అవిభక్త కవలలు-విభక్త కవలలు

14 Feb, 2015 01:25 IST|Sakshi
అవిభక్త కవలలు-విభక్త కవలలు

మొత్తం మీద ఈ చీలు సర్కార్లు కొన్నిసార్లు ద్వైతంగా, అప్పుడప్పుడు అద్వైతంగా ప్రవర్తిస్తున్నాయి. కేంద్రంతో ముడిపడిన సందర్భాల్లో విశిష్టాద్వైతం కనిపిస్తోంది.
 
వీణ వాణి అవిభక్త కవల లుగా పుట్టినప్పటి నుంచి వార్తల్లో ఉన్నారు. తల తప్ప మిగిలిన భాగాలన్నీ విడివిడి గానే ఉంటాయి. ఈ కవలలు తెలంగాణ బిడ్డలు. సరిగ్గా కేసీఆర్ తెలంగాణ ఉద్యమా నికి ఎంత వయసో వీరికీ అంతే! మొన్ననే లండన్ నుం చి వచ్చిన వైద్యనిపుణులు పరీక్షలన్నీ చేసి శస్త్రచికిత్స చేస్తామన్నారు. ఎనభై శాతం విజయవంతం అవుతుం ది. ఏవన్నా ఎదురుచూడని సమస్యలొస్తే ఇరవై శాతం అపజయానికి ఆస్కారం ఉందన్నారు. ఆపరేషన్‌కి అయ్యే కోట్లాది వ్యయం తెలంగాణ ప్రభుత్వమే భరి స్తానంది.
 
విశాలాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరించిన పుడు అది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోవలోకి వచ్చింది. మా అమ్మ ‘‘తెలుగు తల్లి’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీలాక తెలుగు తల్లి అవశేషంలోకి వెళ్లింది. సశేషంలోకి వేరే తల్లి వచ్చింది. అప్పట్లో రెండు తలలు కలిసి ఉండి మెదళ్లు ఏకాండిగా పెనవేసుకు పెరిగాయి. అప్పటి అధి ష్టానం హడావుడిగా శస్త్రచికిత్సకు పూనుకుంది. బొత్తిగా వ్యవధిలేక పరశురాముడి బాణీలో గండ్ర గొడ్డలి దెబ్బ తో రెండు ముక్కలు చేసి, గొడ్డలి భుజాన వేసుకు వెళ్లిపో యింది.  

దాంతో అతి సున్నితంగా ఉండే మెదడు అస్త వ్యస్తమైపోయింది. ఆలోచనలన్నీ మెదడులోనే కదా పుడ తాయి. దురద పుడితే గోక్కోమనే సూచన దగ్గర్నించి అనంత కోట్ల విలువైన స్కామ్‌లకు పునాదులు మెదడు లోనే కదా పడేది. గొడ్డలి దెబ్బకి చెదిరిపోయి కొన్ని నరాలు అక్రమంగానూ కొన్ని సక్రమంగానూ పనిచేస్తు న్నాయి. ఉద్యోగుల జీతాల పెంపు, డీజిల్ పెట్రో ధరల పెంపు, ఇసుక అమ్మకాలు, లిక్కర్ అమ్మకాల పెంపు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, దాష్టీకపు ప్రసంగాలు లాంటివి రెండు తుంపుల్లోంచి ఒకలాగే వినిపిస్తున్నాయి.
 
మొత్తం మీద ఈ చీలు సర్కార్లు కొన్నిసార్లు ద్వైతం గా, అప్పుడప్పుడు అద్వైతంగా ప్రవర్తిస్తున్నాయి. కేం ద్రంతో ముడిపడిన సందర్భాల్లో విశిష్టాద్వైతం కనిపిస్తోంది. అడవుల్లో కొన్నిసార్లు కొన్నిచోట్ల కొన్ని పచ్చటి తీగెలు కలగాపులగంగా అల్లుకుపోతాయి. అప్పుడు ఏ తీగెకు ఏ పువ్వు పూసిందో తెలియదు. ఆ అల్లాయ్ బల్లాయ్‌లో ఒక్కోసారి జన్యుమార్పిడి జరిగిపోయి, తీగెల పూలరంగులు పోలికలు మారిపోతాయి. అడవి మల్లెలు ఎరుపెక్కుతాయి.

తీగెమందారం తెల్లబడుతుం ది! ఇది ప్రకృతి సహజం. కాని ఈ వ్యవహారం వేరు. ‘‘మదారుగాని బండి, సలారు గాని ఎద్దులు, బుడెన్ సాబ్ కందెన - కట్టరా దీన్ని కొండల్లో అన్నట్టు’’, అంటే బండికి కావల్సిన ఏ దినుసూ సరిగ్గాలేదు.. అయినా మనదేం పోయిందని కట్టేసి కొండ ఎక్కించారు ఆ నాటి ఘనులు. కాని వీణ వాణిల వైద్య నిపుణులు తమ అను భవాన్ని, పరిజ్ఞానాన్ని మేళవించి బాధ్యతాయుతంగా విడదీసే క్రమాన్ని చెప్పారు. ఏడాది పాటు దశల వారీగా పెనవేసుకున్న మెదడుని విడదీస్తామన్నారు.

ఈ సమ స్యని కూడా నేత శిల్పి పడుగు పోసినంత సుకుమారం గా, ఒక్క పోగు కూడా మెలిక పడకుండా చూడాలి. పడు గుని క్రమపద్ధతిలో చుట్టి మగ్గం మీదకు ఎక్కిస్తే తర్వాత పేకాడించడం సుగమం అవుతుంది. అప్పుడిక ఎంసెట్ సమస్య ఇట్టే సాల్వ్ అవుతుంది. కృష్ణా గోదావరి జలాల వివాదం ఉండదు. కుడి కాల్వ ఎండిపోవడం, ఎడమ గట్టు మండి పడటం ఉండదు. విద్యుత్తు సక్రమంగా దామాషా ప్రకారం ప్రవహిస్తుంది. భిన్నత్వంలో ఏక త్వంగా క్రమబద్ధీకరించిన ఆంధ్ర తెలంగాణ మెదళ్లు పనిచేస్తాయి. అపస్వరాల నిలయాలుగా ఉన్న అవశేష సశేష రాష్ట్రాలు అర్ధనారీస్వరం అవుతుంది!

- (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు