గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ?

19 Nov, 2014 01:05 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి నాలుగురోడ్ల కూడలిలో నిలబడినట్లుంది. ఏ  దిశగా, ఏ వేగంతో వెళ్లాలన్నది త్వరితంగా నిర్ణయించుకోవాల్సిన విషయం. అడ్డగోలు విభజన పరిణామాల్ని దిగమింగుకుని భవిష్య త్తుపై దృష్టిసారించాల్సిన సమయమిది. ముఖ్యంగా పాలకులు దూర దృష్టితో, విశాల దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడాలి తప్ప ఇతరేతర ఒత్తిడులకు తావివ్వరాదు. అన్ని ప్రాంతాలవారూ అభివృద్ధిలో తమకూ సమప్రాధాన్యత దక్కిన ట్లు  భావించినప్పుడే ఒక జాతిగా ముందడుగు వెయ్యగలం. ఆ భావన ఆదినుండే పాదుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికను వెల్లడి చేశారు.

 

విద్యాసంస్థల ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటు తదితర విషయాల్ని వివరంగా ప్రజల ముందుంచారు. అందులో విజయనగరం జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడమన్నది ఒకటి. జిల్లా ప్రజలకు ఈ హామీ ఎంతో భరోసానిచ్చింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అలాంటి ఉన్నత విద్యాకేంద్రం అవసరమన్నది నాలుగు దశాబ్దాల కల. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా అందుబాటులో ఉండే ఈ వర్సిటీ ఏర్పాటు వల్ల పున రావాస సమస్యలూ తక్కువే. ఆరోగ్య, జీవన ప్రమాణాల స్థాయిని తెలిపే సూచీల్లో అట్టడుగున ఉన్న విజయనగరం జిల్లాకి ఈ విశ్వవిద్యా లయం ఏర్పాటు ఎంతో కొంత అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంలో ఏర్పాటు కాకపోవచ్చని, విశాఖ జిల్లాలో సబ్బవరం మైదాన ప్రాంతంలో దాని ఏర్పాటుకు అవకాశం ఉందని పత్రికలకు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని రకాలా అనువైన ప్రాంతాన్ని, ఆదివాసులకు అందుబాటులో ఉన్న స్థలాన్ని, పైగా ప్రభుత్వ ప్రణాళికలో భాగమైన హామీని ఉపేక్షించి, వేరే ఆలోచన చెయ్యడం విజయనగర జిల్లా వాసుల్ని నిరాశపర్చింది. గిరిజన సంఘాలూ ప్రజాప్రతినిధులూ, వివిధ సంస్థలు తమ తీవ్ర వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహా వ్యతిరేక భావనల్ని ప్రభుత్వం చేజేతులా కొని తెచ్చుకోరాదు. ఏ ప్రాంత ప్రజలకూ తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావం కలుగకుండా పాలకులే శ్రద్ధ వహించాలి. ఎలాంటి ఒత్తిడులకూ లోబడని దృఢవైఖరితోనే రాష్ట్ర సంక్షేమ సమగ్ర అభివృద్ధి సాధ్యం.
 
 డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ,
 పార్వతీపురం, విజయనగరం జిల్లా

మరిన్ని వార్తలు