రాష్ట్రపతిజీ... న్యాయం చేయండి

2 Nov, 2015 09:18 IST|Sakshi
రాష్ట్రపతిజీ... న్యాయం చేయండి

పార్లమెంట్‌లో ఏం జరిగింది -1


అయ్యా,
18.2.2014న 15వ లోక్‌సభలో, సీమాంధ్రకు చెందిన అత్యధిక ఎంపీల్ని సస్పెండ్ చేసి, టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, అన్ని నిబంధనలనూ, సభా సాంప్రదాయాల్ని తుంగలోకి తొక్కి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదించిన తీరుకు సం బంధించి, ఆనాటి లోక్‌సభ రికా ర్డులు పరిశీలిస్తే అసలీ బిల్లు చట్టబద్ధంగా ఆమోదిం చబడిందా.. అనే అనుమానం, ఎవ్వరికైనా వస్తుంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లోక్‌సభ ఏ విధంగా విభజించిందో తెలుసుకునే అవకాశం కూడా చరిత్రకు దక్కకుండా, ఆ సమయం, వీడియో రికార్డింగ్ కూడా ఆపు చేయాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించినట్లు తెలిసింది.

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఈ బిల్లును తిరస్కరించినప్పటికీ, స్వతంత్ర భారత చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా, దేశ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే తలవొంపులు తెచ్చే విధంగా, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఈ బిల్లు విషయంలో వ్యవహరించింది. సరిగ్గా ఇంకో పది రోజుల్లో దేశవ్యాప్త ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించబోతున్న సమయంలో, పదేళ్లపాలన అంతమవుతున్న ఆఖరి గడియల్లో ఇంత టి ప్రధానమైన నిర్ణయం విషయంలో అంత తొందరగా ఎందుకు వ్యవహరించాలి?

 ఎన్నికల ముందు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా ‘ఓట్ - ఆన్- అకౌంట్’ అనే తాత్కాలిక ఏర్పాటు చేసుకుని, రాబోయే కొత్త ప్రభుత్వమే బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన చేసేవాళ్లం... దేశంలోని ప్రప్రథమ భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడదీయాలనే తొందరలో ఎన్నికలు పది రోజుల్లో ప్రకటిస్తారు- కొత్త ప్రభుత్వం వస్తుంది కదా అనే ఆలోచన కూడా చేయలేదు.
 అదృష్టం ఏమిటంటే, కనీసం లోక్‌సభ ప్రొసీడింగ్స్. రిపోర్టర్లు రికార్డు చేసి  పబ్లిష్ చేసిన పుస్తకమైనా దొరికింది! దానిని కూడా రిపోర్టర్లు రికార్డు చేసింది చేసినట్లు కాకుండా మార్చేసారనుకోండి..!!
 ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి లోక్‌సభలో, ఏ రకంగా సభ నడిచిందో రికార్డులు చూస్తుంటే, ఇంతకన్నా దుర్దినం, సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనా మరొకటి ఉండదని అనిపిస్తుంది.
 బహుశా, అధికార ప్రతిపక్షాలు కలసి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ఫెడరల్ సిద్ధాంతాలకూ తిలోదకాలిచ్చేయాలనుకున్నప్పుడు, ఇలాగే జరుగుతుందేమో!

 సస్పెండ్ చేయబడిన ఎంపీలందరూ సస్పెన్షన్లు రద్దు చేయబడి సభలో కొచ్చేదాకా, సభలో పూర్తి చర్చ జరిగేదాకా ఆంధ్రప్రదేశ్ బిల్లును ఆమోదించే సమస్యే లేదని విస్పష్టంగా ప్రకటించిన బీజేపీ, ఏమయ్యిందో ఏమోగాని, ఏ చర్చా లేకుండా అన్ని విలువల్ని సూత్రాల్నీ పక్కకు పెట్టి, ఎంపీల సస్పెన్షన్లు ఉపసంహరణే కోరకుండా, అధికార పార్టీతో చేతులు కలిపి దేశంలోనే ప్రప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏకపక్షంగా విడగొట్టేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే శాసన సభ నుంచి విభజన కోరుతూ తీర్మానంగానీ లేదా దీని కోసం ఏర్పరచబడిన కమిటీ లేదా కమిషన్ సిఫార్స్ గానీ కచ్చితంగా ఉండాలనే నిబంధన సంగతే ప్రస్తావించబడలేదు. ప్రతిపక్ష నాయకు రాలైన శ్రీమతి సుష్మాస్వరాజ్, సభలోనున్న యావత్ ప్రతిపక్షమూ వ్యతిరేకిస్తున్నా బీజేపీ మాత్రం ఇచ్చిన మాటను తప్పకుండా ఉండటంకోసం ఈ బిల్లును సమర్థిస్తున్నామని ప్రకటించడం గమనార్హం. వీరు ఇచ్చేమాట అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ లేనప్పుడు మరోలాగ మారుతూ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.
 లోక్‌సభలో ఈ బిల్లు సరైన రీతిలో నడవలేదని మేమెందుకు బలంగా నమ్ము తున్నామంటే:
 అనేక సవరణలు సభ్యులచే ప్రతిపాదించబడ్డాయి.
 
 ఏ ఆ సవరణల విషయమై సభ్యులు ‘డివిజన్’ కోరారు. స్పీకర్ రూల్ 367(3) ప్రావిజో అనుసరించి ‘డివిజన్’ తిరస్కరించారు. రూల్ 367(3) ప్రావిజో ప్రకారం అనవసరంగా సభ్యులు ‘డివిజన్’ కోరుతున్నారని స్పీకర్ భావించినప్పుడు తిరస్కరించవచ్చు! 1956 తర్వాత, ఏ స్పీకరూ, సభ్యుల ప్రాథమిక హక్కు అయిన ‘డివిజన్’ తిరస్కరించటం జరగలేదు. ఎంతమంది అనుకూలమో ఎంత మంది వ్యతిరేకమో తలలు లెక్కపెడతానని స్పీకర్ అన్నప్పుడు ‘మేం గొర్రెలం కాదు.. అనుకూలం ఎందరో ప్రతికూలం ఎందరో ‘డివిజన్’ చేసి తేల్చండి’ అంటూ సౌగత్‌రాయ్ అనే సభ్యుడు కోరిన ‘ఓటింగ్’ను స్పీకర్ తిరస్కరించారు.

ఏ సౌగత్‌రాయ్ ప్రతిపాదించిన క్లాజ్ ‘7’ సవరణ విషయమై ‘డివిజన్’ వ్యతిరేకించిన స్పీకర్ సవరణ వీగిపోయిందంటూ ప్రకటించేశారు. సౌగత్‌రాయ్ పదే పదే ‘డివిజన్’ కోరుతూనే ఉన్నా, కనీసం తలలు కూడా లెక్కపెట్టకుండా స్పీకర్ ప్రక టన చేసేయటం ఏ రూలూ ఒప్పుకోదు.. ఆర్టికల్ 100ను పూర్తిగా ఉల్లంఘించే చర్య! విచిత్రంగా, ఏదో తలలు ‘లెక్కపెట్టినట్లు కథ నడిపించి, సవరణలు వీగిపో యినట్లు ప్రకటించి కొన్నిసార్లు అసలు లెక్కే పెట్టకుండా వీగిపోయినట్లు ప్రక టించి కొన్నిసార్లూ.. బిల్లు అయిపోయిం దనిపిం చేశారు. ‘లెక్కపెట్టినట్లు కథ నడిపించి’ అని ఎందుకు అన్నానంటే, నాలుగుసార్లు స్పీకర్ తలలు లెక్కపెట్టారు. అనుకూలం ఎంత మందో, వ్యతిరేకం ఎంతమందో లెక్కపెట్టి, ప్రకటించాలి. అంటే నాలుగుసార్లు అను కూలం, 4 సార్లు వ్యతిరేకం. ఎనిమిది సార్లు లెక్క పెట్టాలి. 22 నిమిషాల్లో ఎనిమిది సార్లు సభ్యులను లెక్క పెట్టారన్న మాట!!

ఏ సౌగత్‌రాయ్, అసదుద్దీన్ ఒవైసీలు ప్రతిపాదించిన ఒక సవరణకు స్పీకర్ ఎలా తలలెక్క తీసుకున్నారో గమనిస్తే.. ఎంత కంగాళీగా సభ నడిపారో అర్థమవుతుంది. వీరిద్దరూ ప్రతిపాదించిన సవరణకు తలలు లెక్క పెట్టినట్లు కథ నడిపించి, 169-0 అని ప్రకటించారు. అంటే, సౌగత్ రాయ్, ఒవైసీ కూడా తమ ప్రతిపాదనను తామే వ్యతిరేకించారన్నమాట..!
 ఏ 42వ సవరణ విషయంలో, ‘సవరణ వీగిపోయింది’ అని స్పీకర్ ప్రకటించేశారంతే.. డివిజన్ కోరుతున్నప్పటికీ, కనీసం తలలెక్క అయినా పెట్టలేదు.

 ఏ అలాగే, క్లాజ్ 8 విషయంలో, స్పీకర్ ముందు కూర్చుని స్టెనో గ్రాఫర్స్ రికార్డు చేసిన యథాతథ వాక్యాలకూ, తరువాత మార్చి కరెక్ట్ చేయబడి, ముద్రించబడిన వాక్యా లకూ చాలా తేడా వచ్చేసింది! క్లాజ్ 8 బిల్లులో భాగమవుతుందా లేదా అని స్పీకర్ ‘డివిజన్’ చేసి తలలు లెక్కపెట్టినట్లు .. 169 అనుకూలం 0 ప్రతికూలం అయినట్లు ప్రచురించారు. ఎప్పటికప్పుడు రికార్డు చేసింది యథాతథంగా ‘వెబ్‌సైట్’లో పెట్టిన దానికి ముద్రించిన ప్రొసీడింగ్స్‌కి అసలు సంబంధమే లేదు. సరిదిద్దబడని ప్రతికి, సరిదిద్ది ముద్రించిన ప్రతికి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే, ఈ విషయం అర్థమవుతుంది.

ఆశ్చర్యకరంగా, ఇదే ప్రక్రియ మళ్లీ రాజ్యసభలో పునరావృతమైంది. టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం నిలుపుదల చేయలేదంతే! లోక్‌సభలో ఏ ఒక్క సవరణా ప్రతిపాదించని బీజేపీ పార్టీ రాజ్యసభలో 20 సవరణలు ప్రతిపాదించటమే కాకుండా, ఏ ఒక్క సవరణ ఆమోదించకపోయినా బిల్లు పాసవ్వదని ప్రకటించారు కూడా, తర్వాత జరిగిన దానికీ వాళ్లన్న దానికీ పొంతనే లేదు. లోక్‌సభలో సహకరించినట్లు గానే, 20 సవరణలలో ఏ ఒక్కటీ ఆమోదించబడకపోయినా బిల్లు పాసయిపోవటానికి సహకరించారు. సీపీఐ(ఎమ్) పార్టీ, ఇతర పార్టీలు ‘డివిజన్’ కోరినా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గారు నిరాకరించారు. సభ సజావుగా లేనప్పుడు ‘డివిజన్’ జరపటానికి నిబంధనలు అంగీకరించవని ఆయన స్పష్టంగా ప్రకటిం చారు. మరి లోక్‌సభ సజావుగా లేకపోయినా తలలు ఎలా లెక్కపెట్టారో, అక్కడ వేరే రూలూ ఇక్కడ వేరే రూలూ ఎలా అమలు చేశారో తెలియదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 అనుసరించి, ఏ సభలోనైనా ‘డివిజన్’ చేయటం తప్పనిసరి... ఆ విధంగా అధికార పక్షానికి ప్రతిపక్ష బీజేపీ తోడై ఈ బిల్లు పాస్ అయ్యేలా చేసింది. భారత పార్లమెంటరీ చరిత్రలో, ‘డివిజన్’ అడుగుతున్నా ఇవ్వకుండా బిల్లు పాసయిపోయిందని ప్రకటించబడినది ఒక్క ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు మాత్రమే..!
 
ఈ ప్రక్రియ మొత్తం పరిశీలిస్తే, రాజ్యాంగాన్ని లోక్‌సభ రాజ్యసభ రూల్స్‌ని పరిగణనలోకి తీసుకోకుండా - ఎలాగోలాగ ఈ బిల్లు పాస్ చేయించాలనే ఆత్రుత స్పష్టంగా కనబడటం లేదా? సుష్మాస్వరాజ్  ‘‘సభలోనున్న యావత్ ప్రతిపక్షమూ వ్యతిరేకిస్తున్నా’ అన్న మాటల్ని బట్టి - బిల్లు పాసవటానికి కావాల్సిన మెజార్టీ లేదేమో అనిపించటంలేదా?
 ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 79లో పొందుపరచబడిన ‘పార్లమెంట్’ నిర్వచనాన్ని మీముందుంచుతున్నాను.
 
‘పార్లమెంట్ అంటే దేశాధ్యక్షుడు - కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్(రాజ్యసభ) హవుస్ ఆఫ్ పీపుల్ (లోక్‌సభ)’. పార్లమెంట్‌లో భాగమైన మీరు, భారత దేశాధ్యక్షుడి హోదాలో, నిజానిజాలు పరిశీలించి అసలు ఆంధ్రప్రదేశ్ విభజన పార్లమెంట్‌లో ఆమోదించబడిందా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆ ఆమోదం జరిగిందా అనే విషయం విచారించి అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో, రాజ్యాంగ మౌలిక పునాదులకు నష్టం జరగకుండా కాపాడమని కోరుచున్నాను. మన రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన మౌలిక విలువలను కాపాడే విధంగా, ఈ భారతదేశ రాజ్యాంగాధిపతి అయిన మీరు - తగు చర్యలు గైకొనమని ప్రార్థిస్తున్నాను.
(రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన లేఖ పూర్తి పాఠం)

 -ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com

మరిన్ని వార్తలు