కల్యాణలక్ష్మికి ప్రాచుర్యమేది?

10 Aug, 2015 01:22 IST|Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా  ప్రారంభించిన బంగారు తల్లి పథకంలో భాగంగా అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాలకు పెళ్లి చేసుకునే సమయంలో ప్రభుత్వం నుండి కొద్దిమేర ఆర్థిక సహాయం లభించేది. రాష్ట్రాల విభజనతో తెలంగాణలో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడి పాత పథకాలను రద్దు చేసి కొన్ని కులాలకే పరిమితమయ్యే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. రూ.2,00,00 ఆదాయం లోపు ఉన్న పేద వర్గాలకు మైనార్టీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు రూ.51,116లు నజరానాగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు  కానీ, ఈ పథకానికి సరైన ఆదరణ లభించడంలేదు. వేల మంది దరఖాస్తు చేసుకున్నా సరైన సమయంలో వారికి అందడంలేదు. కొందరి ‘0’ బ్యాలెన్స్ ఖాతాలకు ఇవి పడటంలేదు.

సేవింగ్ ఖాతాలున్న వారికే ఈ స్కీం వర్తిస్తుందని అధికారులు మెలికలు పెడుతున్నారు. బడ్జెట్‌లో ఈ పథకానికి డబ్బులు కేటాయించినా శాఖల నిర్వాహకులు, అధికారుల మధ్య సమన్వయం లేక ఈ పథకానికి కేటాయించిన డబ్బులు మురిగిపోతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పథకానికి సరైన అధికారులను కేటాయించి, దరఖాస్తు చేసుకున్న వారికి సరైన సమయంలో డబ్బులు అందేలా ఈ పథకాన్ని అన్ని కులాల పేద వర్గాలకు విస్తరించేలా, ఈ పథకాన్ని అన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే ఈ పథకానికి సరైన అవకాశం ఇచ్చినట్లవుతుంది.
 -    జైని రాజేశ్వర్‌గుప్త  కాప్రా, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు