పాతపల్లి మాదిగల్ని కాపాడేదెవరు?

17 Jul, 2015 01:09 IST|Sakshi
పాతపల్లి మాదిగల్ని కాపాడేదెవరు?

పాతపల్లి అనే గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం, వనపర్తి నియోజకవర్గంలో ఉంది. మే 1, 2015న రఘురాం అనే మాదిగ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు నూతన దంపతులిద్దరు దేవుని దర్శనం కోసం గుడిలోకి వెళ్లారు. మాదిగలు గుడిలోకి వెళ్లినందుకు పూజారి గుడిని శుద్ధి చేయించాడు. మే 2 నుంచి గుడికి తాళం వేశారు. ఆ రోజు నుంచి ఒక రకం గా బోయలు మాదిగల్ని వెలివేశారు. మాదిగలను రకర కాలుగా వేధింపులకు గురిచేశారు. మే 4న స్థానిక ఎమ్మా ర్వో గ్రామంలో ప్రజావాణి నిర్వహించాడు. మాదిగలు వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు అందుకున్న ఎమ్మార్వో మే 6న పోలీసులను తీసుకొని ఊళ్లోకి వచ్చాడు. మాదిగలను దేవాలయ ప్రవే శం చేయించాడు. అధికారులు వెళ్లిపోయాక బోయలు మాదిగల మీద దాడి చేశారు. వారికి తాగునీరు సప్లయ్ చేస్తున్న ట్యాంకర్‌ను బందు చేశారు.
 
  ఘర్షణను నివారిం చడానికి ఊళ్లోకి వచ్చిన పోలీసుల సమక్షంలోనే 400 మంది బోయలు మాదిగల్ని పరుగెత్తించి కొట్టారు. రాజకీయ నాయకులకు కూడా 180 మాదిగల ఓట్లకంటే 900 బోయల ఓట్లే సంఖ్యాపరంగా ఎక్కువ. కనుక అధి కార, ప్రతిపక్ష పార్టీల నాయకులంతా బోయలకే మద్ద తుగా ఉండటం వలన అధికార యంత్రాంగమంతా బోయలను కాపాడుతోంది. ఇప్పటివరకు ఆ ఊరికి చాలామంది దళిత నాయకులు, ప్రజా సంఘాల నాయ కులు వెళ్లి మాదిగల పోరాటానికి మద్దతు పలికారు. కానీ ఏ నాయకుడు కూడా వాళ్ల వెంట స్థిరంగా ఉండి పోరాటాన్ని నడిపింది లేదు. రెండు నెలలుగా పాతపల్లి మాదిగలు ఆత్మగౌరవం కోసం, భూమి కోసం పోరాటం చేస్తున్నా న్యాయం జరగటం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘మాది దళిత శ్రేయస్సు కోరే ప్రభుత్వమని’ చెబుతున్నది. మరి దళితుల మీద దాడులు జరుగుతుం టే, మాదిగల్ని వెలివేస్తుంటే మౌనంగా ఎందుకు ఉంది?
 
 చాలా మంది బీసీ మేధావులు ఎస్సీ సమాజాన్ని ఆధారం చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్యత గురించి మాట్లాడుతుంటారు. కానీ వాళ్ల కులాలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు. వీలు దొరికితే మావోయిస్టులను విమర్శించే ఈ మేధావు లకు ఈ దాడులు కనిపించవు. అగ్రకుల బ్రాహ్మణీయ సంకెళ్ల నుంచి బీసీ కులాలను బయటికి తీసుకొచ్చే పనిని ఈ మేధావులు చేయకపోతే రాబోయే రోజుల్లో దళితులకు బీసీలకు మధ్య వైరుధ్యం తీవ్రమవుతుంది. ఇప్పటికే చాలాచోట్ల దళితుల మీద దాడులు చేస్తున్నది బీసీలే. నడుస్తున్న చరిత్రలో దళిత, బీసీ మేధావులు పాతపల్లి ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పాలి.
 (వ్యాసకర్త డా॥సి.కాశీం)
 అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ: 97014 44450
 

మరిన్ని వార్తలు