ఈ రాజకీయమే ఒప్పుకోం

10 Dec, 2015 08:33 IST|Sakshi
ఈ రాజకీయమే ఒప్పుకోం

(పార్లమెంటులో ఏం జరిగింది-35)
జైపాల్‌జీ... మమ్మల్ని ‘కార్నర్’ చెయ్యాలనుకోవటమే తప్పు... బిల్లు పాసవ్వటానికి అవసరమైనంత మంది సభ్యులు లేకపోతే మాదా తప్పు... బీజేపీ పార్టీ ద్రోహం
 చేయబట్టే బిల్లు పాసవ్వలేదని అప్పుడే మొదలు పెట్టేశారు...
 చిరాగ్గా చూశారు జైపాల్‌రెడ్డి.
 ‘‘కాళ్లు పట్టుకుని వదలకండి... వచ్చేదాకా వదలకండి. తెలంగాణ కోసం ఏమి చేసినా... ఇంకొక గంట టైముందంతే! వెళ్లండి’’ అంటూ స్పీకర్ చాంబర్స్ వైపు కదిలారు.
*****
 స్పీకర్ చాంబర్స్‌లో స్పీకర్ ఎదురుగా కూర్చున్నారు జైపాల్, కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్.
 ఎంపీలంతా నిలబడి ఉన్నారు. చర్చ మొదలైంది.
 కమల్‌నాథ్: ప్రభుత్వం స్పష్టంగా ఉంది. మూడు గంట లకి సభ మొదలవగానే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెడ్తాం. పాస్ చేయించే బాధ్యత మాదే అన్నారు గదా బీజేపీ వారు! పాస్ చేయించండి.
 సుష్మాస్వరాజ్: మీ మంత్రులే ‘వెల్’లోకి వచ్చి గొడవ చేస్తుంటే, మీకు మద్దతిచ్చిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు అరుస్తుంటే - మీకే బాధ్యత లేదా!
 జైపాల్‌రెడ్డి: నా మాట వినండి. ప్లీజ్
 స్పీకర్: ఇంత ప్రధానమైన బిల్లు. ఇంతటి వివాదాస్పద మైన బిల్లు. ‘డివిజన్’ చేయాలంటే... ఎలా చెయ్యమంటారు. ‘వెల్’లో వాళ్లు వాళ్ల స్థానాలకి వెళ్లాలి గదా...
 కమల్‌నాథ్: మీరు ‘డివిజన్’ అంటూ ఆటోమేటిక్ ఓటు రికార్డర్ ‘ఆన్’ చెయ్యగానే అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు రికార్డు అవ్వాలి గదా. వాళ్ల నియోజకవర్గంలో తెలియాలి గదా... వాళ్లెలా ఓటు వేశారో...
 స్పీకర్: మరింక ఇబ్బందేముంది. 3 గంటలకి మొదలు పెట్టేద్దాం!
 కమల్‌నాథ్: అదే, నేనూ అంటున్నాను. బిల్లుపెడ్తాం, డివి జన్ జరుగుతుంది. బిల్లు పాసవ్వకపోతే ఆ బాధ్యత ఎవరిది? మీరు పెట్టండి, మేము పాస్ చేస్తాం అనేవాళ్లదే గదా?!
 సుష్మాస్వరాజ్: బిల్లు పాసయితే కాంగ్రెస్ గొప్పతనం. అవ్వకపోతే బీజేపీ అసమర్థత...! ఈ రాజకీయాన్నే మేము ఒప్పుకోవటం లేదు.
 జైపాల్‌రెడ్డి: అనవసరంగా టెన్షన్ పెంచుకుంటున్నారు నా మాట వినండి.
 కమల్‌నాథ్: అంతే సుష్మాజీ... 21 మంది పార్లమెంట్ సభ్యులున్న సీమాంధ్ర కాంగ్రెస్ కంచుకోటని పణంగా పెట్టి ఇంతటి రిస్కు తీసుకుంటే, బిల్లు ఓటింగ్‌కి వస్తుందని తెలిసీ, ఇవ్వాళ మీ సభ్యులు 30 మంది గైర్హాజరైతే ఏమనుకోవాలి? మీకొక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు... సీమాంధ్రలో మీకే నష్టమూ జరగదు. మీ ఎన్డీయే సభ్యులెవ్వర్నీ ఒప్పించలేక పోయారు మీ పార్టీ సభ్యులంతా హాజరు అయ్యేలా చూడొద్దా?!
 సుష్మాస్వరాజ్: మీ మంత్రుల్ని మీరు ఒప్పించుకోలేకపో యారు. 15 మంది సీమాంధ్ర ఎంపీల్ని సస్పెండ్ చేశారు. మిగిలిన పది మందీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా... చెప్పండి. మీ పార్టీకి 21, టీడీపీకి 4 స్థానాలున్న సీమాంధ్రలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, నలుగురు స్టేట్ మంత్రులూ ఉన్నారు. ఒక్కరైనా బిల్లుకు మద్దతిస్తారా? మీ ముఖ్యమంత్రినే మీరు ఒప్పించలేకపోయారు. మీ మంత్రులకూ, ఎంపీలకూ నచ్చచెప్పలేకపోయారు... మమ్మల్ని అంటారా?
 జైపాల్‌రెడ్డి: కమల్! సుష్మాజీ! ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి... నేను పిలిస్తేనేగా వచ్చారిక్కడికి... నాకు అవకాశం ఇవ్వకుండా మీరిలా కీచులాడుకోవటం ఏం బాగాలేదు.
 సుష్మాస్వరాజ్: నిజమే జైపాల్‌జీ... మమ్మల్ని ‘కార్నర్’ చెయ్యాలనుకోవటమే తప్పు... బిల్లు పాసవ్వటానికి అవసర మైనంత మంది సభ్యులు లేకపోతే మాదా తప్పు... రెండ్రో జుల్లో పార్లమెంట్ గడువే పూర్తయిపోతోంది. కొంతమంది వెళ్లి పోయారు... బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టే బిల్లు పాసవ్వ లేదని అప్పుడే మొదలు పెట్టేశారు...
 జైపాల్ రెడ్డి: ఎందుకమ్మా- మీ వాళ్లు 30 మంది ఆబ్సెంట్ అయినంత మాత్రాన బిల్లు పాసవ్వదని అనుకుంటున్నారు? మా వాళ్లు 200 మందికిపైగా ఉన్నారు, యూపీఏలో మొత్తం 17 మంది సస్పెండయిపోయినా లెక్క సరిపోతుంది. మొత్తం 544 మంది సభ్యులూ హాజరైపోరుగదా- బిల్లు పాసే అవ్వ దని ఎలా నిర్ణయానికొచ్చేశారు?
 కమల్: జైపాల్‌గారూ... ఇదిగో అటెండెన్స్ రిజిస్టర్. కొంత మంది సంతకం పెట్టిన వాళ్లు వెళ్లిపోయి ఉండవచ్చు గాని సంతకం పెట్టకుండా ఉన్నవాళ్లెవ్వరూ సభలో ఉంటారని నేననుకోను. దీని ప్రకారం 30 మంది బీజేపీ సభ్యులైనా, కనీసం, గైర్హాజరయ్యారు.
 సుష్మాస్వరాజ్: కాంగ్రెస్ వాళ్లెంత మంది గైర్హాజరయ్యారో కూడా చెప్పండి.
 కమల్‌నాథ్: కాదంటంలేదు. కాంగ్రెస్ వాళ్లు కూడా కొం దరు రాలేదు. మీ పార్టీని నమ్ముకునే కదా మేము బిల్లు పెడ్తున్నాం...
 
 సుష్మాస్వరాజ్: జైపాల్‌జీ! మీ పార్టీకి చెందిన 106 మంది సంతకాలున్నాయి అటెండెన్స్ రిజిస్టర్‌లో...! మీకే గాదు మాకూ లెక్కలు తెలుసు!! మా వాళ్లొక 80 మంది. మొత్తం 186 మంది సభ్యులు... వీరుగాక మీ మంత్రులు. వాళ్లు హాజరుపట్టీలో సంతకాలు పెట్టరు గాని ఓటు వేస్తారు. 354లో మీరూ మేమూ కలిపి 186  మందిమి ఉన్నాం! అయినా బిల్లు పాసవ్వదనే అనుమానానికి కారణం...
కాంగ్రెస్‌వారు అందరూ ఓటు వెయ్యరని... తప్పు బీజేపీ మీదకు నెట్టడానికి చూస్తున్నారు.
 కమల్‌నాథ్: బిల్లు పాసవ్వకపోతే మా బాధ్యత కన్నా మీ బాధ్యతే ఎక్కువ సుష్మాజీ... మేము ఏకాభిప్రాయం సాధించు కోలేకపోయాం, అందరికీ తెలుసు! ప్రెసిడెంట్ పంపిన ‘బిల్లు’ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించింది. అది కూడా అందరికీ తెలుసు. బిల్లు ఓటింగ్‌కి పెట్టినప్పుడు ఎవరెలా ఓటేస్తారో మాకైతే తెలీదు.
 వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com
- ఉండవల్లి అరుణ్‌కుమార్‌

మరిన్ని వార్తలు