ప్రగతి పేరు, ప్రకృతితో పోరు

27 Sep, 2016 01:31 IST|Sakshi
ప్రగతి పేరు, ప్రకృతితో పోరు

పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని విధ్వంసానికి అసలు కారణం ఏమిటి? విధ్వంసంలో కూడా ‘ప్రగతినీ/అభివృద్ధి’నీ చూడగల్గినది సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. ప్రసిద్ధ పర్యావరణ శాస్త్ర పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడు బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారైపోయింది.’
 
 ‘వాదనలు ఎన్నిరకాలైనా వినిపించవచ్చు గాక! కానీ, బహుకొద్దిగానే ఉన్న దేశ అపురూపమైన వనరులనూ, ప్రకృతి వనరులనూ; అంతే స్థాయిలో ఉన్న నిధులనూ అదుపుగా, పొదుపుగా ఆచితూచి వినియోగించుకోగల జీవన శైలికి ప్రభుత్వాలూ, పౌరులూ అలవాటు పడకపోతే భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకం కాకతప్పదు.’
 - గౌతమ్ భాటియా (ప్రసిద్ధ వాస్తుశాస్త్రవేత్త, శిల్పకారుడు)
 
 వాన ఎక్కువైతే రొంపి కరువు, వాన తక్కువైతే వరపు కరువని శతాబ్దాల అనుభవం. తమ అవసరాల కొద్దీ మానవులు, అధికార తాపత్రయంతో ప్రభుత్వాలు అపురూపమైన ప్రకృతి వనరుల మీద శక్తికి మించి ఆధిపత్యం నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత ఉధృతంగా వికటిస్తుందో ఇంతకు ముందు చూశాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. ప్రత్యక్షంగా అనుభవి స్తున్నాం. గతంలో ఎన్నడూ ఎరుగని ప్రకృతి వైపరీత్యం దూసుకువచ్చి లక్షలాది ప్రాణాలను తోడుకుపోయిన ఉదంతాలు కూడా మన ఇరుగు పొరు గున, ఆసియా ఖండంలోనూ (అండమాన్, తమిళనాడు; ఇండోనీసియా) చూశాం.
 
 ఎప్పటివారో తెలియదు కానీ కాకరపర్తి కృష్ణశాస్త్రి ‘ప్రళయ సంరంభం’ శీర్షికతో రాసిన కవితలో సునామీ జలఖడ్గాన్ని స్వయంగా చూశారా అన్న రీతిలో, అనూహ్యమైన శైలితో, ‘భీకర లీల లేచి అతివేల జవం బున వచ్చి/ దుస్సహమై ధరముంచి’ అని రాశారు. ప్రకృతి వైపరీత్యాలకు మారుపేర్లుగా గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి భీకర దృశ్యాలు వాతావరణంలో కనిపించి ప్రజలను అతలాకుతలం చేశాయి. ఎల్-నినో (దుర్భిక్షానికి), లా నినో (అతివర్షానికి) మరింత విధ్వంసంతో కూడిన వైపరీ త్యాలుగా నమోదైనాయి. ఇవి రుతువులను తారుమారు చేశాయి. విభజనకు నిరసన అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలను గత రెండువారాలుగా నూరేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు ముంచెత్తాయి.
 
 వేలాది ఎకరాలలో పంటలు నాశనమైనాయి. వానకన్నా ముందు ఆకస్మిక వరదలు వచ్చి (కొన్నేళ్ల నాటి కర్నూలు విధ్వంసం మాదిరిగా) నగరాలను, పట్టణాలను ధ్వంసం చే శాయి. ఇప్పట్లో పూరించలేని స్థాయిలో నష్టం కలిగించాయి. వాణిజ్యం స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికలను సైతం అవహేళన చేస్తున్నట్టు ఈ వైపరీత్యం విరుచుకుపడింది. కానీ ఒకటి... గతంలో కన్నా, ప్రస్తుతం ఉన్న మెరుగైన సాంకేతిక వ్యవస్థ చాలావరకు జననష్టాన్ని నివారించడానికి ఆస్కారం కల్పిం చింది. సకాలంలో అప్రమత్తం చేయగల సాంకేతిక వ్యవస్థ ఉన్నప్పటికీ, ముందు చూపులేని నాయకులు మాత్రం సరైన సమయంలో స్పందించ డంలో విఫలమైనారు. పేదలు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రతిసారి దారుణంగా నష్టపోతోంది. నిజానికి పాలకుల ఈ తరహా చండితనానికి మరో ప్రధాన కారణం ఉంది.
 
 పాలకులకూ కావాలి ఆ స్పృహ
 పర్యావరణ సమతౌల్యం ఘోరంగా దెబ్బతిన్న ప్రాంతాలలో భారత్ 13వ స్థానంలో ఉన్నదని శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలు ఘోషిస్తున్నాయి. సముద్ర గర్భంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం గతంలో విశ్వ వ్యాప్తంగా భూతలం మీద పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి తగిన సాక్ష్యాలు దొరికాయని లండన్‌లోని జాతీయ సాగర పరి శోధన కేంద్రం వెల్లడించింది. హిమనదాలుగా నిరంతరం తమ ఉనికిని కాపా డుకునే ధృవప్రాంతాలను ఆవరించి ఉండే ఆర్కిటిక్ ప్రాంత శీతల స్థితి కూడా అదుపు తప్పి, అక్కడ వాతావరణం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. భూగర్భంలో శీతల స్థితిని అంచనా కట్టేందుకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అంశాలకు పూర్తి స్పృహ పాలకులకు కూడా ఉండాలి. అప్పుడే ప్రకృతి వైపరీత్యాల వేళ స్పందించవలసిన విధంగా స్పందించ గలుగుతారు. సమర్థ పాలకునిగా, ఉన్నతాధికారిగా, ఇంజనీర్‌గా సేవలు అందించిశాశ్వత కీర్తిని పొందిన సర్ ఆర్థర్ కాటన్‌ను గోదావరి జిల్లాల ప్రజలు నాటికీ నేటికీ వివాహాది శుభకార్యాలలో ‘కాటనాయ నమః’ అంటూ పూజిస్తారు. కాని ఈ ఆధునిక భగీరథుడిని (కాటన్‌ను) కరువు కాటకాలొస్తే ప్రజలు చస్తే చస్తారు, పరాయి దేశంలో ప్రజల కోసం ఎందుకు అంత ఖర్చు చేయవలసి వచ్చిందో సంజాయిషీ ఇవ్వమని లండన్ కోర్టు ముందుకు బ్రిటీష్ వలస పాలకులు ఈడ్చారు.
 
 దానికి  కాటన్ సమాధానం - ‘కరువు కాటకాలతో చనిపోతున్న ప్రజలకు మనం ఆనకట్టలు, రిజర్వాయర్ల ద్వారా జలధారలు అందజేస్తే మన పాలనలోని ప్రజలను రక్షించుకోవడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయానికి ఆదాయం పెరుగుతుంద’ని బుద్ధిచెప్పి వచ్చాడు. ఈ స్ఫూర్తి ఇప్పటి కొందరు మన పాలకులకు లేదు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్న సామెత అవినీతిలో కూరుకుపోయిన నేటి కొందరు పాల కులకు, కొందరు ఇంజనీర్లు, మరికొందరు కాంట్రాక్టర్లకు వర్తించినంతగా మరెవరికీ వర్తించదు. కనుకనే కాటన్ సహా కొందరు ప్రజా ప్రయోజనాల స్పృహకల్గిన పాలకులు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాంటి హేమాహేమీ ఇంజనీర్లు వివిధ చిన్న జలమార్గాల అనుసంధానం ద్వారా కాల్వల ద్వారా రవాణా వ్యవస్థను పెంపొందించి, స్థిర పరచడానికి కృషి చేశారు.
 
 ఫలితంగా 1890ల నాటికే గోదావరి, కృష్ణల నదీ వ్యవస్థతో బకింగ్‌హామ్ కెనాల్‌కు వంకలు, వాగుల్ని కూడా అనుసంధానించి, ఆంధ్రలోని కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురందాకా, 450 మైళ్ల పర్యంతం జలమార్గాన్ని సుస్థిరం చేశారు. ఈ వరసలోనే కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో బకింగ్‌హామ్ కెనాల్ సహా పెక్కు కాల్వలను కలపడానికి ఆ తరువాత కాలంలో ప్రయత్నం జరిగింది. ఈ బకింగ్ కెనాల్ చరిత్ర కాలగతిలో ‘గత జలసేతు బంధనం’గా ముగిసిపోకుండా ఉండి ఉంటే, సెకనుకు 5,600 క్యూబిక్ అడుగుల నీటిని బట్వాడా చేయగల శక్తిగల బకింగ్‌హామ్ ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వరద ముంపునుంచి రక్షించుకుని ఉండే పని అని పాల్ హైలాండ్ రాసిన ‘ఇండియన్ బామ్’ పుస్తకం వెల్లడిస్తోంది (హిందూ, 5-12-2015).
 
 నిజాం కాలం ప్రాజెక్టులు
 పాలనా వ్యవస్థలో అవినీతి అంతర్భాగమైనప్పుడు జలమార్గాల వ్యవస్థ నిర్వహణలోనూ, కట్టడాలలోనూ చోటు చేసుకుంటుంది. కాని నిరంకుశ నిజాం పాలనలో రిజర్వాయర్ల నిర్మాణంలోనే కాదు, కనీసం మురుగునీటి పారుదలకు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన తీరు గమనించాల్సిందే. అలాంటి పథకం లేనందుననే ప్రస్తుతం నగరాలను, పట్టణాలను ముంచెత్తుతున్న వానలు, వరదలతో డ్రైనేజీ వ్యవస్థకు నవరంధ్రాలు మూసేసినట్టయింది. ఉపరితలంలోనే మురుగు పారుదలయ్యేట్టు స్వతంత్ర భారత పాలకులు వ్యవస్థను నిర్మించినందున మొత్తం డ్రైనేజీ పారుదల నిర్మాణ పథకం లోప భూయిష్టంగా తయారై నగర శోభ కూడా మారు రూపు తొడిగింది.
 
  ఇటీవల భారీ వరదలకు ఇబ్బందులపాలైన హైదరాబాద్ నగరంలో, కొన్ని రోజులనాడు మొజంజాహి మార్కెట్ పొడవునా, పబ్లిక్ గార్డెన్స్ వద్ద (తెలుగు విశ్వవిద్యాలయం లైన్‌లో) తవ్వకాలు జరుగుతున్నప్పుడు  నిజాం నాటి మురుగునీటి, వర్షపునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి  నిర్మించిన కట్టడం పది అడుగుల లోతున కన్పించింది. భూమిని పరీక్షించే సమయంలో అది కన్పించలేదు. మెట్రో రైలు నిర్మాణంలో భారీ దిమ్మలకు అవసరమైన పునాదుల తవ్వకంలో ఆ నిర్మాణ రహస్యం బయల్పడింది.
 
 అందుకే అంత లోతుగా డ్రైన్ పైప్‌లైన్‌ను పది అడుగుల లోతున వేస్తారని అనుకోలేదని మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి ఆశ్చర్యం  వెలిబుచ్చారు. ‘ఆ పైప్‌లైన్ సుందరమైన నిర్మాణం’ అని కూడా కితాబు ఇచ్చారు. ఆశ్చర్యమే మంటే ఇందుకు సంబంధించిన పటాలుగానీ, డ్రాయింగ్స్‌గానీ జి.హెచ్. ఎం.సి. దగ్గర, మున్సిపల్ వాటర్ బోర్డు వద్ద లభించక పోవటం. ఇదే సమయంలో ‘హైటెక్ సిటీ’ నిర్మాణం తన గొప్పేనని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతాచేసి అదే హైటెక్ సిటీకి కీలకమైన భూగర్భ (అండర్ గ్రౌడ్) డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేకపోయాడని మరవరాదు. ఆధు నిక పాలకులు ‘ప్రగతి/అభ్యుదయం’ చాటున సహజ వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నందుననే ప్రకృతి ఎదురుదాడికి దిగవలసివస్తోంది.
 
 దెబ్బతిన్న సమతౌల్యంతో ఇక్కట్లు
 పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని ఈ విధ్వం సానికి అసలు కారణం ఏమై ఉంటుంది? విధ్వంసంలో కూడా ‘ప్రగతిని/ అభివృద్ధి’నీ చూడగల్గిన ఏకైక వ్యవస్థ సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. పర్యావరణ శాస్త్ర ప్రసిద్ధ పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడైన బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారై పోయింది’’ (‘ది వల్నరబుల్ ప్లానెట్: 1999 న్యూయార్క్). అంత కన్నా నిశితంగా, కారల్‌మార్క్స్ సహచరుడైన ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఈ పరిణామం గురించి 150 ఏళ్ల క్రితమే ఇలా హెచ్చరించాడు: ‘ఆసియా మైనర్, మెసపటోమియా, గ్రీస్ తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు సాగుకు లాయకైన భూముల్ని పొందేందుకు అటవీభూముల్ని ధ్వంసం చేశారేగాని, ఈ పని మూలంగా భూమిలో తేమను సంరక్షించగల రిజర్వాయర్లు, అడవులకీ పరి రక్షణా కేంద్రాలనీ గుర్తించలేకపోయారు.

అలాగే, ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు పర్వత సానువుల నుంచి నిరంతరం జాలువారే ఊటలను కాపాడు కోలేక పోతామని వారు గుర్తించలేక పోతున్నారు. ఫలితంగా, వర్షాకాలాల్లో మైదాన ప్రాంతాల్ని ముంచెత్తే భారీ వరదల్ని నిరోధించలేక పోతున్నారు. ఆ విధంగా విదేశాలలోని ప్రజల్ని జయించి  పెత్తనం చెలాయించే పరాయి వాడిలా మనం ప్రకృతిపట్ల వ్యవహరించరాదు!
 abkprasad2006@yahoo.co.in
  ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

మరిన్ని వార్తలు