పేదలు, దళిత, ఆదివాసులను దగా చేసిన కేంద్ర బడ్జెట్

2 Mar, 2015 00:50 IST|Sakshi

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ బడ్జెట్‌ను ఎంతో గొప్పగా చెబుతున్నప్పటికీ, విశ్లేషించి చూస్తే సంక్షేమంపై వేటు వేసి కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించే దిశగా సాగింది. మొత్తం బడ్జెట్ రూ.17,77,477 కోట్లు కాగా ఇందులో ప్రణాళికా వ్యయం రూ.4,65,277 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.17,415 కోట్లు తక్కువ. 2014-15 ప్రణాళికా వ్యయం రూ.5,75,000 కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో ప్రణా ళిక వ్యయం రూ.1,09,723 కోట్లు తగ్గింది. గత బడ్జెట్లో ప్రణాళికా వ్యయం 32 శాతంగా ఉండగా, ఇప్పుడది మన దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 26.17 శాతానికి పడిపోయింది. దీని వలన సంక్షేమ కార్య క్రమాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడు తుంది.
 
 ప్రత్యేకించి బడుగు, బలహీన వర్గాలకు నిధుల కోత వలన అభివృద్ధిలో అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ  ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా రోడ్ సౌకర్యం లేని ఆవాస ప్రాంతాలు 1,78,000 వరకు మనదేశంలో ఉన్నాయి. విద్యుత్ వెలుగులు లేని గ్రామాలు 20 వేలకు పైమాటే. రైతుల ఆత్మహత్యలు ఆపేలా విశ్వాసం కలిగించే చర్యలు లేకపోగా, సంక్షోభంలో ఉన్న వ్యవ సాయ రంగాన్ని ఆదుకునే చర్యలు పెద్దగా లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులతో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చేస్తున్న పథకాలకు కేంద్రం నిధులు కుదించే ప్రతిపాదనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల వాటా పెంచుకోమని ప్రతిపాదించింది.
 
 ఈ బడ్జెట్‌లో ఎస్సీల అభివృద్ధికి రూ.30,851 కోట్లు, ఎస్టీల అభి వృద్ధికి రూ.19,980 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయిం పుల కన్నా తక్కువ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను జనాభా ప్రాతిపది కన ఎస్సీలకు 16.60 చొప్పున రూ.77,235 కోట్లు, ఎస్టీలకు 8.6 శాతం చొప్పున రూ.40,014 కోట్లు చేయాల్సి ఉండగా, ఎస్టీలకు  కేవలం 6.63 శాతం, ఎస్టీలకు 4.29 శాతం కేటాయించి మోసం చేసింది కేంద్ర ప్రభు త్వం. మొత్తం ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ నిధులు రూ.1,17,249 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం 50,831 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే రూ.66,418 కోట్లు వీరికి న్యాయంగా దక్కాల్సినవి నిరాకరిం చారు.  ఎస్సీలకు 60 శాతం నిధులు నిరాకరించగా, ఎస్టీలకు 53 శాతం నిధులను నిరాకరించారు.
 
 2014-15 బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.43,208 కోట్లు కేటాయిం చగా, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.26,714 కోట్లు కేటాయించారు. కనీసం అరకొరగా కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టకపోగా, దారిమళ్లిస్తున్నారు. భారతదేశంలో దారిద్య్ర రేఖకు దిగు వన ఉన్న వారిలో దళితులు, ఆదివాసులే అత్యధికం. వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ సంవ త్సరం బీజేపీ ప్రభుత్వం దళితులకు, ఆదివాసులకు ‘‘అచ్చే దిన్’’ చూపిస్తుందని ఆశించిన వారికి నిరుత్సాహం మిగిల్చారు. ఒక అంచనా ప్రకారం గత 30 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్‌ల ద్వారా రావాల్సిన రూ. ఐదు లక్షల కోట్లను దారిమళ్లించింది.
 
 దళిత ఆదివాసుల పిల్లలు పౌష్టికాహార లోపంతో అకాల మర ణాల పాలవుతున్నారు. బాలింతల, శిశు మరణాలు ఈ వర్గాలలో ఎక్కువగా నమోదవుతున్నాయి.  వారి కోసం ఏర్పాటైన అంగన్‌వాడీలు ప్రమాణాలు లేక కునారిల్లుతున్నాయి. వీటిని సంస్కరించాల్సిన ప్రభు త్వాలు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ బడ్జెట్‌లో కూడా మోదీ ప్రభుత్వం కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు ఈ బడ్జెట్‌లో కార్పొరేట్లకు కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించి ఆ వర్గాలను సంతోష పెట్టే ప్రతిపాదనలు చేసింది. 2004-2014 మధ్యలో యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్ కంపె నీలకు, పారిశ్రామిక వర్గాలకు దాదాపు 35 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చింది. అలాగే నేటి మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్ల రూపాయల రాయితీలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసింది. అత్యధిక జనాభా కలిగిన పేద వర్గాల అభివృద్ధికి జరగాల్సినంత కృషి జరగలేదు. కనీసం వారికి అందాల్సిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు.
- ఆంజనేయులు మద్దులూరి  
 సామాజిక కార్యకర్త, మొబైల్: 80190 70080

మరిన్ని వార్తలు