ధర్మపీఠానికి నిండుదనమెప్పుడో!

21 Aug, 2014 02:54 IST|Sakshi
ధర్మపీఠానికి నిండుదనమెప్పుడో!

ఇందులో చాలా అంశాలను ఎందరో న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు.  న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయవ్యవస్థకు పరిమితం చేయకుండా, ప్రభుత్వానికి ఇందులో చోటు కల్పించడం, సమాజ ప్రతినిధులుగా ఇద్దరు ప్రసిద్ధులను నియమించడం కీలకమైన మార్పే.
 
ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఎవరు నియమించాలి? ఈ విషయం చర్చోపచర్చలకు దారి తీస్తూనే ఉంది. పై న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం విధానాన్ని సమూలంగా మార్చాలనీ, ఇందుకు రాజ్యాంగాన్ని మరొకసారి సవరించాలనీ కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభ, రాజ్యసభ  ఆమోదించాయి. దేశంలో సగానికి పైగా శాసనసభలు కూడా ఆమోదిస్తే ఆ సవరణ అమలులోకి వస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయం చెప్పా లంటే న్యాయమూర్తులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ముఖ్యం. ఎవరు తమను నియమించినా న్యాయమూర్తులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి.

న్యాయమూర్తుల నియామక సూత్రాలు రాజ్యాంగంలో ఉన్నాయి. జిల్లా కోర్టులలో నియామకాలు ఆయా రాష్ట్రాల హైకోర్టుల ద్వారా జరుగుతాయి. మూడు రకాల వారిని ఆ పదవులలో నియమిస్తారు. 1. జిల్లా స్థాయి న్యాయాధికారుల నుంచి కొం దరు అనుభవజ్ఞులు, సమర్థులు హైకోర్టుకు ఎంపికవుతారు. 2. పదేళ్ల అనుభవం ఉండి; ఉత్తములు, సమర్థులు అనుకున్న న్యాయవాదులను నేరుగా హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేసేందుకు రాజ్యాంగం అవకాశం ఇస్తున్నది. 3. న్యాయవాదు లుగా, న్యాయాధికారులుగా పని చేయకపోయినా ప్రతిభావంతు డైన న్యాయవేత్తను (జూరిస్ట్)సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియ మించే వీలు కల్పించారు. ఇది హైకోర్టుకు వర్తించదు.
 
న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులను నియమించడానికి భారీగా కృషి చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి ఈ ‘కృషి’ అర్థం కూడా మారుతూ ఉంటుంది. ప్రతిభ, సమర్థత, సమగ్రత వంటి అర్హతలకు క్రమంగా ప్రాధాన్యం తగ్గి, ఇతర అంశాలకు ప్రాధాన్యం పెరిగిపోయిందని పెద్దలు వాపోవడం గమనిస్తూ ఉంటాం. ఇందులో నిజానిజాలను  పరిశోధిం చడానికీ, సర్వే చేయడానికి ఎవరూ ముందుకు రారు. న్యాయవ్యవస్థలో లేని వారు కూడా అధ్యయనం చేసి, న్యాయమూర్తుల పనితీరును విమర్శించి, వారి స్థాయి ఇది అని తేల్చడానికి శాస్త్రీయమైన ప్రయత్నాలు చేయరు. చేసినా ఎవరూ మెచ్చరు. పైగా కోపం వస్తే కోర్టు ధిక్కారం కింద ఆ ప్రయత్నం చేసిన వారిని కటకటాల వెనక్కి నెట్టే అవకాశాలు కూడా ఎక్కువే.
 
సమ్మతా? సిఫారసా?
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి అ నేక మార్పులు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి సలహా తరువాత రాష్ట్రపతి ఇతర న్యాయమూర్తులను నియమించాలి. ఇక్కడ సలహా అంటే సమ్మతి అని అర్థం చేసుకోవాలి. దీని మీదే అనేక వాదోపవాదాలు జరిగాయి. సలహా అంటే సమ్మతి అని, ఎందుకంటే  స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది ఎవరి సలహా, లేదా సమ్మతి? ఇందుకు సమాధానంగా వచ్చినదే కొలీజియం. ప్రధాన న్యాయ మూర్తి సహా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు కలిసి కొలీజియంగా ఏర్పడి, న్యాయమూర్తి పదవులకు అభ్యర్థుల పేర్లను, పూర్వాపరాలను చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి దానినే తమ సలహాగా లేదా సిఫారసుగా అది ప్రభుత్వానికి పంపుతోంది.
 
ఈ న్యాయసూత్రాలన్నీ ఎలా ఉన్నా, న్యాయ మూర్తులుగా ఎంపిక కావడానికి కొందరు న్యాయవాదులు తమ తమ దారులు వెతుక్కుంటున్నారన్న విమర్శ ఉంది. వారు న్యాయాధీశులవుతు న్నారు కూడా. దారీతెన్నూ తోచని వారు న్యాయవాదులుగానే మిగిలిపోతు న్నారు. అలా అని ప్రాక్టీసు లేని న్యాయవాదులే న్యాయమూర్తులు అవుతున్నా రని చెప్పడం సరికాదు. న్యాయ వితరణాధికారం దైవికమని భావించేవారూ ఉన్నారు. వారి సంఖ్య తగ్గుతున్నది.
 
కొలీజియం స్థానంలో కమిషన్
ఇప్పుడు శాసనసభల ముందుకు వస్తున్న న్యాయమూర్తుల నియామకం బిల్లులో మార్పుల కంటే, చేర్పులు ఎక్కువ. కొలీజియంకు బదులు జాతీయ న్యాయమూర్తుల నియామక సంస్థ (కమిషన్) ఏర్పాటు చేయాలన్నది ఈ బిల్లు ఆశయం. ఆ కమిషన్‌కు ప్రధాన న్యాయమూర్తి  పదవి రీత్యా (ఎక్స్ అఫీ షియో) అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూ ర్తులు ఇద్దరు, ప్రసిద్ధులైన ఇద్దరు వ్యక్తులు, న్యాయశాఖ మంత్రి ఇతర సభ్యు లు. ఇద్దరు ప్రసిద్ధులలో ఒకరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లేదా మహిళ ఉండాలన్న నియమం ఉంది.

భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత కలిసి ప్రసిద్ధ వ్యక్తులను ఎంపిక చేస్తారు. వీరు మూడేళ్లు నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ సభ్యులుగా ఉంటారు. పునర్‌నియామకం ఉండదు. ప్రధాన న్యాయమూర్తి పదవికి అర్హుడని భావిస్తే,  అందరికంటే సీని యర్ అయిన న్యాయమూర్తిని ఆ పదవికి కమిషన్ సిఫారసు చేయాలని చట్టం నిర్దేశించింది. రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తుల నియామకంలో సీనియారిటీ మాత్రమే కాక, సమర్థత, ప్రతిభ, సమగ్రతలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ప్రతిపాదిం చారు. ఈ మేరకు రాజ్యాంగం 124, 217 అధికరణలను సవరించారు.
 
నియామకాలలో జాప్యంతో ప్రమాదం
న్యాయమూర్తుల నియామకాలలో జరుగుతున్న జాప్యం వల్ల తలెత్తుతున్న పరిణామాలను ఈ బిల్లు పరిగణనలోనికి తీసుకోవడం శుభపరిణామం. మూడు సందర్భాలలో న్యాయమూర్తుల కేసుల ద్వారా సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల నియామకంలో ప్రభుత్వం ప్రమేయం తగ్గిపోయింది. దీనితో ఈ ఖాళీలను పూరించే బాధ్యతను న్యాయవ్యవస్థ తీసుకోవలసివచ్చింది. న్యాయ మూర్తుల పదవులను వెంటవెంటనే పూరించకపోవడం వల్ల కేసుల భారం పెరిగిపోయింది. నిజానికి న్యాయమూర్తులు ఎప్పుడు పదవీ విరమణ చేస్తారో ముందే తెలుస్తుంది. ఆ ఖాళీలను ఆరు నెలల ముందే తెలుసుకుని భర్తీ చేయవలసిన అవసరాన్ని ఈ బిల్లు ద్వారా గుర్తించారు. ఈ ఖాళీలను ఆరు నెలల ముందే గుర్తించవలసిన బాధ్యతను కమిషన్‌కు అప్పగించారు. మరణాలు, రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను నెలలోగా నోటిఫై చేసి భర్తీ చేయాలని కూడా చట్టం నిర్దేశిస్తున్నది.
 
వాస్తవికమైన పరిష్కారమేనా?
ఎవరినైనా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించమంటూ సూచించే ముం దు ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి అభిప్రాయాలను కమిషన్ స్వీకరించాలి. ఒక అభ్యర్థిని కమిషన్‌లో ఏ ఇద్దరు సభ్యులు తిరస్కరించినా నియామకం సాధ్యం కాదు. ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఒక అభ్యర్థి సమర్థుడని భావించినప్పటికీ, ప్రధాని, న్యాయశాఖ మంత్రి తిరస్కరించవచ్చు. అంతా ఒప్పుకున్నా,  ఇద్దరు ప్రసిద్ధులు కాదన్నా అభ్యర్థికి నిరాశ తప్పదు. ఈ విధానంతో అసలు న్యాయమూర్తుల నియామకం సాధ్య మేనా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇందులో చాలా అంశాలను ఎందరో న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయవ్యవస్థకు పరిమితం చేయకుండా, ప్రభుత్వానికి ఇందులో చోటు కల్పించడం, సమాజ ప్రతినిధులుగా ఇద్దరు ప్రసిద్ధులను నియమించడం కీల కమైన మార్పే.
 
కానీ దీని వల్ల న్యాయమూర్తుల స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బ తిం టుందనీ, రాజ్యాంగ విరుద్ధం కూడాననీ ప్రముఖ న్యాయవాది పాలి. ఎస్. నారిమన్, కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ విమర్శిం చారు. రాజకీయ పక్షపాతం, అవినీతిలకు తావు లేకుండా విజ్ఞానం, ప్రతిభ ఉన్న వారిని నియమించడంతో పాటు, ఆ ప్రక్రియను పారదర్శకంగా ఉం చడం అవసరం. న్యాయవ్యవస్థను సమగ్రంగా సంపూర్ణంగా సంస్కరించ కుండా కేవలం నియామకాలలో మార్పులతోనే ప్రయోజనం సిద్ధించగలదా? అన్న అనుమానాలూ ఉన్నాయి.  

(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 
 

మరిన్ని వార్తలు