నియో నాజీ జాతీయోన్మాదాన్ని కోరుకోవడం లేదని పొరొషెంకో గ్రహించారు. ఉక్రెయిన్ ఐక్యతనే ఎన్నికల అస్త్రంగా ధరించి బరిలోకి దిగారు. మూడు నెలల్లో రష్యాతో సత్సంబంధాలను పునరుద్ధరిస్తానని వాగ్దానం చేశారు. ‘రష్యా భాగస్వామ్యంలేని ఉక్రెయిన్ సుస్థిరత లేదా ప్రాంతీయ సుస్థిరత, బహుశా ప్రపంచ సుస్థిరత అసాధ్య’మని ప్రకటించారు.జూన్‌లో రష్యాతో చర్చలు జరపనున్నట్టు గెలిచిన  వెంటనే తెలిపారు. చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ సైతం ప్రకటించారు.
 
 రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం దాదాపు శూన్యం. కానీ పొరొషెంకో వ్యాపార సామ్రాజ్యంపై రష్యా అధికారికంగా, అనధికారికంగా విధించిన ఆంక్షలు మాత్రం ఆయనను తెగ చికాకు పెడుతున్నాయి! తూర్పు ప్రాంతంలో సాగుతున్న సైనిక చర్యను నిలిపివేసే విషయంపై మాత్రం ఆయన పెదవి మెదపలేదు. ఎప్పుడు బిగబట్టాలో, ఎప్పుడు జారవిడవాలో తెలిసిన బేరగాడు పొరొషెంకో. ఆయనలాంటి రాజీవాద నేత ఎన్నిక కావడం ఇటు అమెరికా, ఈయూలకు, అటు రష్యాకు కూడా గౌరవప్రదంగా ఉక్రెయిన్ చిక్కుముడి నుంచి బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది. పొరొషెంకో శాంతి ఫార్ములా ప్రకారం పాశ్చాత్య దేశాలతో అనుబంధాన్ని కలిగి ఉండే హక్కు ఉక్రెయిన్‌కు ఉంటుంది.
 
 అలాగే  ఉక్రెయిన్, నల్ల సముద్ర ప్రాంతంలోని రష్యా వాణిజ్య, వ్యూహాత్మక ప్రయోజనాలకు, ‘సహజ హక్కులకు’ హామీని కల్పిస్తుంది. ఈయూలో చేరే విషయాన్ని 2025 నాటికి వాయిదా వేసి, నాటోలో చేరడం ఇప్పట్లో అసాధ్యమని ఆయన తేల్చేశారు! అగ్రరాజ్యాలకు, ఈయూకు ఆమోదయోగ్యమైన ఈ ఫార్ములాను జాతీయోన్మాదంతో పేట్రేగుతున్న నియో నాజీ ముఠాలు ఆమోదిస్తాయా? తూర్పు ప్రాంత ప్రజలు ఆదరిస్తారా? అనేదే ప్రశ్న. ఉక్రెయిన్ చిచ్చులో చలి కాగుతున్న అందరి నోళ్లనూ చాక్లెట్ రాజా తీపిచేయగలరా?
 - పిళ్లా వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు