నీటి సాకుతో ‘సీమ’కు వెన్నుపోటు

27 Jul, 2014 00:11 IST|Sakshi
నీటి సాకుతో ‘సీమ’కు వెన్నుపోటు

సందర్భం
 
చెన్నై, ముంబై, బెంగళూరు వంటి రాజధానులేవీ జీవనదుల పక్కన లేవు. ఆయా రాష్ట్రాలకు మధ్యలో లేవు. అంతమాత్రాన అవి గొప్ప రాజధానులుగా వెలుగొందడం లేదా? కర్నూలును రాజధానిని చేస్తే కృష్ణ, తుంగభద్ర నదుల నీటిని వినియోగించుకోవచ్చు.
 
‘మా హక్కుల్ని కోరుకోవాల్సి వస్తే చందమామను కోరుకుంటాం, నక్షత్రాలను కోరుకుంటాం, సమస్త ప్రపంచాన్నీ కోరుకుంటాం. ఎందుకంటే వాటన్నిటినీ మేం కోల్పో యాం కనుక’ - మఖ్దూం  ఒకప్పుడు  రాజధానిని కోల్పోయి న రాయలసీమ వాసులు యాభై ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు రాజధానిని కోరుకుంటున్నారు. శతాబ్ద కాలంగా అనేక అన్యాయాలకు గురైన ఈ ప్రాంత వాసులకు ఇప్పుడు రావాల్సిన రాజధానిని దక్కకుండా చేసే ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయి. శివరామకృష్ణ కమిటీ రాష్ట్రంలో చేస్తున్న పర్యటన పూర్తి కాకముందే, కమిటీ నివేదిక సమర్పించక ముందే విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అదే పాట అందుకున్నారు, నీటిపారుదల శాఖ మంత్రి దేవి నేని ఉమామహేశ్వర రావు విజయవాడలోనే తమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది.

రాజధానిని ముందే నిర్ణయిస్తే, ఈ కమిటీ వేయడం సీమ ప్రజలను వంచించడానికి కాక మరి దేనికి?అన్యాయాలకు వందేళ్లు: సీమకు జరుగుతున్న అన్యాయాల పరంపరకు వందేళ్ల చరిత్ర ఉంది. కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాల్లో 36 లక్షల ఎకరాలకు నీరందించడాని కి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మెకంజీ పథకం అమలుకాలేదు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలకు నీరందించడానికి ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో రూపొందించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును తమిళులకు నీళ్లివ్వాల్సి వస్తుందన్న సాకుతో అటకెక్కిం చారు. కృష్ణా-పెన్నార్‌కు బదులుగా నాగార్జున సాగర్‌ను నిర్మించడం వల్ల సీమకు కృష్ణా జలాలు వచ్చే అవకాశానికి శాశ్వత సమాధి కట్టినట్టయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలును రాజధానిగా చేసినా, అది మూ డేళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ ఒడంబడికలో ఇతర ఏ ఒక్క అంశమూ అమలు కాలేదు. బళ్లారిని నాటి మైసూరు రాష్ట్రానికి ఇచ్చేయడం వల్ల సీమ తుంగభద్ర నీటిపైన హక్కును కూడా కోల్పోయింది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికే రాయలసీమ, సర్కారు జిల్లాల మధ్య ఉన్న అంతరం ఇప్పుడు మరింత పెరిగిపోయింది. తెలంగాణ కన్నా రాయలసీమ ఎంతో వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ కూడా స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని వారు కోరి సాధించుకున్నారు. సర్కారు జిల్లాల వారు భద్రాచలం డివిజన్‌లోని చాలా భాగాన్ని కోరి సాధించుకున్నారు. పూర్వపు ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించారు కనుక అప్పటి రాజధాని కర్నూ లును పునరుద్ధరించాలని సీమవాసులు కోరడం తప్పా?

భూమి, నీటి లభ్యత: సీమలో ఏ జిల్లాలో చూసినా కావలసినంత భూమి లభిస్తుంది. రాయలసీమలో నీటి సమస్యను చూపించి ఇక్కడ రాజధాని రాకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుంది. చెన్నై, ముంబై, బెంగళూరు వం టి రాజధానులేవీ జీవనదుల పక్కన లేవు. ఆయా రాష్ట్రాలకు మధ్యలో లేవు. అంతమాత్రాన అవి గొప్ప రాజధానులుగా వెలుగొందడం లేదా? కర్నూలును రాజధానిగా పునరుద్ధరి స్తే అక్కడ కృష్ణ, తుంగభద్ర నదుల నీటిని వినియోగించుకోవచ్చు. సీమలో మరోచోట రాజధానిని పెట్టదలుచుకున్నా, చెన్నైకు తెలుగు గంగను తరలిస్తున్నట్టు తరలించడం పెద్ద సమస్య కాదు.

సీమపై చిన్నచూపు: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమివ్వ చూపి నా అంతా సర్కారు జిల్లాలకే అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. చెన్నై నుంచి విశాఖ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అని, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ కూడా సర్కారు జిల్లాలకేనని చెప్పేస్తున్నారు. రాయల సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత వాసులు ఆలస్యంగానైనా గ్రహించారు. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. సీమలో రాజధానిని ఏర్పాటు చేయని పక్షంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని కూడా పిలుపు నిస్తున్నారు. తెలంగాణ విడిపోతే ఎప్పటికైనా ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాక తప్పదని శ్రీకృష్ణ కమిటీ హెచ్చరించడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) రాఘవ శర్మ
 
 

whatsapp channel

మరిన్ని వార్తలు