ప్రజా ప్రతినిధులు జవాబుదారీ వహించరా?

25 Mar, 2016 00:53 IST|Sakshi
ప్రజా ప్రతినిధులు జవాబుదారీ వహించరా?

ఎమ్మెల్యే సమాచార హక్కు చట్టం కింద ఎందుకు జవాబుదారీ కాకూడదు? ఎమ్మెల్యేలతో కూడిన లెజిస్లేచర్ పార్టీని పబ్లిక్ అథారిటీగా ఎందుకు పరిగణించకూడదు? ఎమ్మెల్యే ఎంపీలు, సభాపక్షాలు, రాజకీయ పార్టీలు ఆర్టీఐ కింద ఎందుకు జవాబు చెప్పకూడదో ఆలోచించాలి.
 
నిజమైన పాలనాధికారం అధికారంలో ఉండే రాజకీయ పార్టీలదే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు కీలక మైన శాఖలలో కొనసాగుతు న్నప్పటికీ వారిపైన ఉండే మంత్రులు, ముఖ్యమంత్రులే పాలిస్తారు. కీలకమైన నిర్ణ యాలను తీసుకుంటూ, రాష్ట్రపతికి, గవర్నర్లకు సలహాలు ఇస్తూ వారే పరిపా లిస్తారు. వీరంతా ఎన్నికైన శాసనసభ్యుల నుంచే ఎంపికవుతారు. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత రాజకీయ పార్టీలది. సభాపక్షాలే ప్రభుత్వాలను గానీ ప్రతిపక్షాలను గానీ ఏర్పాటు చేస్తాయి.

తమను నిలబెట్టిన పార్టీని వదిలి మరో పార్టీకి ఫిరాయించే ప్రతినిధులకు సమాచార హక్కు చట్టం కింద జవాబు చెప్పే బాధ్యత లేదా? తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థులను, పార్టీలను, సభాపక్షాలను నిలదీసే శక్తి ఆర్టీఐకి లేదా?
 నాగాలాండ్ నుంచి ఎన్నికైన ఒక ఎమ్మెల్యే నెఫ్రిజో కెడిట్సు తాను ఎంబీబీఎస్ చదివిన డాక్టరునని అంటూనే, తాను పూర్తి కాలపు వ్యాపారినని కూడా చెప్పుకున్నారు. మరి ఆయన డాక్టరా లేక వ్యాపారా? తెలియజేయాలని, వైద్యశాస్త్ర పట్టా ప్రతిని ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు.

డిగ్రీ సర్టిఫికెట్ ప్రతిని యూనివర్సిటీ నుంచే అడగాలని, అదీ గాక అది ఆయన వ్యక్తిగత సమాచారమని, ఇవ్వడం కుదరదని చెప్పారు. ఎమ్మెల్యే కెడిట్సుపైన వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణ గురించి ఆయనకు చెప్పుకునే అవ కాశం ఇవ్వకుండా, ఆయన వైద్య పట్టా గురించిన సమా చారం ఇవ్వాలో లేదో నిర్ణయించకూడదు. ఇది తీవ్ర వివాదమై హైకోర్టులో రిట్ పిటిషన్‌లను కూడా దాఖలు చేశారు. కెడిట్సు గారిని ఎంచుకున్న రాజకీయ పార్టీ నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు ఇటువంటి ప్రశ్నలకు జవాబు ఇచ్చే బాధ్యత ఉండదా? ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడిన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వారి లెజిస్లేచర్ పార్టీ ఎందుకు జవాబుదారీ కాదు?

 రామ్‌చరిత్ అనే ఎంపీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. కాని, ఆయన కులం షెడ్యూల్డ్ కులం కాదని ఫిర్యాదు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియమించిన ఒక కమిటీ ఈ ఫిర్యాదును విచారిస్తున్నది. ఈ కుల వివాదం కూడా కోర్టుల్లో ఉంది. ఈ వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేసే ముందు కులాన్ని పరిశీలించవలసిన బాధ్యత ఉన్న బీజేపీ రాజకీయ పార్టీ దీనికి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదా? ఎంపికైన ఎంపీలతో కూడిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ వివాదంపైన వచ్చే ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసిన పనిలేదా?

 ఒక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి తను ఇల్లు మారానని, అందుకని తన ఓటును ఆ ఇంటి చిరునామాతో మార్చాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఓటు మారిందో లేదో గానీ, ఆ ఎమ్మెల్యే ఓటు మార్పు సంబంధిత పత్రాల ప్రతులన్నీ తనకు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద వకీలు నీరజ్ కోరాడు. దానికి జిల్లా ఎన్నికల అధికారి ప్రతిస్పందిస్తూ ఆ దరఖాస్తును ఆ ఎమ్మెల్యే తరువాత ఉపసంహరించుకు న్నారని, కనుక తాము ఏ పత్రమూ ఇవ్వలేమని జవాబు ఇచ్చారు. నీరజ్ కేంద్ర సమాచార కమిషన్ ముందు అప్పీలు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ నివాసి అయిన ఆ ఎమ్మెల్యే తాను ఢిల్లీ నివాసిని అని చెప్పుకుంటూ, ఓటు మార్పును కోరారు కనుక ఆ పత్రాలన్నీ తనకు ఇవ్వాలని వకీలు వాదించారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 5(1)(సి) కింద ఢిల్లీ నివాసి కాని వ్యక్తికి ఢిల్లీ పౌరుడిగా ఓటరు కార్డు ఇవ్వడం సాధ్యం కాదని వాదించారు. ఫారం 8 కింద ఓటరు కార్డు మార్పు కోసం ఇచ్చిన దరఖాస్తును, ఓటు హక్కు మార్పు దరఖాస్తు ఉపసంహరణ పత్రాన్ని కూడా ఇవ్వడానికి సమస్య ఏమిటని కమిషనర్ అడిగారు. ఎమ్మెల్యే మూడుసార్లు అడ్రసు మారానంటూ ఫారం 8 ద్వారా మార్పు కోరుకున్నారని, తప్పుడు అడ్రసుతో ఓటరు కార్డుకు దరఖాస్తు చేయడం నేరమని, అది రుజువు కాకుండా ఆ ఎమ్మెల్యేను కాపాడుతున్నారని నీరజ్ ఆరోపించారు. తప్పుడు సమాచారం ఇచ్చారని రుజువు చేయవలసి ఉంటుంది. ఓటు మార్పు దరఖాస్తుపై అభ్యంతరాలు కోరిన తరువాత, ఆ అభ్యంతరాలను సహాయ ఎన్నికల అధికారి పరిశీలించి తిరస్కరించారు.

ఎమ్మెల్యే ఎక్కడ నివసించే వారని విచారణ చేసే అవకాశం సమాచార కమిషనర్‌కు ఉండదు. కోరిన సమాచారం ప్రభుత్వ అధికారి దగ్గర ఉన్నదా, లేదా? ఉంటే ఇవ్వవచ్చునా, లేదా? అనేదే నిర్ణయించవలసిన సమస్య. ఎమ్మెల్యే ఓటు మార్పు కోసం ఇచ్చిన దరఖాస్తు ఉపసంహరణ వల్ల రద్దయిందని కనుక ఇవ్వలేమని నీరజ్‌కు జవాబిచ్చారు. నీరజ్ ఇవికాక మరికొంత సమాచారం కోరారు. ఆ సమాచారం ఎమ్మెల్యే గారే చెప్పగలుగుతారు కాని అధికారులు ఇవ్వజాలరు.

అడ్రసు వివరాలు ఎమ్మెల్యేకు మాత్రమే పరిమి తమైన సమాచారం. కనుక ఆ సమాచారం ఇవ్వాలంటే అందుకు ఆయననే అడగాల్సి ఉంటుంది. ఆయన అభ్యంతరాలను తెలుసుకునే అవసరం కూడా ఉంది. ఎమ్మెల్యే సమాచార హక్కు చట్టం కింద ఎందుకు జవాబుదారీ కాకూడదు? ఎమ్మెల్యేలతో కూడిన లెజిస్లేచర్ పార్టీని పబ్లిక్ అథారిటీగా ఎందుకు పరిగణిం చకూడదు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, సభాపక్షాలు, రాజకీయ పార్టీలు ఆర్టీఐ కింద ఎందుకు జవాబు చెప్ప కూడదో ఆలోచించాలి(ఈ మూడు కేసుల్లో జవాబు చెప్పాలని సీఐసీ నోటీసులు జారీ చేసింది).
 
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 - మాడభూషి శ్రీధర్

 professorsridhar@gmail.com

>
మరిన్ని వార్తలు