ధనస్వామ్యంలో ఓడిన ఓటరు !

21 May, 2014 01:02 IST|Sakshi
ధనస్వామ్యంలో ఓడిన ఓటరు !

ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు.
 
 ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. కాదు నరేంద్ర మోడీ గెలిచారు.... కాదు ఆర్‌ఎస్‌ఎస్ గెలిచింది. ఆ పార్టీ అగ్రనాయకులు మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆశ్రయించారు. అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ సొంతంగా మెజారిటీ సీట్లు గెలవడం దేశ చరిత్రలో ఇది మొదటిసారి కాదు. రాజీవ్ గాంధీ 1984 ఎన్నికల్లోనే 400 సీట్లుపైనే గెలుచుకున్నారు. సామాన్య ప్రజలకు ముందుంది ముసళ్లపండుగ. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్లూ, వాటికి చెందిన మీడియా సంస్థలూ మోడీకి పల్లకీ మోశాయి. మన దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో ఉన్నాయి.
 
 ‘ధనమూలమిదం జగత్’ అన్నట్టు దేశంలో వీరి హవా జోరుగా నడుస్తోంది. ఇప్పుడు మోడీ గెలుపు వీరికీ, అధికార పగ్గాలు చేపట్టబోతున్న మోడీకీ అండగా నిలుస్తుంది. కాదు, శాసిస్తుంది. సామాన్యులను కాటేస్తుంది. ప్రధాని గద్దెమీద కూర్చుంటేనే నాలుగు రొట్టె ముక్కలు విసురుతాడు. అంతే. కాబోయే ప్రధానికి ఒక హెచ్చరిక. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు. కాంగ్రెస్ పీడ వదిలిందని మురిసిపోవద్దు. కార్పొరేట్-మోడీ ఉచ్చు బిగియబోతోంది.
 
 జాతీయస్థాయిలో ఇది ప్రధాన అంశమైతే, రాష్ట్రంలో టీడీపీతో నువ్వానేనా అన్న స్థాయిలో హోరాహోరీగా పోరాడి 67 అసెంబ్లీ స్థానాల్లో  వైఎస్‌ఆర్‌సీపీ సాధించిన విజయం ముఖ్యమైన పరిణామంగానే భావించాలి. గత రెండు మూడేళ్లలో ప్రజా సమూహాల్లో ఈదుకుంటూ వచ్చిన పార్టీకి ఈ సమూహాలను ఓటింగ్ కేంద్రాలకు తీసుకొని రాగలిగిన పార్టీ యంత్రాంగం లేదు. అంతేకాదు ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్న అనుభవం వైఎస్‌ఆర్‌సీపీకి లేదు. నా దృష్టిలో చంద్రబాబు విజయం కన్నా జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు గొప్పది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పోల్చితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ మెరుగైన ఫలితాలు సాధించడం బట్టి గ్రామాల్లో ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని స్పష్టమవుతోంది.
 
 ఇక్కడ 1983 ఎన్నికల గురించి ప్రస్తావించాలి. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్‌టీ రామారావు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పార్టీ యంత్రాంగం, కిందిస్థాయిలో పనిచే సే కార్యకర్తలు, పోటీకి అవసరమయ్యే నిధులు లేకుండానే సినిమా ఇమేజ్‌తో అఖండ విజయం సాధించారు. జగన్‌కు రాజశేఖరరెడ్డి ఇమేజ్ ఉండబట్టే తొలిరౌండ్ రాష్ట్ర పర్యటనలోనే జనం కుప్పతెప్పలుగా సభలకు హాజరయ్యారు. ఆ నేపథ్యమే ప్రస్తుత విజయాలకు పునాది. ఇక్కడ ఏ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయో విశ్లేషించుకోవాలి.
 
 ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. 2013-14 కన్నా 2014-15లో దేశ పరిస్థితి మరింత క్లిష్టతరమవుతుంది. సామాన్యుడి ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణమవుతుంది. కార్పొరేట్లు మరింతగా లాభాలు దండుకుంటారు.
 
 కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఓడిపోయిందంటే అది స్వయంకృతాపరాధమే. దానికి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ నేరుగా బాధ్యత వహించాలి. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి ఆమే కారణం. మన్మోహన్ సింగ్ సౌమ్యతను అవకాశంగా తీసుకుని, ఆయన్ని కీలుబొమ్మ ప్రధానిగా మార్చి అధికారాలన్నీ చెలాయించి బొక్కబోర్లా పడ్డారు. రాష్ట్రాన్ని విభజించవొద్దని ప్రజానీకం తిరగబడినా కాదని విడదీసి, తన పార్టీని సీమాంధ్రలో తుడిచిపెట్టేశారు. ఇక తెలంగాణలో ఆ పార్టీ కుంటి గుర్రమే. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారంటే విచారించేవారెవరూ లేరు. సోనియా దేశాన్నే ముంచేస్తే, మన్మోహన్ దేశాన్ని అమెరికాకు పాదాక్రాంతం చేశారు.
 
 ఇవి ఎన్నికలు కావు. ఇదో ఓట్ల మార్కెట్. డబ్బు పంచిపెట్టడంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమశ్రేణిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పార్టీలు తెలుగు ప్రజలు తలవొంచుకునేటట్లు చేశాయంటే అందుకు విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టిన పార్టీలే బాధ్యత వహించాలి. అసలీ ధోరణిని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయే. మొట్టమొదట 1952లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రధాన ప్రత్యర్థులు. అప్పట్లో కొన్ని గ్రామాల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేస్తారని అనుమానించినవారిని పోలింగ్ రోజున బందెలదొడ్లో బంధించి  ఓటింగ్ పూర్తయిన తర్వాత విడిచిపెట్టారు. భూస్వాములు కొంతమందిని భయపెట్టి ఓట్లు వేయకుండా నిరోధించారు. ఇంతచేసినా, కమ్యూనిస్టులే కాంగ్రెస్ కన్నా ఒక సీటు అధికంగా గెలిచారు.
 
 ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి స్త్రీలకు వెండి కుంకుమ భరిణెలు, జాకెట్ గుడ్డలు పంచారు. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో గూండాలను గూడేలపై ప్రయోగించడం, అక్కడక్కడ సారా సరఫరా, గూడెం పెద్దను నయానోభయానో లొంగదీసుకొని మొత్తం గూడెంలో ఉండే ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. ఈ చర్యల లక్ష్యం ఒక్కటే. వారి ఓట్లు కమ్యూనిస్టులకు పడకుండా చేయడమే. ఎన్నికల్లో డబ్బు వెదజల్లడం చిన్నగా ప్రారంభమై నేడు ఈ స్థాయికి చేరింది. డబ్బు ఖర్చుపెట్టి అధికారాన్ని కొనుక్కోవడం, లేదా అధికారంలో కొనసాగడం నేడు మనం చూస్తున్నామంటే దానికి కాంగ్రెస్ వేసిన పునాదే కారణం. జనం డబ్బు పుచ్చుకొన్న ఓటర్లు ఏ పార్టీ ఇచ్చిందో దానికే ఓటు వేశారంటే అది వారి నిజాయితీకి చిహ్నం. కాని నాయకులో? ప్రచారంలో ఎన్నో వాగ్దానాలు చేసి తీరా ఏరు దాటాక బోడిమల్లయ్య అన్న తరహాలో ప్రవర్తించే నేతలు సామాన్య ఓటర్ల కాలిగోటికి కూడా సరిరారు.
 
 ఇక జయాపజయాల విషయానికి వస్తే... కాంగ్రెస్‌ను ప్రజలు ఏడు నిలువుల లోతు పాతిపెడతారని అందరూ అనుకొన్న మాటే. కాంగ్రెస్ ఓటమిని ముందే పసిగట్టిన పాలకపార్టీ నేతలు కొంతమంది టీడీపీలోకి, మరికొంతమంది వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గెలుస్తానని నమ్మకం లేదు. ఆ విశ్వాసమే కనక ఉంటే అంతకముందుదాకా ఆయన ఎడాపెడా విమర్శించిన బీజేపీతో ఎందుకు చేతులు కలిపారు? కార్పొరేట్ల చేతుల్లో ఉన్న మీడియా మోడీకి బ్రహ్మరథం పడుతుంటే ఇదే అదనుగా భావించి ఆయన కూడా గోడదూకి, మోడీ గెలిచి ప్రధాని అయితే తన రొట్టె కూడా నేతిలో పడుతుందని భావించారు. అంతేకాదు బీజేపీకి పడే ఓట్లు తమ పార్టీకీ పడతాయని ఆశించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు పడ్డాయంటే అది ఆయనంటే, ఆయన తొమ్మిదేళ్ల పాలనంటే మోజుపడి కాదు. ఆ ఓటు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు పరిపాలన చూసిన తర్వాత రెండు సాధారణ(2004,2009) ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని తిరస్కరించి వైఎస్‌కే పట్టంగట్టారని గుర్తుంచుకోవాలి.
 
 ఈ ఎన్నికల్లోనే కాదు, మొదటి ఎన్నికల నాటి నుంచి ఏ పార్టీలో చూసినా ప్రచారం, పరిపాలన వ్యక్తుల చుట్టూనే పరిభ్రమిస్తోందిగానీ, పా ర్టీల చుట్టూ, విధానాల చుట్టూ కాదు. నెహ్రూ పాలించినంతకాలం మహాత్మాగాంధీ పేరుతో ప్రచారం జరిగింది. తర్వాత గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే వంశపారంపర్యంగా, వ్యక్తుల ఆధ్వర్యంలోనే ప్రచారం, పాలన కొనసాగింది. ఈ జాడ్యం ఇతర పార్టీలకూ సోకింది. పార్టీ అధ్యక్షులు నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు. ప్రధానులు, సీఎంలే సమస్తం అయ్యారు. ఇదెంత అనారోగ్యకర పరిణామమో మోడీని చూస్తే తెలుస్తుంది.    
- (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
 వి.హనుమంతరావు

మరిన్ని వార్తలు