‘యుద్ధం’ అమెరికా నైతిక హక్కు!

3 Sep, 2013 00:21 IST|Sakshi
‘యుద్ధం’ అమెరికా నైతిక హక్కు!
యుద్ధాన్ని ప్రారంభించడం లో అమెరికా చరిత్ర, గొప్ప యూరోపియన్ రాజ్యాల ప్రమాణాలతో పోలిస్తే ఏమంత ఘనమైనదేమీ కాదు. 20వ శతాబ్దాన్ని నిర్వచించే మైలు రాళ్లలాంటి మూడు ప్రపంచ యుద్ధాల (ప్రచ్ఛన్న యుద్ధాన్ని కలుపుకుని) నడుమ అది తారట్లాడిందే తప్ప, ముందుకు గంతువేసింది లేదు. అమెరికాను రెండు ప్రపంచ యుద్ధాలలోకి దించడానికి బ్రిటన్ దాన్ని బాగానే అనునయించాల్సి వచ్చింది. జర్మన్ల మహా మూర్ఖత్వం సైతం అందుకు అవసరమైందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 
 
ఇక ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిజాన్ని ఎదుర్కోవడంపై అమెరికా మరింత ఎక్కువ శ్రద్ధను కనబరచింది. అయితే  నాటో కూటమికి, సోవియట్ యూనియన్‌కు మధ్య ఇనుప తెరను నిర్మించిన ఖ్యాతి మాత్రం విన్‌స్టన్ చర్చిల్ కంటే హెన్రీ ట్రూమన్‌కే ఎక్కువగా దక్కుతుంది. కమ్యూనిజం భయం అమెరికాను కొరియా యుద్ధంలోకి దించింది. ఆ యుద్ధం ఆగిందేగానీ ఇంకా ముగియలేదు. ఇక వియత్నాం యుద్ధం వియత్నాం షరతులకు లోబడే ముగిసింది.  అమెరికన్ ఉలిపికట్టెవాదానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నిటిలోకీ అత్యంత ఉత్తమమైనది మాత్రం అనిశ్చితే. యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందే యుద్ధాన్ని ముగించడం గురించి అమెరికా ఆందోళన చెందడం సమంజసమే. యూరప్ సాగించిన వలసవాద యుద్ధాలకు నిరుత్సాహకరమైన స్పష్టత ఉంది. వాటి లక్ష్యం అధికారంలో ఉన్న సామ్రాజ్యాలను కూలదోయడం, ఆ స్థానంలో రాజప్రతినిధులను లేదా విధేయులైన మహారాజాలు, నవాబులు, షాలు, అమీర్‌లను ప్రతిష్ఠించడం. వాటికి భిన్నంగా ధార్మిక యుద్ధాలు లేదా కోరుకున్న భావజాలం కోసం చేసే యుద్ధాల లక్ష్యం ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికంటే మరింత మెరుగైనదిగా మార్చడం. అలాంటి యుద్ధాల లోతు కొలవగలిగేదీ కాదు, అవి ఎలా సాగుతాయనేది నిర్ణయించగలిగేదీ కాదు. ఎందుకంటే అలాంటి యుద్ధాల్లో ఒక కాలాతీతమైన ప్రశ్నను ఎదురోవాల్సి వస్తుంది: మెరుగైనది అంటే ఖచ్చితంగా ఏది? వాస్తవానికి ఆ సంఘర్షణ మెరుగైన దానిని వాయిదా వేస్తుందా? లేక త్వరితం చేస్తుందా? 
 
 ప్రచ్ఛన్న యుద్ధంతో అమెరికా మరింత ఎక్కువగా స్వతంత్ర దురాక్రమణశీలిగా మారింది. 9/11 న్యూయార్క్ ఉగ్రవాద దాడుల తదుపరి అమెరికా దురాక్రమణ తత్వాన్ని తన నైతిక హక్కుగా భావిస్తుండటం అర్థం చేసుకోగలిగేదే. విశాలమైన అర్థంలో ముస్లిం ప్రపంచంగా పిలుచుకునే ప్రాంతం నుంచి తనకు ముప్పు ఉన్నదని భావించినప్పుడల్లా అది ఆ నైతిక హక్కును ప్రదర్శిస్తోంది. ఇంతకుమునుపెన్నడూ ఏ సంప్రదాయక సంఘర్షణలోనూ చూడనంతటి భీకరంగా అమెరికా నేడు అజ్ఞాత ఇస్లామిక్ మిలిటెన్సీని వెంటాడుతోంది. ఆ అజ్ఞాత మిలి టెన్సీ నీడల్లోంచే న్యూయార్క్ జంట టవర్లపై దాడులు జరగడం అందుకు కారణం. ఇది మితిమీరిన మారణాయుధ ప్రయోగానికి, పౌర మరణాలకు, ప్రజాస్వామిక నాగరికతకు అత్యంత మౌలిక ప్రాతిపదికగా ఉండే భావాలకు తీవ్ర హాని కలగడానికి దారి తీసింది. ఇది అతి తక్కువగా యుద్ధ ఖైదీలను పట్టుకునే యుద్ధం. ప్రాణాలతో మిగిల్చినవాళ్లను గ్వాంటనామాకు పంపుతారు. మరణమే అంతకంటే నయం కావచ్చు.
 
వెర్రిపట్టినట్టుగా అదే పనిగా శత్రువుల కోసం అన్వేషించే అమెరికాను ఎదిరించే ప్రభుత్వాలు లేదా దాని దారికి అడ్డువచ్చిన ప్రభుత్వాలు తమకు ముప్పును కొనితెచ్చుకోడానికి సిద్ధపడే ఆ పని చేయాలి. జాతీయవాదం, సామాజిక ఐక్యత, తమను తాము రక్షించుకుంటూ, అమెరికా దురాక్రణను నివారించగుకోగల శక్తిసామర్థ్యాలు వంటి విషయాలలో అవి అసాధారణమైన భద్రతను చేపట్టడం ఆవశ్యకం. అయితే అమెరికా తప్పులు చేసింది. వాటిలోకెల్లా శిఖరాయమానమైనది ఇరాక్. అంతటి భారీ విధ్వంసం లేకుండానే అది దాన్ని దారికి తెచ్చుకోగలిగేది. అమెరికా అత్యాధునిక రాజధాని నగరంలో మనకు తారసపడే పలువురితో పోలిస్తే జార్జి డబ్ల్యూ బుష్ ఏమంత ప్రతిభాపాటవాలు కలవారేమీ కాదు. పైగా ఆయన చుట్టూ ఉన్నవాళ్లు అంతకన్నా అసమర్థులు. సద్దాం హుస్సేన్ ప్రభుత్వ దుర్భలతను ఖచ్చితంగానే అంచనా వేసినా, ఆయన ఇరాకీ ప్రజలను మాత్రం చాలా తప్పుగా అంచనా వేశారు.  ప్రపంచ భౌగోళిక వ్యూహాత్మక పటంపై ఇరాక్ ఇప్పుడు మబ్బులాంటి అస్పష్ట ప్రాంతంగా మారింది.  ఎక్కువ యుద్ధాలను అంతం చేసిగాక, ఎక్కువ యుద్ధాలను ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న వ్యక్తిగా బరాక్ ఒబామా చరిత్రలో నిలిచిపోతారు. అయినా అయన బుష్ కారు. 9/11 దుమారం ఒబామాను వెన్నంటే ఉంది. 
 
అది ఆయనకూ తెలుసు. అది, అగ్రరాజ్యపు నౌకల ప్రయాణానికి దోహదపడేదే తప్ప, స్వదేశంలోని సొంత బలగాలపై విరుచుకుపడి, విధ్వంసం కలుగజేసే టైఫూన్ కాదని కూడా ఆయనకు రూఢిగా తెలుసు. నావికా బలాలను దాడికి అనువైన స్థానాలలో మోహరింపజేసిన తర్వాత వెనక్కుతగ్గడమంటే స్వదేశంలో తన ప్రతిష్టకు పూడ్చుకోలేని దెబ్బతగలడమేనని సైతం ఆయనకు తెలుసు. గందరగోళం కూడా ఒక సమస్యేనని గుర్తించగలిగేపాటి తెలివితేటలు ఒబామాకు ఉన్నాయి. అయితే ఆయనకు ముందటి అధ్యక్షుడు బుష్ గందరగోళంలో అవకాశం దాగి ఉన్నదని విశ్వసించేవారు. సిరియాలో తన లక్ష్యాలేమిటో ఒబామాకు తెలుసు. అయితే వాటిని సాధించాలంటే ప్రజాభిప్రాయం అనుమతించే పరిమిత యుద్ధం సరిపోదని సైతం ఆయన గుర్తించారు. 
 
అసద్ కుటుంబీకులు డమాస్కస్ వీడిపోవడం ఒబామాకు కావాలి. అయితే అందుకోసం అమెరికా సైన్యం అక్కడ కాలుమోపడం అవసరం. కలగూరగంపలాంటి, ప్రమాదకరమైన తిరుగుబాటు ముఠాలు అమెరికా నియంత్రణకు గానీ లేదా ప్రాంతీయ శక్తులైన  టర్కీ, సౌదీ అరేబియా వంటి ప్రాంతీయ శక్తుల నియంత్రణకుగానీ లోబడే బాపతు కాదు. యుద్ధం కాకపోతే అమెరికాకు ఎంచుకోడానికి ఉన్న అత్యుత్తమ అవకాశం సిరియా ఆయుధ పాటవాన్ని క్షీణింపజేయడం, దాని కాల్బలాల నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడం, యుద్ధ సన్నద్ధమై ఉన్న దాని మిత్రపక్షం హిజ్బుల్లాను దెబ్బతీయడం. చివరిగానే అయినా ప్రాధాన్యంలేనిదేమీ కాని మరోపని కూడా ఉంది. అది- సిరియాకు సైనిక మిత్రులుగా రష్యా, ఇరాన్‌లకున్న పరిమితులు బట్టబయలయ్యేట్టు చేయడం. ఇరాన్, రష్యాలు చేయగలిగినదల్లా గర్జించడం మాత్రమే. కాబట్టి అమెరికా తాను పంపదలుచుకున్న సందేశాన్ని పంపినట్టవుతుంది. 
 
ఇరాన్, రష్యాలు స్పందించడానికి తమకు అనువైన సమయాన్ని, వారాలు లేదా నెలల్లో ఎంచుకోగలుగుతాయనేదే ఇందులో ఇమిడి ఉన్న ప్రమాదం. ఇరాన్‌కు, దాని షియా మిత్రులకు వ్యతిరేకంగా సున్నీ గగనతలాన్ని సంఘటిత పరుచుకోవడం కోసం సౌదీ అరేబియా... సిరియాలోని బషర్ అల్ అసద్ వ్యతిరేక పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. కాబట్టి రష్యా, సిరియా గగనతలాన్ని ఉపయోగించుకొని సౌదీ అరేబియాపై ప్రతీకార చర్యకు దిగవచ్చు. 9/11 ఉగ్రవాదదాడులు తీవ్రవాద సున్నీల కుట్రే. అయినాగానీ సౌదీ నేతృత్వంలో సాగుతున్న ఈ సున్నీ వ్యూహానికి అమెరికా కట్టుబడి ఉండటం ఆసక్తికరం. ఇక ఇరాన్, తర్కరహితమైన అవకాశాలను ఎంచుకునేలా దాన్ని ప్రోత్సహించడం ఒక విరోధాభాస. అస్థిరత ఆవరించిన ఆ ప్రాంతంలో ఇరాన్ సుస్థిరత అనేది అమెరికన్ వ్యూహకర్తలకు ఆందోళన కలిగిస్తూనే ఉండి ఉండాలి. సంక్లిష్టమైనదానికంటే సుపరిచితమైనదే మేలని అమెరికా  ఎంచుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంపై 2014, ఆగస్టులో సెమినార్లు జోరుగా చోటుచేసుకోబోతున్నాయి. సిరియా, మధ్యప్రాచ్యాలను నేటికీ యుద్ధాలను ప్రేరేపించే విధంగా మార్చినది ఆ యుద్ధమే. ఇంకా ముగియని ఆ యుద్ధపు శతవార్షికోత్సవాలకు ఒక క్షిపణి ప్రయోగం నాంది పలుకుతుంది. అంతకంటే ఇంకా కొత్తది ఏముంది?
 
 బైలైన్
 ఎం.జె.అక్బర్,సీనియర్ సంపాదకులు
మరిన్ని వార్తలు