అంతుచిక్కని రియల్ ఎస్టేట్ ధరల చిత్రం

3 Jul, 2016 18:15 IST|Sakshi
అంతుచిక్కని రియల్ ఎస్టేట్ ధరల చిత్రం

అవలోకనం
ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాల్లోకంటే రవాణా, ఆహారం చాలా చౌకగా ఉండే మన నగరాల్లో ఆస్తుల ధరలు విపరీతంగా ఎక్కువ. ఎందుకు అనేదే అంతుచిక్కని ప్రశ్న. మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకపోవడం చాలా ఎక్కువ. అయినాగానీ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి దేశంలోని ప్రతి నగరంలోనూ ఈ ఆస్తులను కొంటున్న వ్యక్తులు ఎవరు అనేదాన్ని అది వివరించదు. ఇంత ఖరీదైన ఈ ఫ్లాట్లను ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి ఎలా వారింత డబ్బును సంపాదిస్తున్నారు?
 
 కొన్నేళ్ల క్రితం నేను ముంబైలో ఉండగా క్రితం రోజునే కొన్న నా కారును బాంద్రాలోని నా ఇంటి బయట నుంచి ఎవరో దొంగిలించారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి నేను పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, సీనియర్ ఇన్‌స్పెక్టర్‌ను కలవమని చెప్పారు. ఆ ఇన్‌స్పెక్టర్ దాదాపు  50 ఏళ్లుండే లావాటి మనిషి . ఆయన తన డెస్క్‌వద్ద ఒక వార్తా పత్రికలోని వర్గీకృత ప్రకటనలను చూస్తూ సున్నాలు చుడుతున్నాడు. నా కారు దొంగతనానికి గురైన సంగతి చెప్పాక, ఏం చేస్తున్నారని నేను ఆయనను అడిగాను.

 త్వరలోనే తాను రిటైర్ కాబోతున్నానని, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. భార్య ఇల్లు కొనమని ఒత్తిడి చేస్తోంది, తమకు అందుబాటులో ఉన్న కొన్ని ప్రకటనలకు ఆయన గుర్తులు పెడుతున్నారు. ఏమైనా దొరికాయా? అని అడిగాను. ఆయన నవ్వేస్తూ ‘‘నేను కొనగలిగేవి ఏవీ ఇక్కడ లేవు’’ అన్నాడు.  భారత నగరాలకు సంబంధించిన విచిత్రమైన విషయాలలో ఒకటి ఆస్తుల విలువ అతి ఎక్కువగా ఉండటం. నేను తరచుగా ఆఫీసుకి సైకిల్‌పై వెళు తుంటాను. లేదా ఏ వాన వల్లనో సైకిల్‌పై వెళ్లలేకపోతే టాక్సీలో వెళతాను.
 
ఆ ఆరు కిలోమీటర్ల దూరానికి ట్రాఫిక్‌ను బట్టి టాక్సీకి 85 నుంచి 100 రూపాయలు వరకు అవుతుంది.  ప్రపంచంలోని ఏ పెద్ద నగరంలోనూ ఇంత తక్కువ ధరకు టాక్సీ దొరకడం అసాధ్యం. లండన్‌లో ఇదే దూరానికి రూ.1,200 అవుతుంది. న్యూయార్క్, టోక్యో, హెల్సెంకి, పారిస్‌ల విషయంలోనూ ఇది నిజం. దుబాయ్, షాంఘైలలో అతికొద్దిగా తక్కువ కావచ్చుగానీ, నేనిప్పుడు ఉంటున్న బెంగళూరు నగరంలోకంటే చౌక మాత్రం కాదు. ఆహారం విషయం లోనూ ఇదే పరిస్థితి. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రూ. 50లకు సమంజస మైనంత మంచి భోజనం దొరుకుతుంది. అయితే నేను పైన పేర్కొన్న నగరాల న్నిటిలోనూ అది అసాధ్యం.

 లండన్‌లో రూ.50 అంటే అర పౌండు లేదా న్యూయార్క్‌లో దాదాపు 70 సెంట్లు. అంటే చిల్లర మాత్రమే. అదే ఆస్తుల విలువకు వస్తే పరిస్థితి తలకిం దులవుతుంది. నేనుండే భవనానికి పక్కన ఉన్న కొత్త భవనంలో రెండు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి, ధర రూ.7 కోట్లు చెబుతున్నారు. రెండు వందల గజాల దూరంలోని మరో భవనంలో కూడా రెండు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. వాటి ధర కూడా రూ. 5 కోట్లకుపైనే. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కనీసం రెండు డజన్ల ఆస్తుల అమ్మకం ప్రకటనల హోర్డింగులు ఉంటాయి. వాటిలో చాలా వరకు ధరలను పేర్కొంటాయి. ఏదీ రూ.4 కోట్లకు తక్కువ కాదు. ఇవన్నీ నగర శివార్లలోని ఆస్తులే. ప్రాథమికమైన, మధ్యతరగతి ఇళ్ల హోర్డింగులు కూడా కొన్నిసార్లు కన బడుతుంటాయి గానీ అవి కూడా చౌకేమీ కావు.

నేను బాంద్రాలో ఉండేటప్పుడు అద్దె ఇళ్లలో ఉండేవాడిని. ఆ ప్రాంతాల్లో నేడు నెలకు అద్దె రూ. 1.5 లక్షల నుంచి, ఫ్లాట్ల ధరలు రూ. 7 కోట్ల నుంచి మొదల వుతాయి. అవేమీ అత్యధునాతనమైన భవనాలూ కావు, ప్రత్యేక సదుపాయాలూ ఉండవు... ప్రాథమికమైన రెండు పడక గదుల అపార్ట్‌మెంట్లే.  ఆ ధరకు మీకు న్యూయార్క్, లండన్‌లలో నగరం మధ్యనే మంచి ఇల్లు దొరుకుతుంది. రూ. 7 కోట్లు అంటే 10 లక్షల డాలర్లు. ప్రపంచంలోని ఏ నగ రంలోనైనా చక్కటి నివాసం దొరుకుతుంది.
 మన రియల్ ఎస్టేట్ ఆస్తులను రూపాయి నిజమైన విలువలోకి మార్చి చూస్తే అవి మరింత ఖరీదైనవిగా ఉండటం నిజంగానే విచిత్రం. కొనుగోలుశక్తి సమతుల్యత ఆధారంగా చూస్తే మన ఒక రూపాయి 3 డాలర్లకంటే ఎక్కువ. అంటే ఒక రూపాయి విలువతో అమెరికాలో కొనగలిగేవాటికంటే మూడు రెట్లు భారత్‌లో  కొనగలుగుతారు. అదే తర్కాన్ని అన్వయించి చూస్తే రూ.7 కోట్ల ఫ్లాటు ఇప్పుడు రూ.21 కోట్లవుతుంది.

కాబట్టే నా రూ.100 టాక్సీ చార్జీ వాస్తవంగా న్యూయార్క్‌లోని రూ.300కు సమానం. కాబట్టి అది మరీ అంత తక్కువ అనిపించదు. అలాగే నా రూ.50 భోజనం రూ. 150 అవుతుంది. అదే తర్కంతో చూస్తే రూ.7 కోట్ల ఫ్లాటు ఇప్పుడు రూ.21 కోట్లవుతుంది. ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాల్లోకంటే రవాణా, ఆహారం చాలా చౌకగా ఉండే మన నగరాల్లో ఆస్తుల ధరలు విపరీతంగా ఎక్కువ. ఎందుకు అనేదే ప్రశ్న. బ్రిటిష్‌వారు అద్భుతమైన కొన్ని నివాస ప్రాంతాలను నిర్మించి ఇచ్చారు అనేది దీనికి సులువుగా లభించే సమాధానం. ట్యూటియన్ ఢిల్లీ లేదా దక్షిణ ముంబైలో ఆస్తులు అంత ఎక్కువ ఖరీదైనవిగా ఉండటాన్ని అది వివరించవచ్చు. కానీ బెంగళూరులోని ఫ్లాట్‌లు ఇంత ఖరీదైనవిగా ఎందుకు ఉన్నాయనే విష యాన్ని మాత్రం వివరించలేదు.

ఇంత ఖరీదైన ఈ ఫ్లాట్లను ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి ఎలా వారింత డబ్బును సంపాదిస్తున్నారు? అనేది మరో విషయం. 5,430 మంది భారతీయులు మాత్రమే రూ. 1 కోటికి మించిన ఆదాయపు పన్నును చెల్లి స్తున్నారు. మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకపోవడం చాలా ఎక్కువని నాకు తెలుసు. అయినాగానీ కోట్లకు కోట్లు పెట్టి దేశంలోని ప్రతి నగరంలోనూ ఈ ఆస్తులను కొంటున్న వ్యక్తులు ఎవరు అనేదాన్ని అది వివరించదు. కొన్ని వందల మంది కార్పొరేట్ ఉద్యోగుల జీతాలు అత్యధికంగా ఉంటాయి. అలాంటి వారు ప్రధాన కంపెనీల సీఈఓలో లేదా ద్వితీయ, తృతీయ అత్యున్నత అధికారులో అయివుంటారు. అయినా అది, నా చుట్టూ కనిపిస్తున్న వేలాది ఫ్లాట్లు, వందలాది భవనాలను కొంటున్నవారెవరో వివరించలేదు. భారతదేశంలోని రియల్ ఎస్టేట్ ఆస్తుల ధరలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక ప్రాంతంలోనే విలువ సరితూగక పోవడం ఏమిటో ఎవరైనా వివరించే వారుంటే బాగుండని నేను చూస్తున్నాను.


ఆకార్ పటేల్,
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు