నీటియుద్ధాలే రేపటి నిజం

5 Oct, 2013 00:51 IST|Sakshi
నీటియుద్ధాలే రేపటి నిజం
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ మధ్యన నదీ జలాల గురించి పత్రికల వారి సమావేశంలో మా ట్లాడారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఈ చర్చ అవసరాన్ని మరింత స్ప ష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగినా నీటి కోసం ఎలాంటి యుద్ధాలు, వివాదాలు తలెత్తబో వని మంత్రి మాటల సారాంశం. తెలంగాణవాదులు కూడా ఇదే చెప్పారు. మంత్రివర్యులు తన మీడియా ప్రసంగంలో కృష్ణా-గోదావరి పరీవాహక ప్రాంతాలకు చెందిన కేటాయింపుల వివరాలు కూడా అందించారు.
 
 మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం - ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్న వారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెంతైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవసాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
 
ఈ గణాంకాలన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి బచావత్ ట్రిబ్యునల్ స్థానంలో  వచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేయబోయే నీటి కేటాయింపుల వల్ల జరిగే అనర్థాలు. రెండవది, మిగులు జలాలకు సంబంధించినది. తెలంగాణవాదులు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న అంశం-నీటి దోపిడి. 
 
తెలంగాణవాదుల ఆరోపణ ప్రకారం, మిగులు జలాలతో కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. కాగా, జూరాల నుంచి హైదరాబాద్‌కు నీటిని తెచ్చుకునే ఉద్దేశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం కూడా ఇందులో ఉంది. మొన్న పాలమూరులో జరిగిన బీజేపీ సభలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడటం జరిగింది. అంటే సముద్రాన్ని హైదరాబాద్‌కు తెస్తాం అనే ధోరణి ఈ అభిప్రాయాలలో ప్రతిబింబిస్తున్నది. అయినా మన మంత్రివర్యులకు ఇవేమీ కనిపించలేదు. వీటిని బట్టి మనం అర్థం చేసు కోవలసినది - నీటి యుద్ధాలు పొంచి ఉన్నాయి. అంటే మహబుబ్‌నగర్-కర్నూలు జిల్లాలలో వియ్యంకుల మధ్య, మొగుడు-పెండ్లాల మధ్య, అన్నా-చెల్లెళ్ల మధ్య, బావ - బావమరుదుల మధ్య నీటి యుద్ధాలు జరగడం అనివా ర్యంగా కనిపిస్తోంది. నిజానికి విభజనవాదులు మొదట వాదించిన తీరు ఇదే, నీటి యుద్ధాలు జరుగుతాయనే. ఇప్పుడు మాత్రం జరగవంటున్నారు. దీనిలో పరమార్ధ మేమిటో వారే చెప్పాలి.
 
 బ్రిజేష్ కుమార్ కొత్త ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల లో జరిగే అనర్థాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే సమాచారం అందుతోంది. బచావత్ ట్రిబ్యునల్ 78 సంవత్సరాల వరద నీటిని పరిగణనలోనికి తీసుకుంది. దీనిలో మంచి వర్షాల కాలం, తక్కువ వర్షాల కాలం రెండు ఉన్నాయి. అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 47 సంవత్సరాల వరద నీటిని తీసుకుంటే, అది మంచి వర్షాల కాలం మాత్రమే. అంటే తక్కువ వర్షాల కాలాన్ని తీసుకో లేదన్న మాట. దీని ద్వారా నీటి లభ్యతను పెంచి పంచడం జరిగింది. అదేగాక 75 శాతం ప్రాబబిలిటి కాకుండా 65 శాతం ప్రాబబిలిటిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా కూడా లభ్యత నీటిని పెంచడం జరిగింది. అంటే ఈ నీటి లభ్యత గణాంకాలలో చాలా మార్పులు చోటుచేసు కున్నాయి. కుడి పక్కన ఉన్న పట్టికలో ఆ మార్పుల తీరును చూడవచ్చు.
 
 దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి? బ్రిజేష్, అంతకు ముందు నియమించిన బచావత్ కమిటీల మధ్య వ్యత్యాసం ప్రకారం సగటున (మంచి వర్షాలు - తక్కువ వర్షాలు నమోదైన సంవత్సరాల ప్రకారం) మన రాష్ట్రానికి కేటాయించిన నీరు 100 సంవత్సరాలలో 55 సంవత్సరాలు మాత్రమే రావటం జరుగుతుంది. అదే తక్కువ వర్షాల సంవత్సరాల ప్రకారం చూస్తే 40 నుంచి 45 సంవత్సరాల కంటే తక్కువ. అంతేకాదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే కొత్త అనుమతుల (ఆలమట్టి ఎత్తు పెంచడం, మహారాష్ట్రలో విద్యుత్ ప్లాంటులకు నీరు, చట్ట వ్యతిరేకంగా నిర్మించుకున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించడం, వగైరాల) వల్ల ఈ సగటు నీటి లభ్యత 55 శాతం నుంచి 40 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. 
 
 అదే తక్కువ వర్షాల కాలంలో ఇది 30 శాతానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మనం ఇక్కడ ముఖ్యంగా గమ నించాల్సిన విషయం-ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్నవారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత రాజకీయ నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెం తైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవ సాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
డాక్టర్ సజ్జల జీవానందరెడ్డి
మరిన్ని వార్తలు